ఆశ..దోశ..అప్పడం..వడ | Kalava Srinivasulu Topic Change On Handineeva Water | Sakshi
Sakshi News home page

ఆశ..దోశ..అప్పడం..వడ

Published Sat, Apr 28 2018 8:33 AM | Last Updated on Sat, Apr 28 2018 8:33 AM

Kalava Srinivasulu Topic Change On Handineeva Water - Sakshi

ఫిబ్రవరి 14న 36వ ప్యాకేజీ పనుల శంకుస్థాపన అనంతరం స్కెచ్‌ను విలేకరులకు చూపిస్తున్న మంత్రి కాలవ అదే పనులకు ఈ నెల 27న శుక్రవారం రెండోసారి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కాలవ

రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్‌ మండలాల్లో 46 వేల ఎకరాలకు నీరిచ్చే విషయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పూటకోమాట మాట్లాడుతున్నారు. 50 రోజుల్లో మీ పొలాల్లో నీళ్లు పారిస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ ఆడంబరంగా ప్రకటించారు. ఆ ప్రకారం ఏప్రిల్‌ మొదటి వారంలో నీళ్లు వస్తాయని రైతులు ఎంతో ఆశగా క్యాలెండర్‌ తిరగేయడం మొదలెట్టారు. అయితే మార్చి 3వ తేదీ ఓ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 50 రోజుల్లో కచ్చితంగా నీళ్లు పారిస్తామన్నారు.

మొదట చెప్పిన 50 రోజులా, ఇప్పటినుంచి 50 రోజులా అనేది రైతులకు అర్థం కాలేదు. ఏప్రిల్‌ మొదటివారంలో నీళ్లు రాకపోయేసరికి మార్చి 3వ తేదీ నుంచి 50 రోజులు అయి ఉంటుందనుకున్నారు. ఆ ప్రకారం ఏప్రిల్‌ నాలుగో వారంలో నీళ్లు వస్తాయని మళ్లీ క్యాలెండర్‌ చూడ్డం మొదలెట్టారు. నీళ్లు రాలేదుగానీ తాజాగా మంత్రి నుంచి శుక్రవారం మరో ప్రకటన వచ్చింది. అదేంటంటే ఆగస్టులో నీరు పారిస్తారంట. దీంతో రైతులు తీవ్ర నిరాశానిస్పృహలు వ్యక్తం చేస్తూ మంత్రి వైఖరి ‘ఆశ.. దోశ.. అప్పడం.. వడ’ అన్నట్లుగా ఉందని ఆవేదన చెందుతున్నారు.

కణేకల్లు:రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గంలో సభలు పెట్టిన ప్రతిసారీ ‘అదిగదిగో కృష్ణ జలా లు.. ఇక చూసుకోండి.. మీ పొలాలకు నీరి స్తాం... మీ కష్టాలు తీరుస్తాం’ అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారేగానీ ఆ దిశగా కనీ సం పనులను కూడా ప్రారంభించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్, రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్‌ మండలాల్లో 46వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. ఆ దిశగా 36వ ప్యాకేజీలో మాల్యం బ్రాంచ్‌కెనాల్‌ పనులు చేపట్టేం దుకు టీడీపీ ప్రభుత్వం గత ఏడాది రూ.247 కోట్లు మంజూరు చేసింది. ఇం దులో ఉరవకొండ నియోజకవర్గ పరిధి లో పనులకు రూ.110 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో పనులకు రూ.137 కోట్లు కేటాయించారు.

ఫిబ్రవరి 14వ తేదీ బెలుగుప్ప మండలం దుద్దేకుంట వద్ద మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్సీ చీఫ్‌విప్‌ పయ్యావుల శ్రీనివాసులుతో కలిసి 36వ ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అదేరోజు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఇంజినీర్లతో కలిసి సొల్లాపురం వద్ద భూములను పరిశీలించారు. మంత్రి కాలవ మాల్యం బ్రాంచ్‌కెనాల్‌ స్కెచ్‌లను పాత్రికేయులకు చూపించి 50 రోజుల్లో కృష్ణాజలాలు పారిస్తామని చెప్పారు. తర్వాత మార్చి నెలలో మార్చి 3వ తేదీ సొల్లాపురంలో ఇంటిపట్టాల పంపిణీ సమయంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కచ్చితంగా 50రోజుల్లో కృష్ణాజలాలు అందిస్తామన్నారు. అయితే తాజాగా శుక్రవారం ఆయన జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డితో కలిసి సొల్లాపురం – పెనకలపాడు మధ్య మాల్యం బ్రాంచ్‌కెనాల్‌ పనులకు మళ్లీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయకట్టుకు ఆగస్టులో నీరిస్తామని చెప్పారు. 50 రోజుల్లో నీళ్లిస్తామన్న మంత్రి 72 రోజుల తర్వాత మళ్లీ అదేపనులకు భూమిపూజ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయకట్టుకు నీరివ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో నియోజకవర్గ ప్రజ లు, రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే మంత్రి కాలవ ఇలా చేస్తూ వారిని మభ్యపెడుతున్నారని ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement