Happy Ending Movie
-
'హ్యాపీ ఎండింగ్' సినిమా రివ్యూ
టైటిల్: హ్యాపీ ఎండింగ్ నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, ఝాన్సీ తదితరులు నిర్మాత: సంజయ్ రెడ్డి, యోగేశ్ కుమార్ పూరి, అనిల్ పల్లల దర్శకుడు: కౌశిక్ భీమిడి సంగీతం: రవి నిడమర్తి సినిమాటోగ్రఫీ: అశోక్ సీపల్లి విడుదల తేదీ: 2024 ఫిబ్రవరి 2 కథేంటి? స్కూల్ చదువుకునే టైంలో హర్ష్(యష్ పూరి).. ఫ్రెండ్ చెప్పడంతో ఓ రోజు శృంగారభరిత సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్తాడు. అదే మూవీ చూడటానికి రధేశ్వర్ స్వామిజీ(అజయ్ ఘోష్) రహస్యంగా వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో హర్ష్ వల్ల స్వామిజీని థియేటర్లలో అందరూ గుర్తుపట్టేస్తారు. ఆయన పరువు పోతుంది. కోపోద్రిక్తుడైన స్వామిజీ, హర్ష్‌ని శపిస్తాడు. దీని వల్ల హర్ష్ ఏ అమ్మాయిని తలుచుకుంటే వాళ్లందరూ చనిపోతుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత హర్ష్.. అవని(అపూర్వ రావు)తో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. మరి హర్ష్‌కి శాప విమోచం కలిగిందా? భార్యతో ఒక్కటయ్యాడా? అనేదే 'హ్యాపీ ఎండింగ్' స్టోరీ. ఎలా ఉందంటే? 'హ్యాపీ ఎండింగ్' సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే.. చిన్నప్పుడే హీరోకి శాపం, నిగ్రహం కోల్పోయి ఎవరినైతే ఊహించుకుంటాడో వాళ్లు చనిపోవడం, చివరకు దీన్ని జయించాడా? లేదా అనేది క్లైమాక్స్. వినడానికి స్టోరీ లైన్ కాస్త డిఫరెంట్‌గా ఉంది కదా! కానీ సినిమా మాత్రం ఓకే ఓకే అనేలా సాగుతుంది. హీరో చిన్నప్పటి పాత్రని పరిచయం చేస్తూ నేరుగా సినిమాని మొదలుపెట్టేశారు. మనోడికి ఉన్న ఆత్రం, ఫ్రెండ్ చెప్పడంతో స్కూల్ ఎగ్గొట్టి మరీ ఓ సెమీ పోర్న్ మూవీకి వెళ్లడం.. ఈ పిల్లాడి వల్ల అక్కడికి వచ్చిన ఓ స్వామిజీని హాల్లోని అందరూ గుర్తుపట్టేయడం.. కోపమొచ్చిన స్వామిజీ, హీరోని శపించేయడం.. ఇలా సినిమా ప్లాట్ ఏంటనేది మూవీ ప్రారంభమైన కాసేపట్లోనే చెప్పేశారు. అయితే స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ తీయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. హీరోకి ఉన్న శాపాన్ని బట్టి ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు. కానీ అలా కాకుండా చాలా సీరియస్ టోన్‌లో సాగుతూ ఉంటుంది. అలానే సీన్లు కూడా ఓ ఫ్లోలో కాకుండా సడన్‌గా వస్తుంటాయి. మళ్లీ కట్ అయిపోతుంటాయి. ఫస్టాప్, సెకండాఫ్.. రెండు కూడా సాగదీసి వదిలేశారు. ఇదే సినిమాని సింపుల్‌గా కూడా చెప్పొచ్చు. కానీ రెండున్నర గంటల పాటు తీసి విసుగు తెప్పించారు. అలానే ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా ఏ సీన్ కూడా ఎగ్జైట్ చేయదు. ఎవరెలా చేశారు? హీరోగా చేసిన యష్ పూరికి రెండు మూడు సినిమాల అనుభవముంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఉన్నంతలో సెటిల్డ్‌గా చేశాడు. డైలాగ్స్ కూడా చాలా నెమ్మదిగా చెబుతుంటాడు. ఆయన పాత్ర తీరు అంతేనా? లేదంటే అలా యాక్ట్ చేశాడా అనేది అర్థం కాదు. హీరోయిన్గా చేసిన కొత్తమ్మాయి అపూర్వ రావు కూడా ఓకే ఓకే అనిపించింది. అజయ్ ఘోష్, ఝాన్సీ లాంటి అనుభవజ్ఞులైన యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లని సరిగా వినియోగించుకోలేకపోయారు అనిపించింది. మిగతా వాళ్లు పర్వాలేదనిపింంచారు. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. డైరెక్టర్ కౌశిక్ భీమిడి.. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. వాటిని క్రిస్ప్ చేసుంటే సినిమా నిడివి తగ్గి, కాస్త ఆసక్తిగా ఉండేది. ఓవరాల్‌గా చూసుకుంటే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. ఎంటర్టైన్ చేసే విషయంలో చాలా తడబడ్డారు. -
మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్‌తో ‘హ్యాపీ ఎండింగ్’.. అడల్ట్ కంటెంట్ ఉండదు: యష్ పూరి
కమర్షియల్ హీరోగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే వందమంది విలన్స్ ను స్క్రీన్ మీద కొట్టినట్లు చూపిస్తే ఎవరూ నమ్మరు. హీరోగా స్థిరపడిన తర్వాత పక్కా కమర్షియల్ స్టైల్ లో మూవీస్ చేస్తా. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటా. నా సినిమాలకు కథే మొదటి హీరో. నేను సెకండ్ హీరో. హ్యాపీ ఎండింగ్ మూవీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’అని అన్నారు యంగ్ హీరో యష్ పూరి. ‘చెప్పాలని ఉంది’, ‘అలాంటి సిత్రాలు’, ‘శాకుంతలం’ వంటి సినిమాలతో అలరించిన యష్ పూరి నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా యష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ "హ్యాపీ ఎండింగ్" కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా..ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ► ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్త వేలో కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్..ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ "హ్యాపీ ఎండింగ్" సినిమాలో చూస్తారు. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. ► మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా "హ్యాపీ ఎండింగ్". శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ► సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వినయంగానే చెబుతున్నాం మా సినిమా సక్సెస్ అవుతుందని. సినిమా ప్రారంభంలోనే శాపాన్ని రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సరదాగా విష్ణుతో నేను చేసే కామెడీతో సాగుతుంది. సెకండాఫ్ లో ఎదురయ్యే కొన్ని ఘనటల వల్ల సినిమా ఎమోషనల్ అవుతుంది. నా క్యారెక్టర్ పేరు హర్ష్. కానీ అతని వ్యక్తిత్వం హార్ష్ గా ఉండదు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ లో దాదాపు అంతా కొత్త వాళ్లే. ఈ యంగ్ టీమ్ కు నిర్మాత అనిల్ గారు సపోర్ట్ గా నిలిచి షూట్ కు పంపారు. ఔట్ పుట్ చూశాక ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను నాలుగు సినిమాలు చేశాను. నేను హీరోగా చేసిన గత సినిమాలోనూ స్టోరీనే హీరో అనుకుంటా. ఈ సినిమాలోనూ నేను సెకండ్ హీరో. ఫస్ట్ హీరో కథే.త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా. -
శాపానికి గురైతే...
యశ్ పూరి, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ ఫిల్మ్స్ పతాకాలపై అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ‘‘నా నిగ్రహాన్ని పరీక్షించుకోవడానికి వస్తే నా పరువు తీస్తావా. ఇక నీకు మిగిలింది నిగ్రహమే’, ‘బాబా శాపం ఇచ్చాడా?’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో యశ్ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు మూడో సినిమా. పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ ఇది’’ అన్నారు కౌశిక్. ‘‘సినిమా బాగా వచ్చింది. ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్. ‘‘ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్‌లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇది నా తొలి చిత్రం’’ అన్నారు అపూర్వ. ‘‘ఈ జనరేషన్లోని అబ్బాయి ఓ బాబా శాపానికి గురైతే అతని పరిస్థితి ఏంటి? అన్నదే ఈ సినిమా కథ’’ అన్నారు కెమెరామేన్ అశోక్. -
ఆకట్టుకుంటోన్న ‘హ్యాపీ ఎండింగ్ ’ఫస్ట్ లుక్ పోస్టర్
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ నిర్మించారు. త్వరలోనే విడుదలకు ముస్తాబవుతున్న హ్యాపీ ఎండింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ కూర్చుని ఉండగా.. వెనక గణపతి ఫోటో ఉంది. (చదవండి: అండర్ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్ వీడియో రిలీజ్) ఒక మునీశ్వరుడుతో పాటు పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి ఫోటోస్ కనిపిస్తుండగా.. పోస్టర్ లో ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని రూపొందిన చిత్రం ఇది.