సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఆ కుర్చీని వదిలేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. కీలమైన ఉద్యోగి ఏదైనా అక్రమాలకు పాల్పడినప్పుడు కదల్చాలని ప్రయత్నించినా ‘మేనేజ్’ చేసుకుంటూ ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. అవకతవకలకు పాల్పడుతూ కొంతమంది ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. రిటైర్ అయ్యే చివరి క్షణం వరకు చేయిచాపే పనులు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్లను బినామీలుగా మార్చుకుంటూ కార్పొరేషన్ ఖజానాను దోచేస్తున్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి అత్యధిక మంది విధులు నిర్వర్తిస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల కార్పొరేషన్ నిధులతో పాటు, వివిధ గ్రాంట్లతో కలిపి మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే పనులు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడి నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, తాము పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా కొందరు అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్‌లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచెయ్యాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో బదిలీ జీవోలు వచ్చినా వాటిని తొక్కిపెట్టి అక్కడే విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం కూడా చాలా జోన్లలో ఏళ్లతరబడి పాతుకుపోయినవారే పనిచేస్తున్నారు.
చివరి రోజుల్లో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉండాలని, అవినీతి మరక పడకూడదని అంతా అనుకుంటారు. కాని జీవీఎంసీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ నెల 30న పదవీవిరమణ పొందనున్న జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడమే. చివరి నిమిషం వరకూ దోచుకోవాలనే దాహంతో కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు.
పదోన్నతులు వదులుకుంటూ..?
ఎవరైనా ఉద్యోగికి పదోన్నతి వస్తే ఎగిరి గంతేస్తారు. ప్రమోషన్ వచ్చిన చోటికి ఆగమేఘాల మీద వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. కాని కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ప్రమోషన్ వచ్చినా పట్టించుకోరు. దాన్ని వదులుకొని జీవీఎంసీలోనే కొనసాగేందుకు లాబీయింగ్ చేస్తూ ప్రమోషన్‌ను సైతం రద్దు చేసుకుంటున్నారు. ప్రధాన కార్యాలయంలో ఆర్‌వో గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి రెండేళ్ల క్రితం అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి తీసుకుంటే వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లాలి. కాని తన పలుకుబడితో ప్రమోషన్‌ను రద్దు చేయించుకొని కార్పొరేషన్‌లోనే ఆర్‌వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే మాదిరిగా ఓ మహిళా ఉద్యోగి కూడా ప్రమోషన్‌ను వదులుకొని ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ అయినా నెలరోజ్లులోనే తిరిగి ఇక్కడ పోస్టింగ్ సంపాదించుకుంటూ అదే కుర్చీకి ఇంజినీర్లు అతుక్కుపోతున్నారు.
ఐదుగురు ఇంజినీర్లు ట్రాన్స్‌ఫర్‌పై అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేశారు. మెకానికల్ విభాగంలో ఓ ఇంజినీరింగ్ అధికారికి డీఈ హోదా పదోన్నతి లభించినా.. దాన్ని డీగ్రేడ్ చేసుకొని ఏఈగానే కొనసాగుతున్నారంటే ఆ పోస్టు ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన ఏసీబీ దాడులతో ఇంజినీరింగ్ విభాగంలో దడపుడుతోంది. ఏసీబీ వలలో చిక్కిన ఈఈకి ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు ఓ ఇంజినీరింగ్ అధికారికి సైతం బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా కార్పొరేషన్‌లో తిష్టవేసిన అధికారులే ఇష్టారాజ్యంగా పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత బదిలీలకు శ్రీకారం చుట్టి కార్పొరేషన్‌ని ప్రక్షాళన చేస్తే కొంతవరకు అవినీతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు.
మెకానికల్ మాయాజాలం
ఇక మెకానికల్ విభాగమంటే.. జీవీఎంసీ కమిషనర్ సైతం చేతులెత్తేసే పరిస్థితి దాపురించింది. ఎవరిని మార్చినా ఆ అధికారులు వారందర్నీ ఏమార్చి కమిషన్ల వేట కొనసాగిస్తున్నారు. మెకానికల్‌లో ఓ ఇంజినీరింగ్ అధికారి కాంట్రాక్ట్‌ల విషయంలో చక్రం తిప్పుతున్నారు. టీడీపీ హయాంలో ఓ ఎమ్మెల్యేకు అనుచరుడిగా ఉంటూ ఇప్పటికీ వారు చెప్పిందే వేదంగా పనులు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా కార్పొరేషన్‌లో పనిచేస్తూ ఇంజినీర్ హోదాకు వచ్చిన ఆ అధికారి మెకానికల్‌లో ఉన్న లొసుగుల్ని క్యాష్ చేసుకుంటున్నారు. టెండర్ల విషయంలో కమిషనర్‌ను సైతం తప్పుదారి పట్టించి తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జీవీఎంసీ కమిషనర్ ఈ విభాగంలో అంతర్గత బదిలీలు చేసినా మార్పు మాత్రం కనిపించడం లేదు.
వారు చెప్పిందే వేదం
ఓ స్థాయి పదోన్నతి లభిస్తే చాలు.. ఆ కుర్చీ నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తూ.. అందులో లోటుపాట్లు, ఇతర విషయాలపై పూర్తి పట్టుసాధించి శాసిస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం ఏమార్చుతూ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎటువైపు నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది, తమ జేబులు ఎలా నింపుకోవాలన్న ఆలోచనతోనే వీరు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఓ అధికారి కొన్నేళ్ల క్రితం అ..ఆ..ల నుంచి ప్రారంభించి ఇప్పుడు అన్నీ తానే అనే స్థాయికి ఎదిగిపోయారు. ఆయనను బదిలీచేస్తూ గతంలో జీవోలు వచ్చినా తన పలుకుబడితో అమలుకాకుండా చూసుకున్నారు. యూసీడీ విభాగంలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగి సైతం అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారి అండతో తోపుడు బళ్ల వ్యాపారుల వద్ద నుంచి లక్షలు గుంజుకుంటూ పంచుకుంటున్నారు.
చదవండి: అంతా మా ఇష్టం: అక్కడవన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..
వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment