ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది
• పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామంపై ఇక్రా అభిప్రాయం
• 2016–17లో జీవీఏ వృద్ధి అంచనాలు 6.6 శాతానికి తగ్గింపు
ముంబై: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఆర్థిక రంగ కార్యకలాపాలు తిరిగి గాడిన పడడానికి చాలా సమయం తీసుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17)లో దేశ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతానికి తగ్గించింది. ‘‘నోట్ల లభ్యత వచ్చే జనవరి చివరి నాటికి గణనీయంగా మెరుగుపడినా, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది.
ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జీవీఏ అంచనాలను 2016–17 సంవత్సరానికి 6.6 శాతానికి తగ్గిస్తున్నాం’’ అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. నాలుగో త్రైమాసికంలో ఆర్థికరంగ కార్యకలాపాల పునరుద్ధరణ తీరు నగదు సరఫరా పరిస్థితులు, డిజిటల్ లావాదేవీలకు ఓ సంకేతంగా భావించవచ్చని పేర్కొంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 19 వరకు కొత్త నోట్లు రూ.5.9 లక్షల కోట్ల విలువ మేర వ్యవస్థలోకి సరఫరా చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకుల్లో జమ అయిన పెద్ద నోట్ల విలువలో ఇది 38 శాతం.
నివేదికలోని అంశాలు..:
⇔ కొన్ని రంగాల్లో ఆదాయం నష్టపోవడం, వినియోగాన్ని వాయిదా వేయడం, 2016–17 ద్వితీయార్ధంలో సామర్థ్య వినియోగంపై ప్రభావం చూపుతుంది. ప్రైవేటు రంగంలో సామర్థ్య విస్తరణ ప్రణాళికలు కూడా ఆలస్యం అవుతాయి.
⇔ ప్రస్తుత తీరులోనే వివిధ విలువ గల కొత్త నోట్లను విడుదల చేస్తూ వెళితే 2017 జనవరి చివరి నాటికి ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది.
⇔ నోట్ల రద్దు, డిజిటల్ లావాదేవీలపై దృష్టి వల్ల మధ్య కాలానికి అవ్యవస్థీకృత రంగం పోటీ తత్వం తగ్గుతుంది.
⇔ జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులోని నిబంధనల ప్రకారం 2017 సెప్టెంబర్ 16లోపు అమలు చేయాల్సి ఉంది. జీఎస్టీకి మళ్లాక వివిధ విభాగాల ఉత్పత్తులపై తుది పన్ను రేట్లు అనేవి ధరల కదలికలపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పు సమయంలో కొనుగోళ్ల వాయిదా లేదా ముందుగానే కొనుగోళ్లు జరపడం చోటుచేసుకోవచ్చు.