ఉత్తరాఖండ్‌లో కీలక పరిణామం; ‘10 సీట్లు గెలిపిస్తా’
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బహిష్కృ నేత, రాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్.. ఈ రోజు తన కోడలు అనుకృతి గుసేన్‌తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రచార సారథి, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.
అందుకే వెళ్లగొట్టాం: బీజేపీ
ఐదు రోజుల క్రితం హరక్ సింగ్‌ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన బీజేపీ.. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. అసెంబ్లీ ఎన్నికలలో తన బంధువులకు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు ఆయనను పార్టీ నుంచి వెళ్లగొట్టినట్టు కమలం పార్టీ తెలిపింది. దీంతో ఆయన మళ్లీ సొంత గూటికి వచ్చారు. 2016లో హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేయడంలో హరక్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మరో 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు.
బీజేపీ వాడుకుని వదిలేసింది: రావత్
అయితే బీజేపీ తనను వాడుకుని వదిలేసిందని తాజాగా హరక్ సింగ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి మెజారిటీతో గెలిపించి క్షమాపణలు కోరతానని తెలిపారు. తనపై బీజేపీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బేషరతుగా కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు.
పది సీట్లు గెలిపిస్తా
కాగా, రావత్ బుధవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తన పలుకుబడిని ఉపయోగించి కనీసం పది సీట్లు గెలిపిస్తానని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన హామీ ఇచ్చారని పీటీఐ నివేదించింది. అయితే, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లోని ఒక వర్గం ఆయన పునరాగమనాన్ని వ్యతిరేకించింది. కేదార్నాథ్ నుంచి హరక్ సింగ్‌ను, ఆయన కోడలిని లాన్స్‌డౌన్ నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న ఒకే దశలో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. (ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు)