ఎంతో ఆశగా భారత్ వచ్చాను.. కానీ!
న్యూఢిల్లీ: తన జీవితస్వప్నం కోసం భారత్‌కు రావడం ఓ అమెరికా మహిళా టీచర్ పాలిట శాపంగా మారింది. గత ఏప్రిలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరూ గ్యాంగ్ రేప్ బాధితురాలు అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. ఇంత జరిగినా సరే.. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని సమస్యపై పోరాడటమే తన లక్ష్యమని అంటోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాకు చెందిన 25 ఏళ్ల మహిళకు భారత్‌కు టూరిస్ట్‌గా రావాలని చిన్నప్పటి నుంచీ కలగనేది. ఇందులో భాగంగా గత ఏప్రిల్ లో ఢిల్లీకి వచ్చి ఓ హోటల్లో బస చేసింది. ఓ టూరిస్ట్ గైడ్ ఆమెకు ఢిల్లీ సిటీ చూపిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమె రూముకు వెళ్లి ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో నలుగురు వ్యక్తులను కూడా ఆమె రూముకి తీసుకొచ్చి రెండు రోజులపాటు నరకం చూపించాడు. వీరిలో ఇద్దరు హోటల్ స్టాఫ్ కూడా ఉన్నారు.
'ఆ సమయంలో నేను షాక్‌కు గురయ్యాను. ఎలాగోలా తప్పించుకుని ఢిల్లీ నుంచి పెన్సిల్వేనియాలోని ఇంటికి తిరిగి వెళ్లిపోయాను. ఈ దుర్ఘటన నుంచి కోలుకుని మాములు మనిషి కావడానికి మూడు నెలలు పట్టింది. స్థానిక ఎన్జీఓ సంస్థ ద్వారా ఫిర్యాదు చేశాను. అయితే అమెరికా నుంచి భారత్‌లో ఫిర్యాదు చేయడం కష్టమని, నిందితులకు శిక్ష పడాలంటే నేరుగా ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేయాలని భావించాను. ఈ నెల 19న ఢిల్లీకి వచ్చి ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. త్వరలోనే నిందితులకు శిక్ష పడుతుంది' అని బాధిత మహిళ ఆశాభావం వ్యక్తంచేసింది.
తాను అందించిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారని, టూర్ గైడ్ సహా 11 మందిని విచారించినట్లు వెల్లడించింది. నిందితుల ఫొటోలు చూస్తే కచ్చితంగా వారిని గుర్తుపడతాను.. తనకు న్యాయం జరుగుతందని ధీమా వ్యక్తంచేసింది. భారతదేశమంటే తనకు ఇష్టమేనని, ఈ దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తానని.. అత్యాచారాలు అనేవి పెద్ద సమస్యగా గుర్తించి ఏ మహిళకు ఇలాంటివి జరగకుండా అరికట్టాలని ఆమె తన మెయిల్ ద్వారా పోలీసులకు విజ్ఞప్తిచేసింది.