టైటిల్: హ్యాపీ ఎండింగ్
నటీనటులు: యష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, ఝాన్సీ తదితరులు
నిర్మాత: సంజయ్ రెడ్డి, యోగేశ్ కుమార్ పూరి, అనిల్ పల్లల
దర్శకుడు: కౌశిక్ భీమిడి
సంగీతం: రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ: అశోక్ సీపల్లి
విడుదల తేదీ: 2024 ఫిబ్రవరి 2
కథేంటి?
స్కూల్ చదువుకునే టైంలో హర్ష్(యష్ పూరి).. ఫ్రెండ్ చెప్పడంతో ఓ రోజు శృంగారభరిత సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్తాడు. అదే మూవీ చూడటానికి రధేశ్వర్ స్వామిజీ(అజయ్ ఘోష్) రహస్యంగా వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో హర్ష్ వల్ల స్వామిజీని థియేటర్లలో అందరూ గుర్తుపట్టేస్తారు. ఆయన పరువు పోతుంది. కోపోద్రిక్తుడైన స్వామిజీ, హర్ష్‌ని శపిస్తాడు. దీని వల్ల హర్ష్ ఏ అమ్మాయిని తలుచుకుంటే వాళ్లందరూ చనిపోతుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత హర్ష్.. అవని(అపూర్వ రావు)తో ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. మరి హర్ష్‌కి శాప విమోచం కలిగిందా? భార్యతో ఒక్కటయ్యాడా? అనేదే 'హ్యాపీ ఎండింగ్' స్టోరీ.
ఎలా ఉందంటే?
'హ్యాపీ ఎండింగ్' సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే.. చిన్నప్పుడే హీరోకి శాపం, నిగ్రహం కోల్పోయి ఎవరినైతే ఊహించుకుంటాడో వాళ్లు చనిపోవడం, చివరకు దీన్ని జయించాడా? లేదా అనేది క్లైమాక్స్. వినడానికి స్టోరీ లైన్ కాస్త డిఫరెంట్‌గా ఉంది కదా! కానీ సినిమా మాత్రం ఓకే ఓకే అనేలా సాగుతుంది. హీరో చిన్నప్పటి పాత్రని పరిచయం చేస్తూ నేరుగా సినిమాని మొదలుపెట్టేశారు. మనోడికి ఉన్న ఆత్రం, ఫ్రెండ్ చెప్పడంతో స్కూల్ ఎగ్గొట్టి మరీ ఓ సెమీ పోర్న్ మూవీకి వెళ్లడం.. ఈ పిల్లాడి వల్ల అక్కడికి వచ్చిన ఓ స్వామిజీని హాల్లోని అందరూ గుర్తుపట్టేయడం.. కోపమొచ్చిన స్వామిజీ, హీరోని శపించేయడం.. ఇలా సినిమా ప్లాట్ ఏంటనేది మూవీ ప్రారంభమైన కాసేపట్లోనే చెప్పేశారు.
అయితే స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ తీయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. హీరోకి ఉన్న శాపాన్ని బట్టి ఎంటర్‌టైనింగ్‌గా చెప్పొచ్చు. కానీ అలా కాకుండా చాలా సీరియస్ టోన్‌లో సాగుతూ ఉంటుంది. అలానే సీన్లు కూడా ఓ ఫ్లోలో కాకుండా సడన్‌గా వస్తుంటాయి. మళ్లీ కట్ అయిపోతుంటాయి. ఫస్టాప్, సెకండాఫ్.. రెండు కూడా సాగదీసి వదిలేశారు. ఇదే సినిమాని సింపుల్‌గా కూడా చెప్పొచ్చు. కానీ రెండున్నర గంటల పాటు తీసి విసుగు తెప్పించారు. అలానే ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా ఏ సీన్ కూడా ఎగ్జైట్ చేయదు.
ఎవరెలా చేశారు?
హీరోగా చేసిన యష్ పూరికి రెండు మూడు సినిమాల అనుభవముంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఉన్నంతలో సెటిల్డ్‌గా చేశాడు. డైలాగ్స్ కూడా చాలా నెమ్మదిగా చెబుతుంటాడు. ఆయన పాత్ర తీరు అంతేనా? లేదంటే అలా యాక్ట్ చేశాడా అనేది అర్థం కాదు. హీరోయిన్‌గా చేసిన కొత్తమ్మాయి అపూర్వ రావు కూడా ఓకే ఓకే అనిపించింది. అజయ్ ఘోష్, ఝాన్సీ లాంటి అనుభవజ్ఞులైన యాక్టర్స్ ఉన్నప్పటికీ వీళ్లని సరిగా వినియోగించుకోలేకపోయారు అనిపించింది. మిగతా వాళ్లు పర్వాలేదనిపింంచారు. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. డైరెక్టర్ కౌశిక్ భీమిడి.. స్టోరీ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. వాటిని క్రిస్ప్ చేసుంటే సినిమా నిడివి తగ్గి, కాస్త ఆసక్తిగా ఉండేది. ఓవరాల్‌గా చూసుకుంటే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. ఎంటర్టైన్ చేసే విషయంలో చాలా తడబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment