haider al-abadi
-
ఆ 39 మంది ఏమయ్యారో?!
బాగ్దాద్ : మూడేళ్ల కిందట మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల ఆచూకీ ఇంత వరకూ తెలియలేదని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇరాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆదివారం చెప్పారు. మూడేళ్ల కిందట అపహరణకు గురైన 39 మంది జీవించి ఉన్నారా? లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అయితే వాళ్లు ప్రాణాలతో ఉండాలని మాత్రం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గత వారంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. 39 మంది కార్మికులను క్షేమంగా విడిపించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి 39 భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
ఉగ్రవాదాన్ని పెకలించేస్తా: ట్రంప్
వాషింగ్టన్: తాను ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. తొలిసారి ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదితో సమావేశమైన ఆయన ఈమేరకు హామీ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించి తీరుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం అబాదికీ డోనాల్డ్ ట్రంప్ ఓవల్ కార్యాలయంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇరాక్‌కు ట్రంప్ గట్టి మద్దతిచ్చారని, తాము కూడా దానిని తుదముట్టించి తీరుతామని అబాదీకి హామీ ఇచ్చినట్లు శ్వేతసౌదం పేర్కొంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరాక్‌కు సైనిక సహాయం కొనసాగించేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కూడా వెల్లడించింది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కలిసి సాగాలని బలంగా నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌదం పేర్కొంది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలతోపాటు పెట్టుబడులకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరగనున్నట్లు వెల్లడించింది. -
29 మంది జర్నలిస్టుల మృత్యువాత
బాగ్దాద్: సంక్షుభిత ఇరాక్ జర్నలిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారుతోంది. ఈ ఏడాదిలో 29 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో 20 మందిని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) పొట్టన పెట్టుకుంది. ఐఎస్ వ్యతిరేక పోరాటాలను కవర్ చేస్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాగ్దాద్, ఇరాక్ నగరాల్లో సంభవించిన హింసాత్మక ఘటనల్ మరో ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాదిలో జర్నలిస్టులపై 43 కేసులు నమోదయ్యాయి. ఇరాక్ వ్యవహారాల్లో అమెరికా చొరబడిన నాటి నుంచి(2003) నుంచి ఇప్పటివరకు 435 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడం పట్ల ఇరాక్ జర్నలిస్టుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. సరైన చట్టాలు లేకపోవడం, కొన్ని ప్రభుత్వ వ్యవస్థల అజ్ఞానం కారణంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. విలేకరులపై దాడులను సహించబోమని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్-అబాదీ అన్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఎటువంటి నేరాలు జరిగినా దర్యాప్తు కమిటీలు నియమిస్తామని హామీయిచ్చారు. -
' దెయ్యాలకు' జీతాలు!
వాషింగ్టన్: ఏ దేశంలోనైనా జీవించి ఉన్న వారు మాత్రమే పూర్తి స్థాయి జీతాలు తీసుకోవడం మనకు తెలిసిన విషయం. అయితే పశ్చిమ ఆసియా దేశమైన ఇరాక్ లో 'దెయ్యాలు'కూడా జీతాలు తీసుకుంటున్నాయట. దెయ్యాలు జీతాలు తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యం కలగమానదు. ఇరాక్ ఆర్మీలో సర్వీస్ లో లేని వారికి జీతాలు అందుతున్నట్లు ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తాజాగా స్పష్టం చేశారు. అది కూడా తక్కువ సంఖ్యలో కాదు. ఏకంగా యాభై వేల మంది తప్పుడు పేర్లు సృష్టించి జీతాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. ఆర్మీలో ఇంతటి భారీ స్థాయిలో అవినీతి జరగడంపై ప్రధాని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని ఆదివారం ఇరాక్ పార్లమెంట్ లో ప్రస్తావించిన ఆయన దర్యాప్తుకు ఆదేశించారు. అసలు ఆ నకిలీ అకౌంట్లను సృష్టించి అవినీతికి తెరలేపిన వారిపై చర్యలు తీసుకోవాడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 'ఆర్మీ అవినీతి' పై ప్రధానంగా దృష్టి సారించారు.