చేనేత ఫ్యాషన్‌లో విజేత!
ఫ్యాషన్ ప్రపంచంలో అత్యుత్తమ వేదికలైన న్యూయార్క్, ప్యారిస్, లండన్, వాంకోవర్ నగరాల్లో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ వీక్‌లో డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం డిజైనర్ల స్వప్నం. చిన్న వయసులోనే ఆ విశ్వ వేదికలపై అనేకమార్లు తను ప్రేమించిన చేనేత అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ రామస్వామి.
హైదరాబాద్‌కు చెందిన ఈ సృజనశీలి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే మన చేనేతలతో సంప్రదాయ దుస్తులను రూపుకట్టడంలో మేటిగా నిలుస్తున్నారు. నగరంలో ఆలయం పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి కంచి, బెనారస్, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, నారాయణపేట.. మొదలైన చేనేతకారులకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. శ్రవణ్ కుమార్ ఆవిష్కరించిన సరికొత్త అందాలు ఇటీవలే వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేశాయి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో కనువిందు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు (కెనడా) వాంకోవర్ ఫ్యాషన్ వీక్ జరిగింది. అందులో నేను రూపొందించిన ప్రత్యేక దుస్తుల ప్రదర్శన జరిగింది. ఎంతో మంది మన్ననలు పొందాయి. రాజా రవివర్మ పెయింటింగ్స్ నుంచి స్ఫూర్తి పొంది ఆ దుస్తులను డిజైన్ చేశాను. వీనుల విందైన సంగీతం మదిని ఎంత రంజింపజేస్తుందో, చూపరులకు అంతగా నా డిజైన్లు కనువిందు చేయాలన్నదే నా ప్రయత్నం.
చేనేతకే పెద్ద పీట..
హాలీవుడ్ ప్రపంచానికి రాజధాని అయిన లాస్ ఎంజిల్స్‌లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. అందులో మన నారాయణ పేట అందాలు, గుజరాత్‌కి చెందిన్ అబ్రక్ చేనేత వస్త్రాలను కూడా ఈ షో లో ప్రదర్శించబోతున్నాను. నారాయణపేట అందాలు ఇప్పటికే లండన్, దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లలో ప్రదర్శించడంతో అంతర్జాతీయంగా ఈ చేనేతకు మంచి పేరు వచ్చింది. ట్రెండ్‌ను ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రపంచం చేనేత వస్త్రాలను ఎప్పటికీ ముందువరసలో నిలుపుతుంది. చేనేతకారుల చేతుల్లో ఊపిరిపోసుకున్న ఖాదీ, పోచంపల్లి, గద్వాల్, కలంకారి, బెనారస్... వంటి ఫ్యాబ్రిక్స్ అంటే నాకు ప్రాణం. చేనేతకారులను సంప్రదించి నాకు నచ్చిన విధంగా డిజైన్లు చెప్పి మరీ వస్త్రాలను నే యిస్తాను. ఇందుకు దేశంలోని చేనేతకారులను చాలామందిని సంప్రదించాను. నేను డిజైన్ చేయించే ప్రతి చీరకూ చేనేతకారుడు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటాను.
సంప్రదాయ దుస్తులదే హవా!
చేనేతలతో సంప్రదాయ దుస్తులను తయారు చే యడం నా ప్రత్యేకత అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. భారతీయతను చాటే లంగా ఓణీలు, షేర్యానీ, ధోతి, బ్లౌజ్‌లు, చీరలు.. ఇలా సంప్రదాయ తరహా దుస్తుల డిజైన్లు ఎంత మందిలో ఉన్నా చూపు తిప్పుకునేలా చేస్తాయి.
చలికి.. ఇవి బెస్ట్...
♦ కాలానుగుణంగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్న ఈ డిజైనర్ సూచనలు...
♦ చలికి సిల్క్ దుస్తులు బాగుంటాయి. వీటిలో ముఖ్యంగా బెనారస్ అందాన్ని, చలిని తట్టుకునే వెచ్చదనాన్నీ ఇస్తుంది.
♦ హై నెక్, ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, ఎక్కువ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు మేలు.
♦ ఎరుపు, మెరూన్, గోల్డ్, రాయల్ బ్లూ, పర్పుల్, ఆరెంజ్...ఇలా చలికాలానికి మంచి రంగు దుస్తులు ఆకర్షణీయంగా ఉంటాయి.
♦ మన దేశీయ చర్మతత్త్వాలకు అన్ని రంగులు సూటవుతాయి.
♦ దుస్తులు మిమ్మల్ని ధరించవు. మీరే దుస్తులను ధరించాలి. అవి సౌకర్యవంతంగా, చూడచక్కగా ఉండాలి.
తారల ‘కళ’నేత...
సినీ తారలు, రాజకీయ ప్రముఖులు దాదాపు అందరికీ నా డిజైన్స్ సుపరిచితమే! సినీ తారలలో నయనతార, తాప్సీ, ప్రణీత, శ్రేయ శరణ్, సమంత, దీక్షాసేథ్, సిమ్రాన్ కౌర్, అమలాపాల్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీ ఆర్... ఇలా చాలా మందికి దుస్తులు డిజైన్ చేశాను. అలాగే మురారీ, గ్రీకువీరుడు... వంటి తెలుగుదనం ఉట్టిపడే ఎన్నో సినిమాలకు డ్రెస్ డిజైనర్‌గా ఉన్నాను.
సంతోషకరమైన పనిలోనే వృద్ధి...
‘నచ్చిన పనే ఎంచుకో! అందులోనే సంతోషం ఉంటుంది. ఆనందంగా చేసే పనిలోనే వృద్ధి ఉంటుంది’అని మా అమ్మ పార్వతీదేవి ఎప్పుడూ అంటుంటారు. దుస్తుల డిజైన్లు సృష్టించడం నాకు అమితంగా నచ్చిన విషయం. అందుకే ఈ రంగంలో ఎప్పుడూ కష్టమనిపించలేదు. ఒడిదొడుకులూ ఎదురుకాలేదు. మా పూర్వీకులు కర్నాటక వాసులైనా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న రామస్వామి. మేం ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు. మా పెద్ద చెల్లెలు జ్యోతి కూడా 15 ఏళ్ల వయసులో నాతో పాటు ఈ రంగంలో అడుగుపెట్టింది. దాదాపు 20 ఏళ్లుగా ఇద్దరం ఈ రంగంలోనే ఉన్నాం. హైదరాబాద్‌లో అత్యంత చిన్నవయసు డిజైనర్లుగా పేరు తెచ్చుకున్నాం.
ఎప్పుడూ కోరుకునేది...
చేనేతకు పూర్వవైభవం తేవాలన్నదే నా ఆశయం. ‘శ్రవణ్‌కుమార్ అంటే అంకితభావంతో పనిచేస్తాడు. చెప్పిన సమయానికి దుస్తులు అందంగా రూపొందించి ఇస్తాడు. ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మరెంతో రిచ్ లుక్‌తో ఉంటాయి’ అని వినియోగదారుల మనసుల్లో నిలిచిపోతే చాలు. జీవితాంతం నేను కోరుకునేవి ఇవే!’’
- నిర్మలారెడ్డి