GVA growth
-
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్...
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది. స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది. వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం.. ‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్ రుణాలకు డిమాండ్ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. -
సామాజిక ఆర్థిక సర్వే 2017-18
రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల వాటా క్షీణించింది. 2017–18 ఆర్థిక సామాజిక సర్వే విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 తుది అంచనాల ప్రకారం జీవీఏలో వ్యవసాయం (అనుబంధ రంగాలు కాకుండా) వాటా 5.93 శాతంగా ఉంటే అది 2017–18లో 5.38 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే.. చేపలు, హార్టికల్చర్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే జీవీఏలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాట 32.75 శాతం నుంచి 34.37 శాతానికి పెరగడం గమనార్హం. ఇదే సమయంలో సేవల రంగం వాటా 44.38 శాతం నుంచి 43.55 శాతానికి, పరిశ్రమల వాట 22.87 శాతం నుంచి 22.09 శాతానికి తగ్గినట్లు సర్వే పేర్కొంది. 2016–17లో రూ. 6,34,742 కోట్లుగా ఉన్న జీవీఏ 2017–18లో 15.9 శాతం పెరిగి రూ.7,35,709 కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీవీఏకి పన్నుల ఆదాయం కలిపి దానిలోంచి సబ్సిడీలు తీయగా వచ్చే విలువ) రూ.6,95,491 కోట్ల నుంచి రూ.8,03,873 కోట్లకు చేరనుంది. -
ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది
• పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామంపై ఇక్రా అభిప్రాయం • 2016–17లో జీవీఏ వృద్ధి అంచనాలు 6.6 శాతానికి తగ్గింపు ముంబై: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఆర్థిక రంగ కార్యకలాపాలు తిరిగి గాడిన పడడానికి చాలా సమయం తీసుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17)లో దేశ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతానికి తగ్గించింది. ‘‘నోట్ల లభ్యత వచ్చే జనవరి చివరి నాటికి గణనీయంగా మెరుగుపడినా, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జీవీఏ అంచనాలను 2016–17 సంవత్సరానికి 6.6 శాతానికి తగ్గిస్తున్నాం’’ అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. నాలుగో త్రైమాసికంలో ఆర్థికరంగ కార్యకలాపాల పునరుద్ధరణ తీరు నగదు సరఫరా పరిస్థితులు, డిజిటల్ లావాదేవీలకు ఓ సంకేతంగా భావించవచ్చని పేర్కొంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 19 వరకు కొత్త నోట్లు రూ.5.9 లక్షల కోట్ల విలువ మేర వ్యవస్థలోకి సరఫరా చేసినట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకుల్లో జమ అయిన పెద్ద నోట్ల విలువలో ఇది 38 శాతం. నివేదికలోని అంశాలు..: ⇔ కొన్ని రంగాల్లో ఆదాయం నష్టపోవడం, వినియోగాన్ని వాయిదా వేయడం, 2016–17 ద్వితీయార్ధంలో సామర్థ్య వినియోగంపై ప్రభావం చూపుతుంది. ప్రైవేటు రంగంలో సామర్థ్య విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయి. ⇔ ప్రస్తుత తీరులోనే వివిధ విలువ గల కొత్త నోట్లను విడుదల చేస్తూ వెళితే 2017 జనవరి చివరి నాటికి ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. ⇔ నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై దృష్టి వల్ల మధ్య కాలానికి అవ్యవస్థీకృత రంగం పోటీ తత్వం తగ్గుతుంది. ⇔ జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులోని నిబంధనల ప్రకారం 2017 సెప్టెంబర్ 16లోపు అమలు చేయాల్సి ఉంది. జీఎస్టీకి మళ్లాక వివిధ విభాగాల ఉత్పత్తులపై తుది పన్ను రేట్లు అనేవి ధరల కదలికలపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పు సమయంలో కొనుగోళ్ల వాయిదా లేదా ముందుగానే కొనుగోళ్లు జరపడం చోటుచేసుకోవచ్చు.