Handlooms worker
-
ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధానికి కోమటిరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2019 గణంకాల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలి. సంప్రదాయంగా ఇదే వృత్తిని నమ్ముకున్న చేనేత వృత్తిదారులలో ఆధిక శాతం పేదవారు ఉన్నారు. ఇందులో 67 శాతం మంది రూ.5,000 లోపు , 26.2 శాతం రూ.10,000 లోపు, 6.8 శాతం మాత్రమే రూ.10,000 పైన ఆదాయం పొందుతున్నారు. మన దగ్గర తయారైన ఉత్పత్తులను మన దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. లాక్ డౌన్ కారణంగా ముడి సరుకుల రవాణా లేక, పని లేక చేనేత , చేతి వృత్తిదారులకు ఉపాధి కరువైంది. ఇదే వృత్తిని నమ్ముకున్న వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే ముడి సరుకుల కొనుగోలు ద్వారా అయా వృత్తులు తిరిగి గాడిలో పడుతాయి. నెలకు రూ. 3,000ల చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సాయం, పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందించాలి. దేశంలోని 23 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు దోతిలు, చీరలు అందజేయాలని, వీటిని తయారు చేసే బాధ్యతను చేనేత, చేతివృత్తిదారులకు అప్పగించాలి’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. చదవండి: భారత్‌పై నేపాల్ ప్రధాని షాకింగ్ కామెంట్లు! బస్సుల గోల.. కాంగ్రెస్‌పై అదితి ఫైర్ -
ఆప్కో ఆన్లైన్లో అందుకో
కులవృత్తిని మించిన ఉపాధి మరొకటి ఉండదనే మనదేశపు వృత్తికారుల ధైర్యాన్ని వలస పాలకులు తుడిచి పెట్టేశారు. పట్టెడన్నం పెట్టడం లేదని మగ్గం కొయ్యనే ఉరికొయ్య చేసుకున్నారు చేనేతకారులు. మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో తాత్కాలికంగా మగ్గాన్ని పక్కన పెట్టి చేత వచ్చిన పనులతో పొట్ట నింపుకుంటున్నారు. ఖద్దరుకు మారు పేరయిన శ్రీకాకుళం జిల్లా పొందూరులోనైతే మగ్గాన్ని వదిలి కంపెనీల్లో గుమాస్తాలుగా, జూట్ మిల్లులో కార్మికులుగా, తాపీ పని వాళ్లుగా, హోటళ్లలో పని వాళ్లుగా మారిపోయిన వాళ్లెందరో. ఇక ఆ పరిస్థితి ఉండబోదు. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా నేటి నుంచి మన చేనేతలకు అంతర్జాతీయ మార్కెట్‌ను కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ చేనేత కారులు నేసిన వస్త్రాలు ఇక నుంచి ఆన్లైన్ మార్కెట్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా వినియోగదారుల అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తాయి. చేనేతరంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న ఈ నిర్ణయం సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఏపీ ప్రభుత్వం వేసిన మరొక ముందడుగు. మరుగున పడడానికి సిద్ధంగా ఉన్న భారతీయ కుటీర పరిశ్రమలను పునరుద్ధరించడానికి చేస్తున్న చిత్తశుద్ధిగల ప్రయత్నమిది. శ్రీకాకుళం జిల్లాకే వస్తే.. చేనేతకు ఎంత దూరమైనా సరే అటకెక్కని మగ్గాలు పొందూరులో ఐదు వందల యాభై వరకు ఉన్నాయి. కుటుంబానికి ఇద్దరు లెక్కన పదకొండు వందల మంది మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పుడున్న అరకొర మార్కెట్ కారణంగా భార్యాభర్త ఇద్దరూ నెలంతా కష్టపడినప్పటికీ వాళ్లకు మిగిలేది ఏడెనిమిది వేలే. ఇక పట్టు చీరల విషయానికి వస్తే అనంతపురం జిల్లా ధర్మవరం పట్టుచీరల పరిశ్రమ పెద్దది. జిల్లాలో ధర్మవరం, హిందూపురం, యాడికి, సోమందిపల్లి... మొత్తం యాభై వేల చేనేత కుటుంబాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ మార్కెట్ సులభమవుతుంది. చేనేతకారుడికి– వినియోగదారుడికి మధ్య ఇద్దరు వ్యాపారులుంటారు. చేనేత కారుడికి గిట్టే ధరకు, వినియోగదారునికి అందే ధరకు మధ్య హస్తిమశకాంతరం తేడా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు ధర చేనేతకారుడికి రాబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఈ– కామర్స్ ట్రేడింగ్ ద్వారా చేనేతకారులు తమ ఉత్పత్తులను నేరుగా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. తమకు గిట్టుబాటయ్యే ధరను వాళ్లే నిర్ణయించుకునే సౌలభ్యం ఉంటుంది. «ఒకటి– రెండు చీరలు, డ్రెస్సుల కోసం నగరాల నుంచి చేనేతకారుల దగ్గరకు వెళ్లలేని వినియోగదారులకు ఆన్లైన్లో కొనుగోలు చేయడం సౌకర్యంగా ఉంటుంది. మార్కెట్ విస్తరించే కొద్దీ అటకెక్కిన మగ్గాలు తిరిగి పని మొదలు పెడతాయి. మనదేశ కుటీర పరిశ్రమలు ప్రపంచదేశాల్లో తిరిగి మన ఉనికి చాటగలుగుతాయి. ఇన్పుట్స్ : సాక్షి, ఏపీ నెట్వర్క్ ఇంకా ఎక్కువ పని చేస్తాం తరతరాలుగా చీరలను నేయడమే మాకు తెలిసిన పని. ఆ పనిని వదిలి పెట్టడానికి మనసొప్పదు. మా వెంకటగిరి చేనేత చీరలకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మంచి పేరే ఉంది. అయితే మాకు మార్కెట్ చేసుకోవడం చేతకాకపోవడంతో నేసిన చీరలు అమ్ముడు పోయేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. నేసినవి నేసినట్లు అమ్ముడు పోతుంటే మా పని మీద మాకు నమ్మకం పెరుగుతుంది. ఇంకా పని చేయాలనే ఉత్సాహం కూడా వస్తుంది. – చల్లా గంగమ్మ, వెంకటగిరి, నెల్లూరు జిల్లా ఊర్లు తిరిగి అమ్ముకున్నాం మా చేనేత కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ పని చేస్తుంటే ఒక మనిషి సైకిళ్ల మీద చీరల మూట పెట్టుకుని ఊర్లు తిరుగుతూ అమ్మేవాడు. అతడు ఇంటికి రాగానే ఇంటిపెద్ద మూట సైజు తగ్గిందా లేదా అని చూసేవాడు. ఇప్పటిలాగ అమ్మకాలకు ఒక రాజమార్గం ఉంటే... పిల్లలు మా వృత్తి నుంచి బయటకు వెళ్లేవాళ్లే కాదు. ఇప్పుడు మాకు బతుకు మీద ధైర్యం కలుగుతోంది. – పృథ్వీ శివపార్వతి, చీరాల, ప్రకాశం జిల్లా మా బతుకుల్లో దివ్వెలు మా వస్త్రాలను ఇష్టపడే వారికి మేమెక్కడుంటామో తెలియదు. ఒక చీరకు రెండు చీరలకు మా దగ్గరకు వచ్చి కొనడం కుదిరే పని కాదు. మార్కెటింగ్ చేతకాక ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కోసారి గిట్టుబాటు ధర కూడా రాదు. మాకు అందుబాటులో ఉన్న వ్యాపారికి ఏదో ఒక ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మా కోసం ఆలోచించే నాయకుడు వచ్చాడు. ప్రభుత్వ నిర్ణయంతో మా బతుకుల్లో చిరుదివ్వెలు వెలుగుతాయి. – జాడ లక్ష్మి, పొందూరు, శ్రీకాకుళం జిల్లా పూర్వ వైభవం వస్తుంది జగన్ సార్ ముఖ్యమంత్రి కాగానే మా చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి ‘వైఎస్ఆర్ చేనేత నేస్తం’ పథకంతో మగ్గం ఉన్న కుటుంబానికి ఏడాదికి 24 వేల ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మా ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వ సహాయం లేక కునారిల్లిన మా చేనేత కుటుంబాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. – ఆకురాతి నాగ మల్లీశ్వరి, మంగళగిరి, భవిష్యత్ ఉజ్వలం నెలలపాటు పని చేసి ఒక పట్టుచీర నేస్తే దాని మీద మిగిలిన డబ్బు చూసుకుంటే చేనేతకారులకు ఒక్కోసారి గుండె తరుక్కుపోతుంటుంది. ఇప్పుడు ఒక భరోసా వచ్చింది. ప్రభుత్వం చూపించిన దారి వల్ల ఆషాఢం, శ్రావణం, సీజన్, అన్ సీజన్ అని లేకుండా ఏడాదంతా మార్కెట్ ఉంటుంది. ఆన్లైన్లో అమ్మడం నేర్చుకుంటే చేనేతకారుల బతుకులు బాగు పడతాయనే నమ్మకం కలుగుతోంది. – జింకా మణిమాల, ధర్మవరం, టెక్నాలజీ నేర్చుకుంటాం ఇప్పటి వరకు మాకు తెలిసింది మగ్గం మీద దుస్తులు నేయడం, మా దగ్గరకు వచ్చిన వాళ్లకు వచ్చిన ధరకు అమ్ముకోవడం ఒక్కటే తెలుసు. ధర పెంచితే ఎవరూ కొనడం లేదని చెప్పే మధ్య వ్యాపారుల మాటకు తలూపక తప్పేది కాదు. ఇప్పుడు మేము చదువుకుంటున్న మా పిల్లలను అడిగి టెక్నాలజీ తెలుసుకుంటాం. ఆన్లైన్ మార్కెట్ చేయడం నేర్చుకుంటాం. – కర్ణా భారతి, పాటూరు, నెల్లూరు జిల్లా సృజనాత్మకత జోడిస్తాం అగ్గిపెట్టెలో పట్టేటంత నాజూకైన చీర నేసిన నైపుణ్యం చేనేత రంగానిది. మా ఉప్పాడ చీరలు ఒక ట్రెండ్‌ని సృష్టించాయి. ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయాలని ఉన్నప్పటికీ వాటిని కొనేవాళ్లు ఉండరనే భయంతో చేతులు కట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మా చేనేత కళకు సృజనాత్మక జోడించి ప్రయోగాలు చేస్తాం. – తిమ్మన నూకరత్నం, కొత్తపల్లి, తూర్పుగోదావరి జిల్లా ఒక వస్త్రం.. వంద దశలు మహిళ చేతిలోకి ఒక పట్టుచీర వచ్చిందంటే... దాని వెనుక ఎన్ని దశలుంటాయో మన ఊహకు కూడా అందదు. రైతు పట్టుగూళ్లను పెంచుతాడు. ఆ పట్టుగూళ్లను కకూన్ మార్కెట్లో గవర్నమెంట్ మధ్యవర్తిగా ఉండి వ్యాపారితో కొనిపిస్తుంది. పట్టుగూళ్లు రీలింగ్ యూనిట్‌కి వెళ్తాయి. అక్కడ ముడిదారం తీస్తారు. ఆ ముడిదారాన్ని ఒక వ్యాపారి టోకున కొంటాడు. అక్కడి నుంచి చేనేతకారులు కొనుక్కుంటారు. ఆ ముడిదారాన్ని చేనేతకారుడు అద్దకందార్లకు ఇస్తాడు. రంగులద్దిన తర్వాత మరొకరు వార్పు పడతారు. దారం మగ్గాన్ని చేరడానికి ముందు ఇన్ని దశలుంటాయి. చేనేత వస్త్రాలకు మార్కెట్ పెరిగితే వీళ్లందరికీ రాబడి పెరిగినట్లే. -
ఆదరణ కరువై..బతుకు భారమై..
విజయనగరం కంటోన్మెంట్:అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగలిగే సత్తా ఉన్న నేత కార్మికుడు నేడు ఆదరణ కరువైన కకావికలమవుతున్నాడు. మహాత్ముని తరువాత చాచాజీ తదితర మహోన్నతులు ధరించిన చేనేత వస్త్రాలను ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా వినియోగిస్తున్నప్పటికీ సామాన్య మానవుల నుంచి ఇతరులు కూడా వినియోగించడం మానేశారు. మరో వైపు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారికి ఎటువంటి సహాయ సహకారాలను అందించకపోవడంతో చేనేతనే నమ్ముకున్న వారు నేడు పట్టెడన్నం లేక అలమటిస్తున్నారు. దీంతో కులవృత్తి కూడు పెట్టడం లేదని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కడుపు నింపుకుంటున్నారు. చేనేత తప్ప మరే వృత్తీ చేతకాకపోయినప్పటికీ కడుపు మంటకు వలస వెళ్లిన ప్రాంతాల్లో ఇతర వృత్తులను నేర్చుకుని మరీ భార్యాబిడ్డలను పోషించుకునేందుకు పాట్లు పడుతున్నాడు. జిల్లాలో 18 కోఆపరేటివ్ సంఘాలున్నాయి. చేనేతకు అనుబంధంగా మరో సంఘముంది. వీటిలో 2960 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న చేనేత కార్మికుల సంఖ్యకు చాలా తేడా ఉంది. అధికారుల లెక్కల్లో ఉన్న చేనేత కార్మికులు క్షేత్ర స్థాయిలో ఉండడం లేదు. చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు. అవి జిల్లాలో అమలవుతున్న తీరును ఒకసారి పరిశీలిస్తే.. అక్కరకు రాని ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ స్కీం జిల్లాలో రూ.48.84లక్షలతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి అవ సరమైన లూమ్స్ కొనుగోలు చేసి ఇవ్వడం దీని ప్రధానోద్దేశం. కానీ ఈ పథకం ద్వారా ఇచ్చిన శిక్షణ ఎవరికీ ఉపయోగపడలేదు. అప్పటికే చేనేత రంగంలో విశేష అనుభవం ఉన్న కార్మికులకు ఇంకా శిక్షణలెందుకో అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ పథకానికి కేటాయించిన నిధుల నుంచి రూ.38.66లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో ఏ ఏ పనులు చేశారో ఎన్ని శిక్షణా కార్యక్రమాలు చేశారో అధికారులే స్పష్టం చేయాలి. గ్రూపులకు నిధుల కేటాయింపులున్నా విడుదలలో నిర్లక్ష్యం జిల్లాలోని చేనేత సంఘాలకు గ్రూపుల వారీగా అభివృద్ధి నిధులను విడుదల చేస్తున్నారు. ఇలా 2007-08లో రూ5.40 లక్షలకు గాను రూ.3.79లక్షలు విడుదలయింది. అదేవిధంగా 2008-09లో రూ.లక్షా42వేలు విడుదలయింది. 2010 -11లో 40 మంది సభ్యులు కలిగిన రెం డు సంఘాల అభివృద్ధికి రూ.10.10లక్ష లు మంజూరైంది. కానీ ఇందులో రూ. 5. 74లక్షల నిధులు విడుదలయ్యాయి. అ యితే ఇంతవరకూ ఈ నిధులను గ్రూ పులకు విడుదల చేయలేదు. దీంతో చేనే త రంగంలో మరేం అభివృద్ధి చెందుతామని ఆయా గ్రూపులు ప్రశ్నిస్తున్నాయి. ఆదుకోని మహాత్మాగాంధీ బునకర్ బీమా! చేనేత కార్మికుల కుటుంబాల్లోని యజ మాని ఆత్మహత్యకు పాల్పడితే వారి కు టుంబాలు వీధిన పడకుండా ఉం డేం దుకు ప్రభుత్వం మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన అన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కుల వృత్తి చేస్తున్న చేనేత కార్మికులు ఏటా రూ.80 ప్రీమియం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.150 చెల్లిస్తుంది. మరో పక్క ఎల్ఐసీద్వారా రూ.100 చెల్లించే ఏర్పాటు చేసినప్పటికీ ఈ పథకం వల్ల ఎవరికీ చెప్పుకోదగ్గ ప్రయోజనం కలగడం లేదని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పథకం ప్రకారం మృతి చెందిన కుటుంబాలకు రూ.60వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీని వల్ల బీమా మొత్తం చాలక ఆయా కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. కానరాని స్కాలర్ షిప్పులు జిల్లాలో 2010లో చేనేత కార్మికుల పిల్లల చదువుల కోసం స్కాలర్ షిప్పుల పథకాన్ని ప్రవేశపెట్టగా రెండేళ్లు వరుసగా రూ.ఏడులక్షల నిధులను విడుదల చేసి ఒక్కో విద్యార్థికీ రూ.1200 చొప్పున చెల్లించిన ప్రభుత్వం గత రెండేళ్లుగా ఒక్క విద్యార్ధికీ స్కాలర్ షిప్పులు చెల్లించలేదు. మూతపడ్డ హెల్త్ కేర్ స్కీం! జిల్లాలో చేనేత కార్మికులకోసం రూపొందించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని ఎత్తివేశారు. ఒక కుటుంబంలో భార్యా, భర్త ఇద్దరు పిల్లలకోసం చేపట్టిన ఈ పథకంలో ఆ కుటుంబం వంద రూపాయలు చెల్లిస్తే రూ.15వేల బిల్లుల చెల్లింపునకు అవకాశముండేది. దీనిని గతంలో కొన్ని సంఘాలు వినియోగించుకున్నాయి. కానీ ఇప్పుడా పథకం అమలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రెడిట్కార్డులేవీ? చేనేత కార్మికులకు క్రెడిట్‌కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికీ క్రెడిట్ కార్డులకు మోక్షం కల్పించలేదు. జిల్లాలో 50 మందికి లక్ష్యం విధించుకున్న ప్రభుత్వం కేవలం 9 మందికి మాత్రమే కార్డులిచ్చి చేతులు దులుపుకుంది. ఇలా అయితే ఎలా బాగుపడతామని ఆయా కార్మికుల కుటుంబా లు వాపోతున్నాయి.