29 మంది జర్నలిస్టుల మృత్యువాత
బాగ్దాద్: సంక్షుభిత ఇరాక్ జర్నలిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారుతోంది. ఈ ఏడాదిలో 29 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వీరిలో 20 మందిని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) పొట్టన పెట్టుకుంది. ఐఎస్ వ్యతిరేక పోరాటాలను కవర్ చేస్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాగ్దాద్, ఇరాక్ నగరాల్లో సంభవించిన హింసాత్మక ఘటనల్ మరో ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాదిలో జర్నలిస్టులపై 43 కేసులు నమోదయ్యాయి. ఇరాక్ వ్యవహారాల్లో అమెరికా చొరబడిన నాటి నుంచి(2003) నుంచి ఇప్పటివరకు 435 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడం పట్ల ఇరాక్ జర్నలిస్టుల సమితి ఆందోళన వ్యక్తం చేసింది. సరైన చట్టాలు లేకపోవడం, కొన్ని ప్రభుత్వ వ్యవస్థల అజ్ఞానం కారణంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. విలేకరులపై దాడులను సహించబోమని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్-అబాదీ అన్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఎటువంటి నేరాలు జరిగినా దర్యాప్తు కమిటీలు నియమిస్తామని హామీయిచ్చారు.