భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ | VIP Reporter Hanumantu lajapatiray | Sakshi
Sakshi News home page

భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ

Published Sun, Nov 16 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ

భూత్ బంగ్లాలో.. చదువుల బెంగ

VIP రిపోర్టర్ హనుమంతు లజపతిరాయ్
 వీసీ, బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ

 లజపతిరాయ్ (వీసీ) : మేడమ్ ఈ పాఠశాలకు చాలా ప్రత్యేకత ఉంది.. నేనూ ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. ప్రస్తుతం పాఠశాల పరిస్థితి ఏంటి. సదుపాయాలు ఎలా ఉన్నాయి?
 వి.పద్మావతి (హెచ్‌ఎం) : నేనూ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాను. ఇక్కడే ఏడేళ్లుగా హెచ్‌ఎంగా పని చేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఉన్నతస్థాయిల్లో ఉన్నారు. అయితే పాఠశాలలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని భవనాలు పడిపోయాయి.

 వీసీ : అధికారులకు ఫిర్యాదు చేశారా?
 హెచ్‌ఎం : సమస్యలపై ఇప్పటికే కలెక్టర్‌కు, మున్సిపల్ కమిషనర్‌గా వినతులు అందజేశాం. ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.

 వీసీ : హుద్‌హుద్ తుపానుకు కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు ఉన్నాయి.. నిజమేనా?
 హెచ్‌ఎం : నిజమే. తుపానుకు తిలక్ హాల్‌తోపాటు రెండు భవనాలు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ రోజు సమీపంలో పిల్లలు ఎవరూ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది.

 వీసీ : ఎంతమంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాల సమస్యలు, విద్యార్థుల చదువుల గురించి వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారా?
 హెచ్‌ఎం : 200 మంది వరకు చదువుతున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నాం సార్. ఓల్డ్ స్టూడెంట్స్ అందజేసిన విరాళాలతో కొన్ని అభివృద్ధి పనులు జరిపించాం. తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం.

 తరగతి గదిలో..
 వీసీ : వెనుకబడిన పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు?
 టి.ఉమాదేవి (తెలుగు టీచర్) : ప్రత్యేకంగా వెనుకబడిన పిల్లలను దృష్టిలో ఉంచుకునే పాఠ్యాంశాలను చెబుతున్నాం. అలాంటి వారిని గుర్తించి సాయంత్రం 4.30 తర్వాత ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నాం.

 వీసీ : ఆడిపిల్లలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా?
 తె.టీచర్ : దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కట్టు, బొట్టు, వస్త్రధారణ వంటి అంశాల గురించి వారితో తరచూ చర్చిస్తుంటాం. కుటుంబ వ్యవస్థ తీరు, మానవతా విలువలు, తల్లిదండ్రులు, పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి వివరిస్తుంటాం.

 వీసీ (ఓ విద్యార్థితో) : బాబు.. నువ్వు ఏ సబ్జెక్టులోనైనా వెనుకబడి ఉన్నావా?
 కె.రాజు (టెన్త్ విద్యార్థి) : గణితంలో బాగా డౌట్లు ఉన్నాయి సార్.. సిలబస్ మారిపోవడంతో మాకు పూర్తిగా అర్థం కావడంలేదు.

 వీసీ (మరో క్లాస్ రూమ్‌లో) : సార్.. మీరు ఉపాధ్యాయుడిగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?
 సీహెచ్ దేవదత్తానంద్ (గణితం టీచర్) : మా ఇబ్బందులంటే ఏం చెబుతాం సార్.. ప్రభుత్వం కనీసం మమ్మల్ని ఉపాధ్యాయులుగానే గుర్తించడంలేదు. పీఎఫ్‌ను జీపీఎఫ్‌లోకి కన్వర్ట్ చేయలేదు. జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. హెల్త్‌కార్డులు కూడా ఇవ్వమంటున్నారు. ఎల్టీసీ, సర్వస్ రూల్స్‌ను ఇంకా అమలు చేయలేదు. చాలా మధనపడుతున్నాం. ప్రభుతం వీటిపై దృష్టిసారించాలి సార్..

 వీసీ : బాధ్యతాయుతమైన బోధన వృత్తి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?
 గ.టీచర్ : ఎంతసేపూ చదువూ  చదువూ అని పిల్లలపై ఒత్తిడి పెంచడం కాసేపు పక్కనపెట్టి వారితో అనుబంధాన్ని పెంచుకోవాలి. టీచర్ అనేవాడు పిల్లలతో స్నేహితుడిగా మెలగాలి. వారి కుటంబ పరిస్థితి, మనోభావాలు గురించి తెలుసుకోవాలి. అలా చేస్తే విజయం సాధించినట్లే.

 వీసీ : ఈ ఏడాది సిలబస్‌లు మారాయని చెబుతున్నారు. కొత్త సిలబస్ ఎలా ఉంది?
 పి.రాజు (ఇంగ్లిష్ టీచర్) : సిలబస్ మార్చారు గానీ పేపర్-1, పేపర్-2లకు ఏ ప్రశ్నలు ఇస్తారో.. ఏంటో ఇంతవరకు స్పష్టం చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిషు ఉపాధ్యాయులు, విద్యార్థులందరిదీ ఇదే సమస్య. దీనిపై త్వరగా వర్కషాప్‌లు నిర్వహిస్తే మేలు జరుగుతుంది.

 వీసీ : పిల్లలూ...మధ్యాహ్న భోజనం ఎలా ఉంది.. బాగా వండుతున్నారా?
 పిల్లలు : మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుంటుంది సార్.. ఆయా(వంటమనిషి) బాగా వండుతుంది.

 వీసీ (మధ్యాహ్న భోజనశాలకు వెళ్లి..) : ఏమ్మా.. మీకు నెలనెల బిల్లులు అందుతున్నాయా?
 జరీనాబీ (వంట మనిషి) : మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేనే పని చేస్తున్నాను సార్. బిల్లులు మాత్రం సక్రమంగా అందడంలేదు సారు. గ్యాస్ ఇవ్వడంలేదు. కట్టెల పొయ్యితోనే పాట్లు పడుతున్నాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement