బాలికను వేధించిన క్రికెటర్
ఢాకా: అతడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన బౌలర్. అతి తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని క్రికెట్లో హీరోగా మారాడు. అతను ఓ బాలికను అతి కిరాతకంగా హింసించాడని తెలిసి దేశం నివ్వెరపోయింది. ఇదంతా బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హుస్సేన్ గురించి. తమ ఇంట్లో పనిచేసిన 11 ఏళ్ల మహఫుజా అక్తర్ అనే బాలిక షాదత్ హుస్సేన్, అతని భార్య న్రిట్టో షాదత్ కలిసి తీవ్రంగా వేధించారు. ముద్దుగా హ్యాపీ అని పిలువబడే మహఫుజా అక్తర్‌ను క్రికెటర్ వేధించాడనే విషయం ఇప్పుడు బంగ్లాదేశ్‌లో సంచలనం రేపుతోంది.
హ్యాపీది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆమెకు తెలియదు. హ్యాపీని సాకుతున్న అమ్మమ్మ క్రికెటర్ ఇంట్లో ఆమెను పనికి కుదిర్చింది. అయితే ఆ ఇంట్లో తనని నిత్యం కర్రలతో, వంటగదిలోని సామాన్లతో కొట్టేవారని హ్యాపీ తెలిపింది. దెబ్బలను భరించలేక ఎవరూ చూడని సమయంలో ఆ ఇంట్లో నుండి పారిపోయి వచ్చింది. ముఖంపై గాయాలతో కన్పించిన హ్యాపీని గమనించిన ఓ జర్నలిస్టు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిచాడు. ఈ ఉదంతం తెలిసి బంగ్లాదేశ్ బాలల హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. బాలిక పట్ల కర్కశంగా ప్రవర్తించిన క్రికెటర్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
నరకకూపం నుండి బయటపడిన హ్యాపీ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది. తాను బడికి వెళ్లి చదువుకుంటానని, కాలేజీకి వెళ్తానని, తరువాత సినిమాల్లో నటిస్తానని అమాయకంగా చెబుతున్న హ్యాపీ.. తనను పనిలో కుదిర్చిన అమ్మమ్మపై ఎలాంటి కోపం లేదని చెబుతోంది. తమ పేదరికమే తనను అలా పనికి పంపేలా చేసిందని అమ్మమ్మ తప్పేం లేదని తెలిపింది.