Hanumantu lajapatiray
-
'విశాఖ రాజధాని'ని.. ఈసారి చేజార్చుకోం
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు. కుటిల బుద్ధితో చేస్తున్న పాదయాత్రని ఎలా స్వాగతించగలమని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 15న జరిగే విశాఖ గర్జనతో రాజధాని పోరు మొదలవుతుందనీ.. భవిష్యత్తులో నాన్ పొలిటికల్ జేఏసీ అన్ని సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ లజపతిరాయ్ పునరుద్ఘాటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఎదురుచూస్తోంది 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రాంతాన్ని రాజధాని చెయ్యాలనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఇందులో 61 మంది ఎమ్మెల్యేలు విశాఖపట్నం అని.. 58 మంది కర్నూలు అని ఓటువేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. అప్పటికే కర్నూలుని రాజధానిగా చెయ్యాలని నిర్ణయించుకున్న నాటి ప్రభుత్వం.. 1956 ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్నంని రాజధానిగా చేస్తామంటూ అసెంబ్లీ తీర్మానించింది. కానీ, ఇది అమల్లోకి రాకపోయినా.. అప్పటి నేతలు పోరాడలేకపోయారు. అప్పటినుంచి అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికి సీఎం వైఎస్ జగన్ మరో అవకాశాన్ని కల్పించారు. దీన్ని వదులుకునే ప్రసక్తేలేదు. ఇప్పటికే రెండు తప్పులు చేశాం. మళ్లీ అమరావతిని మాత్రమే అభివృద్ధిచేస్తే.. చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పుడైనా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులువేయకపోతే.. భవిష్యత్తులో మరోసారి విభజన ఉద్యమం తలెత్తక తప్పదు. కుటిల బుద్ధితో వస్తే ఎందుకు స్వాగతించాలి? కొందరు కేవలం అమరావతి మాత్రమే రాజధానిగా ఎదగాలని.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగకూడదనే కుటిలబుద్ధితో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో వస్తే ఎందుకు స్వాగతించాలి. ఇక రాజధాని కోసం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేసేందుకు నాన్‌పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. విశాఖలో రాజధాని ఏర్పాటయ్యేంత వరకూ పోరాటంచేస్తాం. 15న విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని చాటిచెబుతున్నాం. ఆ తర్వాత ప్రతి గ్రామంలోనూ విద్యార్థి నుంచి పింఛన్ తీసుకునే వృద్ధుల వరకూ.. వికేంద్రీకరణ తదనంతరం జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తాం. దూర ప్రస్తావన అప్రస్తుతం? విశాఖ రాజధాని అయితే.. భౌగోళికంగా మిగతా ప్రాంతాలకు దూరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నారు. కానీ, ఈ వాదనలో బలంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర సచివాలయంలో పనికోసం వచ్చే వారి శాతం 0.01 కూడా వుండదు. గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చాక.. ప్రజలకు పరిపాలన మరింత చేరువైంది. అందుకే దూర ప్రస్తావన అప్రస్తుతమనే చెప్పాలి. ఇక గత కొన్ని దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో రాజధానులున్న ప్రాంతాల చుట్టుపక్కలున్న జిల్లాల తలసరి ఆదాయం, ఆయా జిల్లాల వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుంది. మూడు రాజధానులవల్ల రాష్ట్రంలో అన్ని జిల్లాల సమన్వయ అభివృద్ధికి దోహదమవుతుంది. క్రమంగా జీడీపీ కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు: జేఏసీ
సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన హక్కుల కోసం పోరాటం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలకు సూచించారు. 75 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ప్రపంచంలో 14 దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయి. దేశంలో 6 రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి. అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి.’ అని పేర్కొన్నారు జేఏసీ కన్వీనర్. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ కో కన్వీనర్ దేవుడు మాడ్లాడుతూ.. ఇంకా ఉపేక్షిస్తే మన మనుగడకే ఇబ్బంది వస్తుందని ప్రజలకు సూచించారు. అమరావతికి ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణ ద్వారా అణగారిన వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు.. విశాఖ పరిపాలన రాజధాని కావాలన్నారు మేధావుల ఫోరం అధ్యక్షులు. కర్నూలు రాజధాని కాకముందే విశాఖ రాజధాని ప్రతిపాదన ఉందని, ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకు సిద్ధం.. వికేంద్రీకరణ కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అవంతి, కరుణం ధర్మశ్రీ. విశాఖ రాజధాని కోసం ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధంమని వెల్లడించారు అవంతి. స్పీకర్ ఫార్మాట్లో జేఏసీ కన్వీనర్‌కు కరుణం ధర్మశ్రీ రాజీనామా లేఖ. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంమని సవాల్ చేశారు. మరోవైపు.. విశాఖ రాజధానిపై రెఫరెండానికి తాము సిద్ధమని తెలిపారు మంత్రి అమర్నాథ్. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖతో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేంగా చేస్తున్నయాత్రపై నిరసన తెలియజేస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అందుకు చంద్రబాబుదే బాధ్యతని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: Visakhapatnam: వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు -
భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ
VIP రిపోర్టర్ హనుమంతు లజపతిరాయ్ వీసీ, బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ లజపతిరాయ్ (వీసీ) : మేడమ్ ఈ పాఠశాలకు చాలా ప్రత్యేకత ఉంది.. నేనూ ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రస్తుతం పాఠశాల పరిస్థితి ఏంటి. సదుపాయాలు ఎలా ఉన్నాయి? వి.పద్మావతి (హెచ్ఎం) : నేనూ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాను. ఇక్కడే ఏడేళ్లుగా హెచ్ఎంగా పని చేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థాయిల్లో ఉన్నారు. అయితే పాఠశాలలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని భవనాలు పడిపోయాయి. వీసీ : అధికారులకు ఫిర్యాదు చేశారా? హెచ్ఎం : సమస్యలపై ఇప్పటికే కలెక్టర్‌కు, మున్సిపల్ కమిషనర్‌గా వినతులు అందజేశాం. ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. వీసీ : హుద్‌హుద్ తుపానుకు కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు ఉన్నాయి.. నిజమేనా? హెచ్ఎం : నిజమే. తుపానుకు తిలక్ హాల్‌తోపాటు రెండు భవనాలు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ రోజు సమీపంలో పిల్లలు ఎవరూ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. వీసీ : ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాల సమస్యలు, విద్యార్థుల చదువుల గురించి వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారా? హెచ్ఎం : 200 మంది వరకు చదువుతున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నాం సార్. ఓల్డ్ స్టూడెంట్స్ అందజేసిన విరాళాలతో కొన్ని అభివృద్ధి పనులు జరిపించాం. తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తరగతి గదిలో.. వీసీ : వెనుకబడిన పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? టి.ఉమాదేవి (తెలుగు టీచర్) : ప్రత్యేకంగా వెనుకబడిన పిల్లలను దృష్టిలో ఉంచుకునే పాఠ్యాంశాలను చెబుతున్నాం. అలాంటి వారిని గుర్తించి సాయంత్రం 4.30 తర్వాత ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. వీసీ : ఆడిపిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా? తె.టీచర్ : దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కట్టు, బొట్టు, వస్త్రధారణ వంటి అంశాల గురించి వారితో తరచూ చర్చిస్తుంటాం. కుటుంబ వ్యవస్థ తీరు, మానవతా విలువలు, తల్లిదండ్రులు, పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి వివరిస్తుంటాం. వీసీ (ఓ విద్యార్థితో) : బాబు.. నువ్వు ఏ సబ్జెక్టులోనైనా వెనుకబడి ఉన్నావా? కె.రాజు (టెన్త్ విద్యార్థి) : గణితంలో బాగా డౌట్లు ఉన్నాయి సార్.. సిలబస్ మారిపోవడంతో మాకు పూర్తిగా అర్థం కావడంలేదు. వీసీ (మరో క్లాస్ రూమ్‌లో) : సార్.. మీరు ఉపాధ్యాయుడిగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సీహెచ్ దేవదత్తానంద్ (గణితం టీచర్) : మా ఇబ్బందులంటే ఏం చెబుతాం సార్.. ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఉపాధ్యాయులుగానే గుర్తించడంలేదు. పీఎఫ్‌ను జీపీఎఫ్‌లోకి కన్వర్ట్ చేయలేదు. జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. హెల్త్‌కార్డులు కూడా ఇవ్వమంటున్నారు. ఎల్టీసీ, సర్వస్ రూల్స్‌ను ఇంకా అమలు చేయలేదు. చాలా మధనపడుతున్నాం. ప్రభుతం వీటిపై దృష్టిసారించాలి సార్.. వీసీ : బాధ్యతాయుతమైన బోధన వృత్తి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? గ.టీచర్ : ఎంతసేపూ చదువూ చదువూ అని పిల్లలపై ఒత్తిడి పెంచడం కాసేపు పక్కనపెట్టి వారితో అనుబంధాన్ని పెంచుకోవాలి. టీచర్ అనేవాడు పిల్లలతో స్నేహితుడిగా మెలగాలి. వారి కుటంబ పరిస్థితి, మనోభావాలు గురించి తెలుసుకోవాలి. అలా చేస్తే విజయం సాధించినట్లే. వీసీ : ఈ ఏడాది సిలబస్‌లు మారాయని చెబుతున్నారు. కొత్త సిలబస్ ఎలా ఉంది? పి.రాజు (ఇంగ్లిష్ టీచర్) : సిలబస్ మార్చారు గానీ పేపర్-1, పేపర్-2లకు ఏ ప్రశ్నలు ఇస్తారో.. ఏంటో ఇంతవరకు స్పష్టం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిషు ఉపాధ్యాయులు, విద్యార్థులందరిదీ ఇదే సమస్య. దీనిపై త్వరగా వర్కషాప్‌లు నిర్వహిస్తే మేలు జరుగుతుంది. వీసీ : పిల్లలూ...మధ్యాహ్న భోజనం ఎలా ఉంది.. బాగా వండుతున్నారా? పిల్లలు : మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుంటుంది సార్.. ఆయా(వంటమనిషి) బాగా వండుతుంది. వీసీ (మధ్యాహ్న భోజనశాలకు వెళ్లి..) : ఏమ్మా.. మీకు నెలనెల బిల్లులు అందుతున్నాయా? జరీనాబీ (వంట మనిషి) : మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేనే పని చేస్తున్నాను సార్. బిల్లులు మాత్రం సక్రమంగా అందడంలేదు సారు. గ్యాస్ ఇవ్వడంలేదు. కట్టెల పొయ్యితోనే పాట్లు పడుతున్నాం.