handri niva Canal
-
ఆశ..దోశ..అప్పడం..వడ
రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ మండలాల్లో 46 వేల ఎకరాలకు నీరిచ్చే విషయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పూటకోమాట మాట్లాడుతున్నారు. 50 రోజుల్లో మీ పొలాల్లో నీళ్లు పారిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ ఆడంబరంగా ప్రకటించారు. ఆ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో నీళ్లు వస్తాయని రైతులు ఎంతో ఆశగా క్యాలెండర్ తిరగేయడం మొదలెట్టారు. అయితే మార్చి 3వ తేదీ ఓ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 50 రోజుల్లో కచ్చితంగా నీళ్లు పారిస్తామన్నారు. మొదట చెప్పిన 50 రోజులా, ఇప్పటినుంచి 50 రోజులా అనేది రైతులకు అర్థం కాలేదు. ఏప్రిల్ మొదటివారంలో నీళ్లు రాకపోయేసరికి మార్చి 3వ తేదీ నుంచి 50 రోజులు అయి ఉంటుందనుకున్నారు. ఆ ప్రకారం ఏప్రిల్ నాలుగో వారంలో నీళ్లు వస్తాయని మళ్లీ క్యాలెండర్ చూడ్డం మొదలెట్టారు. నీళ్లు రాలేదుగానీ తాజాగా మంత్రి నుంచి శుక్రవారం మరో ప్రకటన వచ్చింది. అదేంటంటే ఆగస్టులో నీరు పారిస్తారంట. దీంతో రైతులు తీవ్ర నిరాశానిస్పృహలు వ్యక్తం చేస్తూ మంత్రి వైఖరి ‘ఆశ.. దోశ.. అప్పడం.. వడ’ అన్నట్లుగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కణేకల్లు:రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గంలో సభలు పెట్టిన ప్రతిసారీ ‘అదిగదిగో కృష్ణ జలా లు.. ఇక చూసుకోండి.. మీ పొలాలకు నీరి స్తాం... మీ కష్టాలు తీరుస్తాం’ అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారేగానీ ఆ దిశగా కనీ సం పనులను కూడా ప్రారంభించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ మండలాల్లో 46వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఆ దిశగా 36వ ప్యాకేజీలో మాల్యం బ్రాంచ్‌కెనాల్ పనులు చేపట్టేం దుకు టీడీపీ ప్రభుత్వం గత ఏడాది రూ.247 కోట్లు మంజూరు చేసింది. ఇం దులో ఉరవకొండ నియోజకవర్గ పరిధి లో పనులకు రూ.110 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో పనులకు రూ.137 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరి 14వ తేదీ బెలుగుప్ప మండలం దుద్దేకుంట వద్ద మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్సీ చీఫ్‌విప్ పయ్యావుల శ్రీనివాసులుతో కలిసి 36వ ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అదేరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజినీర్లతో కలిసి సొల్లాపురం వద్ద భూములను పరిశీలించారు. మంత్రి కాలవ మాల్యం బ్రాంచ్‌కెనాల్ స్కెచ్లను పాత్రికేయులకు చూపించి 50 రోజుల్లో కృష్ణాజలాలు పారిస్తామని చెప్పారు. తర్వాత మార్చి నెలలో మార్చి 3వ తేదీ సొల్లాపురంలో ఇంటిపట్టాల పంపిణీ సమయంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కచ్చితంగా 50రోజుల్లో కృష్ణాజలాలు అందిస్తామన్నారు. అయితే తాజాగా శుక్రవారం ఆయన జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డితో కలిసి సొల్లాపురం – పెనకలపాడు మధ్య మాల్యం బ్రాంచ్‌కెనాల్ పనులకు మళ్లీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టుకు ఆగస్టులో నీరిస్తామని చెప్పారు. 50 రోజుల్లో నీళ్లిస్తామన్న మంత్రి 72 రోజుల తర్వాత మళ్లీ అదేపనులకు భూమిపూజ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో నియోజకవర్గ ప్రజ లు, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే మంత్రి కాలవ ఇలా చేస్తూ వారిని మభ్యపెడుతున్నారని ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. -
ఆయకట్టుకి నీరివ్వాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదు
-
నిధుల దోపిడీకి పచ్చజెండా?
బి.కొత్తకోట: జిల్లాలో 2005 నుంచి 2009 వరకు హంద్రీ–నీవా సహా మిగిలిన ప్రాజెక్టుల పనులు చేపట్టి పూర్తిచేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్లకు అదనపు నిధులు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులను ఇటీవల జారీ చేసింది. 2014 తర్వాత నుంచి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు వర్తించదు. అయినప్పటికీ టీడీపీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అందినంత దోచుకునేందుకు రంగం సిద్ధమవుతోం ది. దీనికి అవినీతి ముద్ర లేకుండా, అనుకూలమైన ఒకరిద్దరు టీడీపీ కాంట్రాక్టర్లకు మాత్రమే లబ్ధి్ద కలిగేలా జీఓ జారీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఇందులో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అప్పనంగా రూ.160కోట్ల ప్రభుత్వ నిధులు దోచి పెట్టేందుకు పక్కా ప్రణాళిక సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు తరలించే కుప్పం ఉపకాలువ పనులను 4శాతం అదనంతో రూ.430.27 కోట్లకు హెఈఎస్, ఆర్కే, కోయా జాయింట్ వెంచర్ పనులు దక్కించుకోగా ఈ సంస్థల వినతిమేరకు ప్రభుత్వం రిత్విక్ ప్రాజెక్ట్స్, మరో కాంట్రాక్టు సంస్థను పనుల్లో భాగస్వామ్యం కల్పించింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వం ముందుగా తెలిపిన పనుల అంచనా వ్యయాన్ని తెలిపింది. దీనిని పరిశీలించాకే కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కిం చుకొన్నాయి. నిబంధనల మేరకు ప్రతిపాదిత పనులు పూర్తి చేయాల్సిన సంస్థలు తమకు అనుకూలంగా పనులు చేశాయి. కాలువ దూరం తగ్గించడం, కొత్తగా పనులను చేర్చుకొంటూ వచ్చా యి. నిబంధనల మేరకు నిర్ణయించిన అంచనాకు పనులు పూర్తిచేసి ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాకర్లది. ఇక్కడ మాత్రం పనులు అనుకూలంగా చేసుకోవడంతో పాటు అదనపు భారం పడిందంటూ రూ.160కోట్లు చెల్లించాలని మెలిక పెట్టా రు. ఈ విషయాన్ని మదనపల్లె సర్కిల్ అధికారులు చీఫ్ ఇంజినీర్ల కమిటీకి నివేదించారు. అదనపు చెల్లింపులకు సంబం ధించిన వివరాలతో కమిటీ ఆర్థికశాఖకు నివేదిక పంపింది. ఆర్థికశాఖ ఈ నివేదికను మూడురోజుల క్రితం చీఫ్ ఇంజనీర్ల కమిటీకి తిప్పిపంపినట్టు సమాచారం. కుప్పం కోసమే? చీఫ్ ఇంజినీర్ల కమిటీ ప్రతిపాదనలో కుప్పం కాలువకు అదనంగా రూ.160 కోట్ల చెల్లింపుల ప్రస్తావన లేకుండానే 2014 తర్వాత పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా జీఓ 22,63 తరహాలో కొంత ప్రయోజనం కలిగించాలని మరో ప్రతిపాదనను మళ్లీ ఆర్థికశాఖకు పంపింది. ఈ శాఖ కాంట్రాక్టర్లకు అదనపు ధరలు ఎందుకు చెల్లించాలి, అందుకు కారణాలు, వివరాలను సమగ్రంగా నివేదిం చాలని చీఫ్ ఇంజనీర్ల కమిటికి నివేదిం చిందినట్టు తెలిసింది. దీనికి చీఫ్ ఇంజనీర్ల కమిటి నిర్ణయం, చెల్లింపులకు అనుకూలంగా ఎలాంటి ప్రతిపాదన అందిస్తుం దో తేలాలి. కుప్పం ఉపకాలువతోపాటు టీడీపీ ముఖ్యనేతలు చేపట్టిన పనులకు సంబంధించిన కొన్నింటికి మాత్రమే ఈ అదనపు నిధులు అందే విధంగా జీఓ జారీచేసే అవకాశాలు లేకపోలేదని భావి స్తున్నారు. కాంట్రాక్టర్లందరికీ వర్తించకుండా తమ కాంట్రాక్టర్లకు మాత్రమే నిధులందించేలా నిబంధనలు సవరించి చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుప్పం కాలువ పనులు పూర్తిగా ఆగిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పనులు చేయించేందుకు భయపడుతున్నారు. టీడీపీ ముఖ్యనేత ఒకరు ఈ పనుల్లో భాగస్వామిగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
చెరువులు ఎలా నింపుతారు?
హిందూపురం అర్బన్ : హంద్రీ–నీవాకు అదనపు కేటాయింపులు లేకుండా చెరువులను ఎలా నింపుతారంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతవెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. బక్రీద్ సందర్భంగా హిందూపురంలో పార్టీ ఏ బ్లాక్ కన్వీనర్ ఇర్షాద్‌అహ్మద్ ఏర్పాటు చేసిన విందుకు ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డిని సన్మానించారు. అనంతరం అనంత మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీనీవా మొదటి దశ పనులు దాదాపు పూర్తి చేశారన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పట్లోనే నిర్ణయించారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తీసుకువచ్చారన్నారు. 2012 నుంచే హంద్రీనీవా ద్వారా నీరు వస్తోందన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడేమో హంద్రీనీవా నుంచి మరిన్ని చెరువులకు నీరు అందిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అదనపు నీటి కేటాయింపు లేకుండా నీరు ఎలా ఇస్తారని నిలదీశారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి చేస్తున్న ఎత్తుగడ మాత్రమేనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజుల్ రెహమాన్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, రజనీ, మహిళ కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, మండల కన్వీనర్లు బసిరెడ్డి, నారాయణస్వామి, నాయకులు సమద్, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిద్రిస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన టిప్పర్
కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్కక్తి టిప్పర్ కింద నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. హంద్రీనీవా కాలువ పనుల వద్ద వెంకటరాములుఅనే వ్యక్తి రాత్రి పూట కాపలా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న అతడిపైకి మంగళవారం తెల్లవారుజామున ఓ టిప్పర్ ఎక్కేసింది. దీంతో అతడు మృతి చెందాడు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
హంద్రీనీవా కాల్వతూమును పరిశీలించిన ఎమ్మెల్యేలు
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద హంద్రీనీవా కాలువ తూమును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరిశీలించారు. నీటి ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతంలో వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. కాలువ వరదతో పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు ఐజయ్య, చరితారెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి, ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.