వెంకన్నకే శఠగోపమా బాబూ..
తిరుపతి : ఎన్నికల హామీల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అర్చకులకు నెలకు రూ.5 వేల జీతం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు టీటీడీ నిధులకు ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి విమర్శించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అర్చకుల జీతాల చెల్లింపునకు అక్రమంగా శ్రీవారి నిధులను తీసుకుపోవాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు మాట్లాడుతూ జూలై 3, 4 తేదీల్లో మహిళా సమాఖ్య జిల్లా శిక్షణాతరగతులు, 11న జిల్లా సర్వసభ్య సమావేశం, 17, 18, 19 తేదీల్లో మదనపల్లెలోని హార్సిలీ హిల్స్‌లో సభ్ కమిటీ సభ్యులకు రాజకీయ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, ఆర్.వెంకయ్య, పి,.వెంకటరత్నం, పి.మురళి, ఆర్.హరిక్రిష్ణ, నాగరాజు, పిఎల్.నరసింహులు, రామచంద్రయ్య పాల్గొన్నారు.