గసగసాల గింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టం
రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుని రూపాలు
యలమంచిలి రూరల్: విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్త కళాకారుడు మరో అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. సూక్ష్మరూపంలో ఆకృతులను తయారు చేయడంలో ఏటికొప్పాక హస్తకళాకారులది అందెవేసిన చేయి. గతంలో అనేక పురాణ పురుషులు, దేశనాయకులు, చారిత్రక కట్టడాలను అతి సూక్ష్మరూపంలో తయారు చేసి ఎన్నో రికార్డులు సృష్టించారు.
తాజాగా ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి గసగసాల గింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. తాటిముళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడిని వారి ఆయుధాలతో కూడిన చిత్రాలను లిఖించాడు. దీనిని తయారు చేయడానికి 18 రోజుల సమయం పట్టిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సూక్ష్మ కళాఖండాలను తయారుచేస్తానని చిన్నయాచారి తెలిపారు.