స్విర్ల్ బ్రెయిడ్
సిగ సింగారం
ఈ హెయిర్ స్లైయిల్ను స్విర్ల్ బ్రెయిడ్ అంటారు. విదేశీయులు ఈ హెయిర్ స్టైయిల్‌ను పెళ్లిళ్లకు, పుట్టినరోజు వేడుకలకు ఎక్కువగా వేసుకుంటారు. ఇది ఎలాంటి డ్రెస్సులకైనా నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి మరీ పొడవాటి జుత్తు ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మెడ కింద వరకు ఉన్నా సరిపోతుంది. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. ఓసారి ఈ స్విర్ల్ బ్రెయిడ్ను ట్రై చేయండి..
1. ముందు జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆపైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్నట్టు మూడు భాగాలుగా చేసుకోవాలి.
2. ఇప్పుడు మధ్యభాగంలోని జుత్తును నడినెత్తి నుంచి మూడు పాయలుగా తీసుకొని కొద్దిగా అల్లాలి. తర్వాత అదే మధ్యభాగంలోని జుత్తును రెండు పక్కల నుంచి సన్నని పాయలుగా తీసి ఈ జడలో కలుపుకుంటూ రివర్సులో అల్లుకు పోవాలి. చివర కాస్త మిగిలిన జుత్తుకు బ్యాండు పెట్టేయాలి.
3. పైన అల్లుకున్న జడను టైట్‌గా లేకుండా పాయల్ని కొద్దికొద్దిగా కదిలిస్తూ వదులు చేసుకోవాలి.
4. ఇప్పుడు చివర మిగిలిన పోనీని ఫొటోలో కనిపిస్తున్నట్టు మడిచేసి అదే బ్యాండులో పెట్టేయాలి.
5. ఆ మడిచిన పోనీని బయటికి కనిపించకుండా లోపలికి పెట్టి స్లైడ్స్ పెట్టేయాలి.
6. తర్వాత ఎడమ చెవి వైపు ఉన్న జుత్తును చిక్కులు లేకుండా నున్నగా దువ్వుకోవాలి.
7. ఆ దువ్విన జుత్తును మెలిక తిప్పి కుడివైపుకు తీసుకెళ్లి స్లైడ్స్ పెట్టేయాలి.
8. ఇప్పుడు కుడి చెవి వైపు ఉన్న జుత్తును చిక్కులు లేకుండా నున్నగా దువ్వుకోవాలి.
9. దాన్ని కూడా మెలిక తిప్పి ఎడమవైపుకు తీసుకెళ్లి స్లైడ్స్ పెట్టేయాలి.
10. చివరగా ఏవైనా పాయలు ఊడిపోయేలా ఉండే టైట్‌గా స్లైడ్స్ పెట్టేయాలి. (పెట్టిన స్లైడ్స్ ఊడిపోకుండానూ చూసుకోవాలి)