Hanwada
-
ఇల్లరికం వెళ్లిన అల్లుడు అమ్మమ్మ ఊరికి వచ్చి శవమయ్యాడు
హన్వాడ: అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఏనమీదితండా సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన శివకృష్ణ (29)కు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన అరుణకు మూడేళ్ల కిందట వివాహమైంది. శివకృష్ణ ఇల్లరికం వెళ్లాడు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ ఈక్రమంలోనే భార్య అరుణతో తరచూ గొడవలు జరిగేవి. శివకృష్ణ అప్పుడప్పుడు స్వగ్రామం మహమ్మదాబాద్, అమ్మమ్మ వారి గ్రామం ఏనమీదితండాకు వచ్చివెళ్లేవాడు. గత శనివారం కూడా కోస్గి నుంచి నేరుగా అమ్మమ్మ ఇంటికి (ఏనమీదితాండ) వచ్చిన శివకృష్ణ అదేరోజు ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా గ్రామ సమీపంలో దొడ్డుకుంటోని బావిలో పడి మృత్యువాతపడ్డాడు. బుధవారం మృతదేహం బావిలో తేలడంతో స్థానికులు గమనించి బయటికి తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న హన్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి శవపంచనామా చేశారు. జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హన్వాడ పోలీసులు తెలిపారు. చదవండి: సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్ -
ఆడుకునే వయస్సులో అనంత లోకాలకు..
సాక్షి, హన్వాడ (మహబూబ్‌నగర్): ఆడుతూ.. పాడుతూ పాఠశాలకు వెళ్లి వచ్చే ఆ చిన్నారులు దసరా సెలవులు ఉండటంతో సరదాగా తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు.. అయితే పొలంలో నీటి నిల్వ కోసం తోడిన గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మండలంలోని మాదారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... గ్రామానికి చెందిన కొల్లి సాయన్న, అంజమ్మ దంపతుల కూతుళ్లు రజిత(11), మోక్షిత(4)లు. వీరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రజిత ఐదో తరగతి, మోక్షిత ఒకటో తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు పొడిగింపు కారణంగా పాఠశాలకు వెళ్లాల్సిన ఆ చిన్నారులు మంగళవారం తల్లిదండ్రుల వెంట గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి తమ పొలంలోనే ఉన్న నీటి నిల్వ గుంతలో జారిపడి మృత్యువాత పడ్డారు. పక్కనే పొలం పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు గుర్తించి వెంటనే నీటి గుంతలోకి దిగి బాలికలను బయటికి తీయగా అప్పటికే ఆ చిన్నారులు విగతజీవులయ్యారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. చిన్నారుల మృత్యువాతతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొల్లి సాయన్న, అంజమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానంలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడగా మరో అమ్మాయి ఉంది. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
గుండె నిండా బాధతోనే పరీక్షకు..
సాక్షి, హన్వాడ (మహబూబ్‌నగర్): తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో పదోతరగతి పరీక్షలకు హాజరుకావాల్సిన ఆ విద్యార్థి మనోవేదనకు లోనయ్యాడు. అయినా పంటిబిగువన బాధను అదిమిపట్టి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా కొనగట్టుపల్లికి చెందిన దర్పల్లి కేశవులు హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. కాగా, కుష్టువ్యాధితో బాధపడుతున్న అతని తండ్రి దర్పల్లి చెన్నయ్య ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మరణించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. పెద్దమ్మతోపాటు గ్రామస్తులు ఆ విద్యార్థికి సోమవారం ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రానికి పంపించారు. గుండెల నిండా బాధతో పంటిబిగువున అదిమిపట్టి తెలుగు–2వ పేపర్ పరీక్ష రాశాడు. 12ఏళ్ల క్రితం ఎటో వెళ్లిపోయిన తల్లి ఇదిలాఉండగా, కేశవులు మూడేళ్ల వయస్సులోనే 12ఏళ్ల క్రితం ఇంటి నుంచి తల్లి, ఏడాది పాపతో కలిసి ఎటో వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి తండ్రి దర్పల్లి చెన్నయ్య సంరక్షణలోనే ఈ విద్యార్థి పెరిగాడు. అయితే తండ్రికి కుష్టువ్యాధి సోకడంతో చేతులకున్న ఫింగర్ప్రింట్లు రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకున్న 35 కుంటల పొలానికి పాసుపుస్తకాలు రాలేదు. చివరకు రైతుబంధు, రైతుభీమా, పెట్టుబడి సాయం వీరి దరిచేరలేదు. చేసేది లేక తండ్రికి వచ్చే ఫించన్‌తోనే జీవనం ఇప్పటివరకు సాగింది. ఇప్పుడు తండ్రి మరణంతో ఆ విద్యార్థి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తండ్రి అంత్యక్రియల కోసం సర్పంచ్ మానస, స్థానిక నాయకులు బసిరెడ్డి, మరణారెడ్డి, సందీప్‌రెడ్డి, సంజీవ్, కృష్ణయ్య తదితరులు చందాలు పోగుచేసి విద్యార్థి కేశవులుకు రూ.పది వేల ఆర్థికసాయం అందించారు. -
హన్వాడ: పల్లెల్లో ఎన్నికల పండగ
సాక్షి, హన్వాడ: మండలంలో అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఆయా గ్రామాల్లో ఎన్నికల కో లాహలం కనిపించింది. ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్లినా ఓటర్లు బారులు తీరారు. మండల కేం ద్రంతోపాటు గొండ్యాల్, వేపూర్, ఇబ్రహీంబాద్, టంకర, చిన్నదర్పల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటలు దాటింది. ఇదిలా ఉండగా మున్సిపల్ వార్డు, 19 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 43 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మాధారం, హన్వాడ, కొనగట్టుపల్లి, మునిమోక్షం పోలింగ్ కేంద్రాల్లో సల్ప ఆందోళనలు చోటుచేసుకున్నాయి. మాధారంలో 7గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఈవీఎం మొరాయించడంతో 8గంటలకు ప్రారంభమైంది. హన్వాడ 17, 18 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి వచ్చే వృద్ధులతో నేరుగా ఓటు వేయించినట్లు తెలియడంతో టీఆర్ఎస్, ఎన్సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని అభ్యర్థులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రశేఖర్, సురేందర్‌రెడ్డి, పద్మజారెడ్డి పరిశీలించారు. గండేడ్‌లో 63.5శాతం పోలింగ్ .. గండేడ్: మండలంలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 63.5శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. మండలంలో 69పోలింగ్ కేంద్రాల్లో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మహేష్‌రెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శిం చారు. మండలంలో అనేక మంది యువకులు మొదటిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూణె, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు, గిరిజనులు శుక్రవారం ఉదయమే తమతమ గ్రామాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ పరికరాలను అ«ధికారులు ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. -
పేకాట సామ్రాజ్యం కూల్చేస్తాం!
మహబూబ్‌నగర్ క్రైం : పేకాట రాయుళ్లు తీరు మార్చుకోవాలని.. లేకపోతే ఎంతటి వారైనా దాడులు చేసి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ డీఎస్పీ సాయి మనోహర్ హెచ్చరించారు. ఆదివారం హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తచెరువుతండా అడవిలో పేకాట అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ విలేకరులకు వివరించారు. పేకాట రాయుళ్లది పెద్ద సామ్రాజ్యమే ఉందని, ప్రతి ఆదివారం పక్కా ప్లాన్‌తో పేకాట ఆడటానికి ప్రణాళిక రచిస్తారని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 1న హన్వాడ పరిధిలోని కొత్త చెరువు తాండ సమీపంలో ఉన్న అటవి ప్రాంతంలో అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో దాడులు జరిగాయని చెప్పారు. ఈ దాడులలో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా బాలరాజు అలియాస్ బాలు అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇతడు శివ అనే వ్యక్తితో పేకాట రాయుళ్లకు సమాచారం అందిస్తూ కావాల్సిన ఏర్పాటు చేస్తాడని, పద్ధతి మార్చుకోవాలని గతంలో నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో దాడులు చేసి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 16మంది ఉన్నారని, వారిలో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ జావేద్ కూడా ఉన్నట్లు నిర్దారణ కావడంతో అతనిపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వారిని రిమాండ్ చేయడంతో పాటు రూ.లక్షా 21 నగదు, 10ద్విచక్ర వాహనాలు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదైన వారిలో పల్లె వంశీ, పాష, సయ్యద్ మెహిజ్, సతీష్, సలాన్, రాజు, తిరుపతయ్య, నర్సింహులు, చంద్రనారాయణ్, వెంకటస్వామి, రాఘవేందర్, నాగరాజు, వెంకటేష్, శంకర్‌నాయక్, శివ, బాలరాజు ఉన్నారు. కానిస్టేబుల్ జావేద్ పరారీలో ఉన్నాడు. సమావేశంలో రూరల్ సీఐ కిషన్, హన్వాడ ఎస్ఐ రాంబాబు ఉన్నారు. -
ఆటోను ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం
మహబూబ్‌నగర్ : జిల్లాలోని హన్వాడ మండలం పెద్దదర్పల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలనను పోస్టుమార్టానికి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులను నాగంబాయితండాకు చెందిన గిరిజనులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఏడుగురు మహిళల్ని చంపిన నిందితుడి అరెస్టు
మహబూబ్‌నగర్: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు మహిళల్ని చంపేశాడతను. ఇదీ కేవలం మూడు నెలల కాలంలోనే..! ఇలా ఆభరణాల కోసం మహిళలను చంపిన నిందితుడిని చివరకు మహబూబ్‌నగర్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ మండలం కోడూరుకు చెందిన వడ్డె రాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలలక్రితం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌కు వెళ్లి కొంతకాలం సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఇటీవలే ఆమెను మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చి టీడీగుట్ట ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బతికేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి, వారిని దూరంగా తీసుకెళ్లి, దాడిచేసి చంపి, వారి ఒంటిపైనున్న ఆభరణాలను అపహరించడం మొదలుపెట్టాడు. కేవలం మూడు నెలల్లో ఒకే తరహాలో ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు వలపన్ని ఎట్టకేలకు బుధవారం రాజును పట్టుకున్నారు. అతడి నుంచి 320 తులాల వెండి ఆభరణాలు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, మృతుడి చేతిలో హతమైన మహిళల్లో హన్వాడ మండలం వేపూర్‌కు చెందిన దంతపల్లి నర్సమ్మ (35), వెంకటాపూర్‌కు చెందిన డోకూర్ వెంకటమ్మ (40), దొడ్డలోనిపల్లికి చెందిన మంజలి శాంతమ్మ (43), జైనల్లీపూర్‌కు చెందిన బియ్యన్ని ఎల్లమ్మ (35), చౌడాపూర్కు చెందిన చెన్నమ్మ (35), కొత్తపేటకు చెందిన పారుపల్లి యాదమ్మ (42), మరో గుర్తుతెలియని మహిళ ఉన్నారు.