GVMC employees
-
ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు!
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఆ కుర్చీని వదిలేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. కీలమైన ఉద్యోగి ఏదైనా అక్రమాలకు పాల్పడినప్పుడు కదల్చాలని ప్రయత్నించినా ‘మేనేజ్’ చేసుకుంటూ ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. అవకతవకలకు పాల్పడుతూ కొంతమంది ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. రిటైర్ అయ్యే చివరి క్షణం వరకు చేయిచాపే పనులు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్లను బినామీలుగా మార్చుకుంటూ కార్పొరేషన్ ఖజానాను దోచేస్తున్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి అత్యధిక మంది విధులు నిర్వర్తిస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల కార్పొరేషన్ నిధులతో పాటు, వివిధ గ్రాంట్లతో కలిపి మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే పనులు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడి నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, తాము పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా కొందరు అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచెయ్యాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో బదిలీ జీవోలు వచ్చినా వాటిని తొక్కిపెట్టి అక్కడే విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం కూడా చాలా జోన్లలో ఏళ్లతరబడి పాతుకుపోయినవారే పనిచేస్తున్నారు. చివరి రోజుల్లో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉండాలని, అవినీతి మరక పడకూడదని అంతా అనుకుంటారు. కాని జీవీఎంసీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ నెల 30న పదవీవిరమణ పొందనున్న జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడమే. చివరి నిమిషం వరకూ దోచుకోవాలనే దాహంతో కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. పదోన్నతులు వదులుకుంటూ..? ఎవరైనా ఉద్యోగికి పదోన్నతి వస్తే ఎగిరి గంతేస్తారు. ప్రమోషన్ వచ్చిన చోటికి ఆగమేఘాల మీద వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. కాని కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ప్రమోషన్ వచ్చినా పట్టించుకోరు. దాన్ని వదులుకొని జీవీఎంసీలోనే కొనసాగేందుకు లాబీయింగ్ చేస్తూ ప్రమోషన్‌ను సైతం రద్దు చేసుకుంటున్నారు. ప్రధాన కార్యాలయంలో ఆర్వో గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి రెండేళ్ల క్రితం అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి తీసుకుంటే వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లాలి. కాని తన పలుకుబడితో ప్రమోషన్‌ను రద్దు చేయించుకొని కార్పొరేషన్లోనే ఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే మాదిరిగా ఓ మహిళా ఉద్యోగి కూడా ప్రమోషన్‌ను వదులుకొని ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ అయినా నెలరోజ్లులోనే తిరిగి ఇక్కడ పోస్టింగ్ సంపాదించుకుంటూ అదే కుర్చీకి ఇంజినీర్లు అతుక్కుపోతున్నారు. ఐదుగురు ఇంజినీర్లు ట్రాన్స్‌ఫర్‌పై అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేశారు. మెకానికల్ విభాగంలో ఓ ఇంజినీరింగ్ అధికారికి డీఈ హోదా పదోన్నతి లభించినా.. దాన్ని డీగ్రేడ్ చేసుకొని ఏఈగానే కొనసాగుతున్నారంటే ఆ పోస్టు ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన ఏసీబీ దాడులతో ఇంజినీరింగ్ విభాగంలో దడపుడుతోంది. ఏసీబీ వలలో చిక్కిన ఈఈకి ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు ఓ ఇంజినీరింగ్ అధికారికి సైతం బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా కార్పొరేషన్లో తిష్టవేసిన అధికారులే ఇష్టారాజ్యంగా పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత బదిలీలకు శ్రీకారం చుట్టి కార్పొరేషన్ని ప్రక్షాళన చేస్తే కొంతవరకు అవినీతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. మెకానికల్ మాయాజాలం ఇక మెకానికల్ విభాగమంటే.. జీవీఎంసీ కమిషనర్ సైతం చేతులెత్తేసే పరిస్థితి దాపురించింది. ఎవరిని మార్చినా ఆ అధికారులు వారందర్నీ ఏమార్చి కమిషన్ల వేట కొనసాగిస్తున్నారు. మెకానికల్‌లో ఓ ఇంజినీరింగ్ అధికారి కాంట్రాక్ట్‌ల విషయంలో చక్రం తిప్పుతున్నారు. టీడీపీ హయాంలో ఓ ఎమ్మెల్యేకు అనుచరుడిగా ఉంటూ ఇప్పటికీ వారు చెప్పిందే వేదంగా పనులు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా కార్పొరేషన్లో పనిచేస్తూ ఇంజినీర్ హోదాకు వచ్చిన ఆ అధికారి మెకానికల్‌లో ఉన్న లొసుగుల్ని క్యాష్ చేసుకుంటున్నారు. టెండర్ల విషయంలో కమిషనర్‌ను సైతం తప్పుదారి పట్టించి తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జీవీఎంసీ కమిషనర్ ఈ విభాగంలో అంతర్గత బదిలీలు చేసినా మార్పు మాత్రం కనిపించడం లేదు. వారు చెప్పిందే వేదం ఓ స్థాయి పదోన్నతి లభిస్తే చాలు.. ఆ కుర్చీ నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తూ.. అందులో లోటుపాట్లు, ఇతర విషయాలపై పూర్తి పట్టుసాధించి శాసిస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం ఏమార్చుతూ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎటువైపు నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది, తమ జేబులు ఎలా నింపుకోవాలన్న ఆలోచనతోనే వీరు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఓ అధికారి కొన్నేళ్ల క్రితం అ..ఆ..ల నుంచి ప్రారంభించి ఇప్పుడు అన్నీ తానే అనే స్థాయికి ఎదిగిపోయారు. ఆయనను బదిలీచేస్తూ గతంలో జీవోలు వచ్చినా తన పలుకుబడితో అమలుకాకుండా చూసుకున్నారు. యూసీడీ విభాగంలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగి సైతం అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారి అండతో తోపుడు బళ్ల వ్యాపారుల వద్ద నుంచి లక్షలు గుంజుకుంటూ పంచుకుంటున్నారు. చదవండి: అంతా మా ఇష్టం: అక్కడవన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు -
ఆశ పడింది.. అడ్డంగా దొరికింది
సాక్షి, అనకాపల్లి: కాసులకు కక్కుర్తిపడిన జీవీఎంసీ ఉద్యోగిని అడ్డంగా ఏసీబీకి చిక్కింది. ఆరేళ్ల చరిత్ర కలిగిన జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఇదే తొలి ఏసీబీ కేసు. పబ్లిక్‌హెల్త్ వర్కర్ పదవీ విరమణ చేసిన తర్వాత వారి పీఎఫ్ సొమ్ముకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం లంచం తీసుకుంటుండగా జూనియర్ అకౌంటెంట్ తనకాల దేవీలక్ష్మిని పట్టుకున్నామని అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ కె.రంగరాజు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో పబ్లిక్‌హెల్త్ వర్కర్‌గా పని చేసిన ఎర్రంశెట్టి సుభద్ర గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేశారు. ఆమెకు రావాల్సిన పీఎఫ్ సొమ్ము కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రక్రియ పూర్తికి జూనియర్ అకౌంటెంట్ దేవిలక్ష్మి 10 వేల రూపాయలను డిమాండ్ చేసింది. సుభద్ర రూ.8 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తొ లి విడగతగా రూ.6 వేలు ఇచ్చేం దుకు అంగీకరించింది. అయితే లం చం ఇవ్వడం ఇష్టలేని సుభద్ర కుమారుడు శివ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన సలహా మేరకు మంగళవారం ఆరు వేలు రూపాయలను దేవిలక్ష్మికి ఇచ్చేందుకు జీవీఎంసీ కార్యాలయానికి శివ వెళ్లాడు. డబ్బులను కార్యాలయం పక్కన ఉన్న ట్రాక్టర్ వద్ద దేవిలక్ష్మికి ఇచ్చాడు. డబ్బులను తీసుకున్న ఆమె కార్యాలయంలో వేరేగదిలో ఉన్న మరో మహిళ ఉద్యోగిని చేతికి ఇచ్చారు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వేరొక విభాగానికి చెందిన గదిలో ఉన్న దేవీలక్ష్మిని తన అసలు సీటు వద్దకు రావాలని సూచించారు. బీ–1గా పని చేస్తున్న దేవి తన కుర్చీలో ఆశీనులైన వెంటనే ఆమె రెండు చేతులు ఓ మహిళా అధికారిని పట్టుకొని నిజం చెప్పమని హెచ్చరించారు. నిజం చెప్పకపోతే కఠినంగా సమాధానం రాబట్టాల్సి వస్తుందని హెచ్చరించడంతో లంచం తీసుకున్న వాస్తవాన్ని దేవి అంగీకరించింది. దీంతో ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు నేతృత్వంలోని సీఐలు ఎం.వి.గణేష్, ఎం.యు.రమణమూర్తి, కె.లక్ష్మణమూర్తి, జి.అప్పారావు ఆమెను విచారించారు. ఏసీబీని ఆశ్రయించిన శివ నుంచి కూడా వివరాలు సేకరించి ఛార్జ్‌షీటు ఫైల్ చేశామని డీఎస్పీ కె.రంగరాజు మీడియాకు వివరించారు. జూనియర్ అకౌంటెంట్ దేవిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కాగా సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు జీవీఎంసీ కార్యాలయంలోనే ఉండడంతో మిగిలిన విభాగాల అధికారులు భయం భయంగా గడిపారు. పని జరగాలంటే చేయి తడపాల్సిందే! జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఎటువంటి ఫైల్ కదలాలన్నా ఎంతోకొంత పైకం ముట్టచెప్పాల్సిందేననే ఆరోపణలున్నాయి. చిన్న పని చేసి పెట్టాలన్నా ఇక్కడి ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తారని బాధితులు చెబుతుంటారు. ఉద్యోగుల మధ్య విభేదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అనకాపల్లి జోన్ పరిధిలో ఒక ఉద్యోగి గతంలో మరణించాడు. సబార్డినేట్ హోదాలో ఉన్న సదరు ఉద్యోగి కుమారినికి మళ్లీ కారుణ్య నియామం ద్వారా ఉద్యోగం వచ్చేందుకు రూ. లక్షా 20వేలు సమర్పించుకోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఇది ఉదాహరణ మాత్రమే. ఇక్కడ ఏ పని జరగాలన్నా ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా 1992లో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతన్ని పుట్టకున్నారు. -
చేతకాకపోతే వెళ్లిపోండి..?
విశాఖ సిటీ: ‘నిధులు ఉన్నా.. పనులెందుకు పూర్తి చేయడం లేదు.? పని చేయడం మీకు ఇష్టం లేదా.? ప్రభుత్వ పనుల విషయంలోనే ఇంత జాప్యం చేస్తున్నారంటే ఇక ఇతర పనులెలా చేస్తారో అర్థం చేసుకోవచ్చు’ అని జీవీఎంసీ ప్రాజెక్ట ఎస్ఈ వెంకటేశ్వరరావుపై పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో శుక్రవారం స్మార్ట్ సిటీ, గృహ నిర్మాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ కాపీ షీట్లను ఉన్నతాధికారులకు అందివ్వకపోవడంపై చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్పొరేషన్ల నుంచి కాపీలు వచ్చినా.. జీవీఎంసీ నుంచి ఒక్కటి కూడా అందకపోవడంపై మండిపడ్డారు. అమరావతిలో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కూడా సకాలంలో గృహ నిర్మాణాల మ్యాప్‌లు, ఇతర వివరాలు అందిస్తున్నారనీ, ఇక్కడ మాత్రం ఏదైనా సమాచారం అడిగితే చూస్తాను, చేస్తానంటూ రెండు మూడు రోజులు కాలయాపన చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోండంటూ వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీ పనుల్లో జరుగుతున్న జాప్యంపైనా మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. రూ.399 కోట్లకు రూ.113 కోట్ల పనులు మాత్రమే పూర్తవ్వడమేంటని, పనితీరును మార్చుకోవాలంటూ ఎస్ఈ వెంకటేశ్వరరావును హెచ్చరించారు. నిర్దేశించిన గడువులోపు అన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో పూర్తి.. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ మొదటి విడత గృహ నిర్మాణంలో భాగంగా 4120 ఇళ్ల పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయన్నారు. విశాఖలో గృహనిర్మాణానికి స్థలం కొరత సమస్యగా మారుతోందని, దీన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 15 నుంచి 25 రోజుల్లోగా ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్న ప్రజలకు సంబంధించిన 400 నుంచి 500 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ భూ సమీకరణ పూర్తయితే ప్రస్తుతం మంజూరైన 57,499 ఇళ్లతో పాటు మరో 30 వేల ఇళ్లు కార్పొరేషన్ పరిధిలో మంజూరవుతాయన్నారు. స్మార్ట్ సిటీకి ఇంతవరకూ రూ.113 కోట్లతో 17 పనులు పూర్తయ్యాయనీ, రూ.314 కోట్లతో జరుగుతున్న మరో 10 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రూ.245 కోట్లు విలువ చేసే 9 పనులు టెండర్ దశలో ఉండగా, రూ.95 కోట్లు విలువ చేసే 6 పనులు డీపీఆర్ దశలో ఉన్నాయన్నారు. రూ.750 కోట్లతో పలు శాఖలతో కలిసి పనులు చేపడుతున్నట్లు వివరించారు. డిసెంబర్ 31కి స్మార్ట్ సిటీకి సంబంధించిన రూ.395 కోట్లు విలువ చేసే పనులన్నీ పూర్తయ్యేలా డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించానన్నారు. ఈ సమీక్షలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పి.జి.వి.ఆర్.నాయుడు, విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద సత్యనారాయణ తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, వుడా వీసీ, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ బసంత్‌కుమార్, వుడా సెక్రటరీ శ్రీనివాస్, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయం ఆలోచించండి సమీక్షలో భాగంగా.. గృహ నిర్మాణంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి గంటా మాట్లాడుతూ ఇంత వరకూ ల్యాండ్ పూలింగ్ చేయలేదు, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇంకా సమయం 8 నెలలు మాత్రమే ఉంది. ఈ 8 నెలల్లో ఏం పూర్తి చేస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందిస్తూ ల్యాండ్ పూలింగ్ జీవో వచ్చిన వెంటనే పనులు చేపడతామని జవాబిచ్చారు. -
విశాఖలో అవినీతి చేపలు ; ఏసీబీ వల
సాక్షి, విశాఖపట్నం : అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఏసీబీ షాకించ్చింది. విశాఖపట్నం జిల్లా మదనపల్లె వీఆర్వో వెంకటేశ్వరరావు, మద్దెలపాలెం వీఆర్వో ఏవో వెంకటేశ్వరరావు, మాల్కాపురం సంజీవ్ కుమార్, జీవీఎంసీ 3వ జోన్ చైన్మన్ నాగేశ్వరరావుల ఇళ్లల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
దళారుల మహాపెత్తనం
- జీవీఎంసీలో బ్రోకర్ల హడావుడి - ఉద్యోగులతో సమానంగా చెలామని - అధికారులతో తెరచాటు ఒప్పందాలు - అవినీతి చక్రం తిప్పుతున్న కొందరు విశాఖపట్నం సిటీః వారు జీవీఎంసీ ఉద్యోగులు కాదు. కానీ ఉద్యోగులొచ్చే సమాయానికి ముందే వస్తుంటారు. ఏదైనా పనిపై వచ్చిన వారు ఆఫీసర్ రాలేదా అంటే వచ్చేస్తారంటూనే వారితో మాట కలుపుతారు. సర్ వచ్చిన వెంటనే ఎవరెవరు వచ్చారో ఆఫీసర్ అడక్కుండానే ముందే చిట్టా విప్పేస్తారు. మామూలుగా అయిపోయే పని అయితే వెంటనే సంతకం పెట్టగానే రండి మీ ఫైల్ అయిపోయిందంటూ ఫోన్ చేసి మరీ రప్పించుకుని ఎంతోకొంత తీసుకుంటారు. ఇదే అలవాటు చేసుకుని ఇప్పుడు కొందరు దళారీలుగా జీవీఎంసీలో పాతుకుపోయారు. తమకొచ్చే చేతి వాటం నుంచే అధికారులకు ‘సహాయ’పడుతుంటారు. దీంతో ఆఫీసర్ కూడా ఏ పనికైనా ఆయన్నే(దళారీ) పిలుస్తుండడంతో అంతా ఆ దళారీ చేతుల్లోనే నడుస్తుందనే భావన ఏర్పడుతోంది. ఇది మహానగర పాలక సంస్థలో అవినీతికి బాట వేస్తోంది. జీవీఎంసీలోని పట్టణ ప్రణాళిక, ఫైర్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖల్లో దళారీ వ్యవస్థ ఉంది. ప్రజారోగ్య శాఖ జోన్-3 కార్యాలయంలో ఓ హెల్త్ అసిస్టెంట్‌కు సహాయకునిగా కార్యాలయంలో తిష్ట వేసిన దళారీ సంగతి పసిగట్టి కమిషనర్ప్రవీణ్కుమార్కు కొందరు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ నేరుగా తనిఖీ చేసి ఆ దళారీ ఎవరని అడిగే సరికి కంగుతిన్న సదరు ఉద్యోగి జీవీఎంసీ ఉద్యోగేనని జవాబిచ్చాడు. అతన్ని రెండు వారాల క్రితమే సస్పెండ్ చేశారు. ఫైర్ శాఖలో బుధవారం రాత్రి ఏసీబీ దాడి చేసిన సంఘటనలోనూ ఓ దళారీ పట్టుబడ్డాడు. ఫైర్ శాఖలో ఏసీబీకి చిక్కిన లందా తారక రామకృష్ణ గత కొన్నేళ్లుగా దళారీ అవతారం ఎత్తి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. గురువారం తెల్లవారు జాము వరకూ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. అక్రమాస్తులు ఎంత మేర సంపాదించాడో కోర్టుకు నివేదిక అందజేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. వేపగుంట కేంద్రంగా ఉన్న జోన్-6 కార్యాలయంలోనూ దళారులదే రాజ్యం. గత కొన్నేళ్లుగా టౌన్‌ప్లానింగ్‌లో తిష్టవేసిన కొందరు దళారీలదే ఇప్పటికీ ఆడింది ఆట..పాడింది పాట అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ పాతుకుపోయిన ఛైన్మన్ల నుంచే భారీగా వసూళ్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరంతా కార్యాలయంలో వసూళ్లకు పాల్పడరు కాబట్టి ఎక్కడ నిర్మాణం ఉంటే అక్కడికి వెళ్తున్నారు. వసూళ్లకు పాల్పడి కొంత అధికారులకు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అనధికారిక నిర్మాణానికి గజాల లెక్కన వీరే వసూళ్లు చేసి ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ముట్టుజెప్పుతారనే ఆరోపణలున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో అర్హత ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు 20 మంది లోపే ఉన్నారు.వీరిలో కొందరు రెవెన్యూ సర్వేలకి, మరి కొందరు పుష్కర విధులకు నియమించారు. దీంతో 10 మందిలోపే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 100 మంది ఉండాల్సిన మహానగరంలో 0 మంది ఉండడంతో కొందరు దళారులు నకిలీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా అవతారమెత్తారు. భవనం ఎలా నిర్మిస్తున్నారో వీరికి అనవసరం. అడిగినంతా ఇస్తున్నారో లేదో చూసుకుంటారు.నచ్చినంతా ఇవ్వకపోతే అనధికారిక నిర్మాణం అంటూ వాట్స్ అప్‌లో ఫోటోలను కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు పెట్టేస్తున్నారు. వెంటనే ఆ భవనాన్ని కొట్టేయమంటూ ఆదేశాలిస్తుండడంతో వీరి ఆగడాలకు అడ్డూఅదపూ లేకుండా పోతోందని పలువురు భవన యజమానులతో బాటు టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు సైతం ఆవేదన చెందుతున్నారు. -
‘వీఎంసీ’దే విజయం
విశాఖపట్నం సిటీ: మహా నగర పాలక సం స్థ ఉద్యోగుల గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికల్లో గంట మోగింది. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మద్దతుతో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయదుందుభి మోగించింది. తెలుగు దేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన గుర్తింపు కార్మిక సంఘానికి జీవీఎంసీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో 700 పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించిన ‘కాగడా’ ఈసారి వెలవెలబోయింది. ఉదయం నుంచీ తొమ్మి ది చోట్ల జరిగిన పోలింగ్‌లో 3143 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం లెక్కింపు అనంతరం వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూని యన్ 153 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అదనపు డిప్యూటీ లేబర్‌కమిషనర్ ఆర్. శ్రీనివాసరావు నేతృత్వంలోని సభ్యులు ఎన్నికలను నిర్వహించారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లోనూ ఇరు యూనియన్లకు సమానంగానే ఓట్లు వస్తుండడంతో విజయం దోబూచులాడిం ది. సగం ఓట్లు లెక్కించాక వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గుర్తు గంట మోగుతుందని ధీమాతో జీవీఎంసీ నుంచి ఊరేగింపుగా అశీలుమెట్టలోని శ్రీ సంపత్ వినాయగర్ ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ లు కొట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా యూనియన్ కార్యాలయానికి వెళ్లారు. వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, బీఎంఎస్, ఇంటక్, సీఐటీయు, హెచ్ఎంఎస్ యూనియన్లు మద్దతు ఇచ్చాయి. అందరికీ న్యాయం చేస్తా విజయానికి సహకరించిన జీవీఎంసీ ఉద్యోగులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తాను. ఉద్యోగులంతా తన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా కోరుకున్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరులతో కొందరు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేశారు. తద్వారా మా గెలుపును అడ్డుకోలేకపోయినా మెజార్టీని తగ్గించగలిగారు. అవినీతి, అసమర్ధత నాయకత్వాన్ని జీవీఎంసీ నుంచి పారద్రోలేలా ఉద్యోగులిచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. -వి.వి.వామన రావు, ప్రధాన కార్యదర్శి-వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయంపై వైఎస్సార్ సీపీ హర్షం జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపర్చిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయం సాధించడంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు.