' దెయ్యాలకు' జీతాలు!
వాషింగ్టన్: ఏ దేశంలోనైనా జీవించి ఉన్న వారు మాత్రమే పూర్తి స్థాయి జీతాలు తీసుకోవడం మనకు తెలిసిన విషయం. అయితే పశ్చిమ ఆసియా దేశమైన ఇరాక్ లో 'దెయ్యాలు'కూడా జీతాలు తీసుకుంటున్నాయట. దెయ్యాలు జీతాలు తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యం కలగమానదు. ఇరాక్ ఆర్మీలో సర్వీస్ లో లేని వారికి జీతాలు అందుతున్నట్లు ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తాజాగా స్పష్టం చేశారు. అది కూడా తక్కువ సంఖ్యలో కాదు. ఏకంగా యాభై వేల మంది తప్పుడు పేర్లు సృష్టించి జీతాలు పొందుతున్నారని ఆయన తెలిపారు.
ఆర్మీలో ఇంతటి భారీ స్థాయిలో అవినీతి జరగడంపై ప్రధాని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని ఆదివారం ఇరాక్ పార్లమెంట్ లో ప్రస్తావించిన ఆయన దర్యాప్తుకు ఆదేశించారు. అసలు ఆ నకిలీ అకౌంట్లను సృష్టించి అవినీతికి తెరలేపిన వారిపై చర్యలు తీసుకోవాడానికి రంగం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 'ఆర్మీ అవినీతి' పై ప్రధానంగా దృష్టి సారించారు.