వేర్వేరుగా ముగ్గురి ఆత్మహత్య
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: ప్రేమవివాహం అనంతర ం తల్లిదండ్రులు చేరదీయడం లేదని మాదగోని హరీష్‌గౌడ్(25) అనే యువకుడు గురువారం రాత్రి గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివరాజ్ వివరాల ప్రకారం.. నవీపేట్ మండలం నందిగామకు చెందిన హరీష్ గౌడ్ పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆర్మూర్ పట్టణానికి వలస వచ్చాడు. పట్టణంలో రాంనగర్లో నివాసముంటూ ఓ కల్లు డిపోలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిత్రం పట్టణానికి చెందిన స్వాతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని హరీష్ తల్లితండ్రులు నిరాకరించారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా మూడు రోజుల క్రితం కుమారుడి పుట్టు వెంట్రుక ల కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించాడు. వారు ఆహ్వానాన్ని తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన హరీష్ గురువారం సాయంత్రం ఇంట్లో గుళికల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరీష్‌ను స్థానికులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శివరాజ్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్, సావిత్రిలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నవీపేట : పుట్టు వెంట్రుకల శుభకార్యం జరగాల్సిన ఇంట్లో చావుమేళాలు మోగాయి. నవీపేట మండలంలోని నందిగామకు చెందిన హరీష్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన సొంతూరు నందిగామలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హరీష్గౌడ్కు 11 నెలల కిందట బాబు పుట్టగా పుట్టు వెంట్రుకల శుభకార్యాన్ని శుక్రవారం వైభవంగా జరపాలని నిశ్చయించుకున్నారు. బంధువులకు ఆహ్వానాన్ని పంపారు. అంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.
బావిలో దూకి వివాహిత
మద్నూర్ : మద్నూర్ మండలంలోని మేనూర్‌కు చెందిన పులికల్ల సారిక(27) అనారోగ్యంతో బాధపడుతూ గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో శోభన్‌బాబు తెలిపారు. ఎస్‌హెచ్‌వో వివరాల ప్రకారం... సారిక కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గురువారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వె ళ్లిపోయి గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం వరకు సారిక ఇంటికి రాకపోవడంతో కుటంబసభ్యులు ఆందోళన చెందారు. బావిలో మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బావిలోంచి బయటకి తీసి సారికగా గుర్తించారు. బిచ్కుంద సీఐ వేంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. సారికకు ఇద్దరు కుమారులు,భర్త సాయిలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో..
ఆర్మూర్ అర్బన్ : భార్యభర్తల మధ్య గొడ వ భర్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో రోళ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఉరుసు భీమయ్య(25) శుక్రవారం లయన్స్ బిల్డింగ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై ఖాజమొహీయోద్దీన్ వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఉరుసు భీమయ్య పదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణానికి జీవనోపాధి కోసం వలస వచ్చాడు. మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన శాంతతో ఆయనకు వివాహం జరిగింది. కాగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం భార్యతో గొడవపడి భీమయ్య ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయలు దేరాడు. అనంతరం లయన్స్ బిల్డింగ్ సమీపంలో చెట్టు ఉరివేసుకుని కొట్టుమిట్టాడుతుండగా.. ఆయనను వెతుక్కుంటూ వెళ్లిన ఉర్సు గణేష్, పల్లెపు సాయిలు, ఉర్సు లక్ష్మణ్ అనే బంధువులు గమనించి ఉరి తాడును తొలగించి భీమయ్యను రక్షించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే భీమయ్య ప్రాణాలను విడిచాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.