
హన్వాడలోని పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి కేశవులు
సాక్షి, హన్వాడ (మహబూబ్‌నగర్): తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో పదోతరగతి పరీక్షలకు హాజరుకావాల్సిన ఆ విద్యార్థి మనోవేదనకు లోనయ్యాడు. అయినా పంటిబిగువన బాధను అదిమిపట్టి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా కొనగట్టుపల్లికి చెందిన దర్పల్లి కేశవులు హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. కాగా, కుష్టువ్యాధితో బాధపడుతున్న అతని తండ్రి దర్పల్లి చెన్నయ్య ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మరణించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. పెద్దమ్మతోపాటు గ్రామస్తులు ఆ విద్యార్థికి సోమవారం ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రానికి పంపించారు. గుండెల నిండా బాధతో పంటిబిగువున అదిమిపట్టి తెలుగు–2వ పేపర్ పరీక్ష రాశాడు.
12ఏళ్ల క్రితం ఎటో వెళ్లిపోయిన తల్లి
ఇదిలాఉండగా, కేశవులు మూడేళ్ల వయస్సులోనే 12ఏళ్ల క్రితం ఇంటి నుంచి తల్లి, ఏడాది పాపతో కలిసి ఎటో వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి తండ్రి దర్పల్లి చెన్నయ్య సంరక్షణలోనే ఈ విద్యార్థి పెరిగాడు. అయితే తండ్రికి కుష్టువ్యాధి సోకడంతో చేతులకున్న ఫింగర్‌ప్రింట్లు రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకున్న 35 కుంటల పొలానికి పాసుపుస్తకాలు రాలేదు. చివరకు రైతుబంధు, రైతుభీమా, పెట్టుబడి సాయం వీరి దరిచేరలేదు. చేసేది లేక తండ్రికి వచ్చే ఫించన్‌తోనే జీవనం ఇప్పటివరకు సాగింది. ఇప్పుడు తండ్రి మరణంతో ఆ విద్యార్థి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తండ్రి అంత్యక్రియల కోసం సర్పంచ్ మానస, స్థానిక నాయకులు బసిరెడ్డి, మరణారెడ్డి, సందీప్‌రెడ్డి, సంజీవ్, కృష్ణయ్య తదితరులు చందాలు పోగుచేసి విద్యార్థి కేశవులుకు రూ.పది వేల ఆర్థికసాయం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment