అచ్చం హిట్లర్లాగే ఉన్నాడు.. అరెస్టు చేశారు
ఆస్ట్రియా: అచ్చం హిట్లర్లాగే ఉండటమే కాకుండా అలాంటి ప్రవర్తనే చూపిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రియా పోలీసులు అరెస్టు చేశారు. హిట్లర్ జన్మించిన బ్రౌనౌ నివాసం ముందు ఫొటోకు పోజివ్వడమే కాకుండా నాటి నాజీ పోకడలు గొప్పవని పొగిడినట్లుగా తన ప్రవర్తనను చూపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని జైలులో వేశారు. మరో విశేషమేమిటంటే అతడి పేరు కూడా హిట్లరే కావడం. అవును అతడి పేరు హరాల్డ్ హిట్లర్. అంతేకాదు.. అతడు ఇటీవలె జర్మనీ సరిహద్దు వరకు వెళ్లి తిరిగొచ్చాడట. అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్ కూడా ఆస్ట్రియా నుంచి జర్మనీలోకి 1913లో అడుగుపెట్టారు.
హరాల్డ్ హిట్లర్ అరెస్టుపై ఫర్ట్నర్ అనే పోలీసు అధికారి దీనిపై వివరణ ఇస్తూ అతడు ఉద్దేశపూర్వకంగా హిట్లర్లాగా ప్రవర్తించడం వల్లే తాము అరెస్టు చేశామని చెప్పారు. అతడు ఏం చేస్తున్నాడనే విషయంపై పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడని, కావాలని నాజీతత్వంతో తన్మయత్వం పొందినట్లు ప్రవర్తిస్తున్నాడని, ఇది జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఆస్ట్రియాలో నాజీల కాలంలో ఊచకోతలు జరిగాయి. వారు చేయని దారుణమంటూ లేదు. దీంతో నాజీ లక్షణాలు కనిపించేవారిని ఆస్ట్రియా పోలీసులు అస్సలు వదిలిపెట్టరు. బ్రౌనౌ నివాసంలో 1889లో హిట్లర్ జన్మించారు. ఈ నివాసాన్ని నియో నాజీలు గొప్పగా భావిస్తున్న నేపథ్యంలో గత ఏడాది ధ్వంసం చేయాలని ఆస్ట్రియా అధికారులు భావించారు.