మాజీ మంత్రిపై రేప్ కేసు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్‌పై ఢిల్లీ పోలీసులు రేప్ కేసు నమోదుచేశారు. హరక్ తనను లైంగికంగా వేధించి.. అత్యాచారం చేసినట్టు 32 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో సఫ్దర్‌జంగ్ పోలీసులు శుక్రవారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. ఉద్యోగం విషయమై హరక్ సింగ్ ఢిల్లీ గ్రీన్ పార్క్‌లోని తన ఇంటికి పిలిపించుకొని లైంగిక దాడి చేశాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. అయితే, ఆమె 15 ఏళ్ల కిందట కూడా హరక్‌సింగ్‌పై ఇదే తరహాలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లేవదీయడంలో హరక్ సింగ్ కీలక పాత్ర పోషించారు. రావత్ వ్యతిరేక రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన నేతృత్వం వహించారు. ఆయన తిరుగుబాటుతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం.. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన బీజేపీ గూటికి చేరారు. ఆయనతోపాటు రెబల్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు.