Hamsaveni
-
తాగి కొడుతుంటే.. కాల్చేశాను!
బొమ్మనహళ్లి: నేనెందుకు నా భర్తపై కాల్పులు జరుపుతాను? తాగిన మైకంలో భర్త కొడుతుంటె నన్ను నేను రక్షించుకోవడం కోసం ఫైరింగ్ చేశానని శుక్రవారం సాయంత్రం భర్త సాయిరామ్ పైన కాల్పులు జరిపిన అతని భార్య హంసవేణి పోలీసుల విచారణలో తెలిపారు. శనివారం విచారణ కోసం చందాపుర సమీపంలోఉన్న సూర్య సిటి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆ విధంగా చెప్పారు. భర్త ఆరుపెగ్గులు, నేను బీర్లు తాగా ‘బ్యాంకు పని మీద నేను, నా భర్త సాయిరామ్ తో కలిసి హోసూరు వెళ్ళి హరళూరులో ఉన్న మా నివాసానికి తిరిగి వస్తున్నా. చందాపుర సమీపంలో రెస్టారెంటులో ఇద్దరం మద్యం తాగాం. భర్త ఆరు పెగ్గుల విస్కీ, నేను రెండు బీర్లు తాగాను. మద్యం తాగుతున్న సమయంలోనే మా ఇద్దరి మధ్య గొడవైంది. రెస్టారెంటులోనే రివాల్వర్ తీసి నా ముఖం మీద కొట్టాడు. దాంతో నాకు నోట్లోంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. కారులో వెళ్తుంటే మళ్లీ గొడవైంది. నన్ను నేను రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపాను. నాది బెంగళూరు, నా భర్తది ఆంధ్రప్రదేశ్. 27 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరివీ శ్రీమంతుల కుటుంబాలు కావడంతో ఇద్దరం కలిసి మందు తాగుతాం’ అని హంసవేణి చెప్పుకొచ్చింది. ఖాకీలకు ముప్పుతిప్పలు ప్రస్తుతం సాయిరామ్ చందాపుర స్పర్శ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నాడు. ఎద, కడుపులో మూడు బుల్లెట్లు దిగాయి. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో, భర్త పైన ఫైరింగ్ చేసిన మత్తులో ఉన్న హంసవేణి పోలీసులతో కూడా గొడవకు సిద్ధపడ్డారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలం నుంచి తీసుకుని వెళ్తుండగా పోలీసులపై ఆమె మండిపడింది. భర్తను ఎందుకు షూట్ చేశావు చెప్పమ్మా అంటే నేనేమైనా మీకు అమ్మనా అంటూ, సరే, చెప్పండి మేడం అంటే.. నేనేమైనా మీకు టీచర్నా, స్కూళ్లో పాఠాలు చెప్పానా? అని ఆమె ఖాకీలనే నిందితురాలు ముప్పుతిప్పలు పెట్టింది. -
భర్తను బస్సు దించి రివాల్వర్‌తో కాల్పులు
-
భర్తను బస్సు దించి రివాల్వర్‌తో కాల్పులు
బెంగళూరు: మద్యం సేవించి వివాహిత హల్ చల్ చేయడంతో పాటు ఏకంగా భర్తను బస్సునుంచి కిందకు దించి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. అడ్డు వచ్చిన ప్రజలపై గన్ ఎక్కు పెట్టింది. దగ్గరకు వచ్చారో కాల్చి పారేస్తానని వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్ వద్ద చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిరామ్(53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్ రెసిడెన్సిలో శుక్రవారం సాయంత్రం సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. మార్గం మధ్యలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వాహనం వీరసంద్ర గేట్ సమీపంలోకి రాగానే భర్త సాయిరామ్ కారు దిగి బీఎంటీసీ బస్సు ఎక్కాడు. ఇక అంతే.. ఆగ్రహించిన భార్య కారును వేగంగా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపింది. భర్తను బలవంతంగా బస్సునుంచి కిందకు దింపి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి. స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్‌ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. సాయిరామ్‌కు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.