Haritaharam scheme
-
నర్సరీలకు ఎండదెబ్బ
- ఎండుతున్న మొక్కలు - కానరాని నీడ పందిళ్లు - సగం కూడా దక్కడం అనుమానమే! - వచ్చే నెల నుంచే హరితహారం - ప్రశ్నార్థకంగా పథకం అమలు మెదక్ జోన్: మండుతున్న ఎండలకు నర్సరీల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం హరితహారం పథకం అమలుకు అడ్డంకిగా మారాయి. మరో నెలరోజుల్లో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాల్సి ఉంది. కానీ అధికారుల ప్రాణాళికకు, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలకు చాలావ్యత్యాసం కనిపిస్తోంది. లక్ష్యం మేరకు మొక్కలు కానరావడంలేదు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రాణాళికను సిద్ధం చేశారు. అందుకు అణుగుణంగా 122 నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం సైతం సరైన వర్షాలు లేకపోవటంతో నర్సరీల్లో పెంచిన మొక్కలు 75 శాతం మేర అలాగే ఉన్నాయి. అందులో 50 శాతం పైగా మొక్కలు ఎండలకు ఎండిపోయాయి. గతయేడాది పెంచిన మొక్కలతో పాటు ఈయేడు మరికొన్ని మొక్కలను పెంచి మొత్తం 1.48 కోట్ల మొక్కలను నాటాలని ఫారెస్టు అధికారులు నిర్ణయించారు. కాని ఎండలు మండుతుండటంతో ఇప్పటికే 37 లక్షలకు పైగా మొక్కలు ఎండినట్టు సమాచారం. మొత్తానికి లక్ష్యం దిశగా అధికారులు అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకోసం మొక్కలను ఏఏ ప్రాంతాల్లో నాటాలి? ఏ ఏమొక్కలు నాటాలి? రైతులు ఏ రకమైన మొక్కలను కోరుకుంటున్నారు? రోడ్లకు ఇరువైపుల ఎన్ని లక్షల మొక్కలు నాటాలి? అనేదానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. అంతే కాకుండా అడవుల్లోని గ్యాప్‌ప్లాంటేషన్ 425 ఎకరాల్లో నాటేం దుకు సైతం అధికారులు ప్రాణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. కానీ ఎప్పుడు లేని విధంగా ఈయేడు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోతున్నాయి. అందుకు తోడు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం తోడైంది. దీంతో హరితహారం పథకం ఈయేడు అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం కష్టమని పలువురు భావిస్తున్నారు. ఎండల నుంచి నర్సరీల్లోని మొక్కలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నీడకోసం షెడ్ నెట్స్‌ను పంపిణీ చేస్తే అధికారులు వాటిని చాలాచోట్లా మూలాన పడేశారు. కొన్ని గ్రామాల్లో నర్సరీ నిర్వాహకులు ఆ నెట్లను మొక్కలకు కట్టకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్షం వల్లా షెడ్ నెట్లను ఏర్పాటు చేయక పోవటంతో నర్సరీల్లోని సగానికి పైగా మొక్కలు ఎండిపోతున్నాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు ఉన్నాయి. బైక్‌లు సైతం ఇచ్చినా.. ఫారెస్టు అధికారులు ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు కోట్లాది రూపాయలను వెచ్చించి బైక్‌లను సైతం ఇచ్చింది. కానీ ఆ బైక్‌లతో సొంత పనులకే ప్రాధాన్యం ఇస్తూ అడవుల సంరక్షణను మరిచి పోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో మొక్కలను రక్షించేందుకు తగుచర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరితహరం పథకంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం వచ్చేవర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.48 కోట్ల మొక్కలను నాటడం కష్టమనే చెప్పాలి. -
నేటి నుంచి ‘హరితహారం’
పోయిన వానలను మళ్లీ వెనక్కి తెప్పించే మహా యజ్ఞం సాగుతోంది.. పంట చేల మీది వానరాలను వెనక్కి పంపే గొప్ప యాగం జరుగుతోంది. రాబోయే విపత్తును తప్పించి, జన జాతులను, సకల జీవాలను కాపాడుకునే మహా ‘హరిత’ ఉద్యమం మన తలుపు తడుతోంది. ఉద్యమాల గడ్డ మనది.. ఉద్యమించే తరుణం ఇది. మరొక్కసారి అందరం చేయి.. చేయి కలుపుదాం.. బడిలో, గుడిలో.. చావడిలో.. చెరువుల్లో.. చేలల్లో.. ఇంటి పరిసరాల్లో.. చెట్లు పెరగటానికి అనువైన ప్రతి చోటా బాధ్యతగా మొక్కలను నాటుదాం.. నీళ్లుపోసి.. పొతం చేసి కాపాడుకుందాం. మన ఊరికి మనమే పచ్చని చెట్లను హారంగా వేద్దాం. దూరమైన కోయిలమ్మల కమ్మటి రాగం మళ్లీ చెవులారా విందాం. - మొత్తం మొక్కలు 3.52 కోట్లు - మొత్తం నర్సరీలు 450 - ఒక్కో నియోజకవర్గంలో నాటే మొక్కలు 40 లక్షలు - ఒక్కో గ్రామంలో నాటే మొక్కలు 40 వేలు - మహా ఉద్యమంలా ముందుకు... - ప్రతి ఒక్కరూ భాగస్వాములే! సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రస్తుతం జిల్లాలో 9.95 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. తక్షణం అటవీ శాతం పెంచి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పల్లెను పచ్చని వనంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పల్లెలో మొక్కను నాటి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంబించనున్నారు. పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కల చొప్పున జిల్లా వ్యాప్తంగా 3.50 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో కనీసం 30 నుంచి 40 వేల మొక్కలను పెంచటానికి ప్రభుత్వం సంకల్పించింది. మనందరి బాధ్యత... దాదాపు 60..70 ఏళ్ల నుంచి చెట్లను నరుక్కుంటూ వస్తున్నాం.. జిల్లాలో ఒకప్పుడు 35 శాతం ఉన్న అడవుల విస్తీర్ణం ఇప్పుడు కేవలం 9.95 శాతానికి పడిపోయింది. వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే జిల్లా భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలి. ఇంత శాతాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న చెట్లు కాకుండా 10.56 కోట్ల మొక్కలు అదనంగా పెంచాలి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇన్ని కోట్ల మొక్కలు పెంచడం ఒక్క ప్రభుత్వ యంత్రాంగంతో సాధ్యమయ్యేపని కాదు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కల నాటినప్పుడే జిల్లా 33 శాతం అడవులతో నిగనిగలాడుతుంది. అధికారులు నిబద్ధతో మెలగాలి... ‘చెప్పేదే చెయ్యి.. చేసేదే చెప్పు’ ఇదే హరితహారం నినాదం. లక్ష్యాన్ని చేరే క్రమంలో అధికారిక లెక్కలు.. అంచనాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయి. మొక్కలు నాటేందుకు కీలకమైన గుంతల తవ్వకాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం డొల్లతనం బయటపడింది. శుక్రవారం నాటి కార్యక్రమానికి ఎన్ని గుంతలు తీశారో అధికారులు ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోయారు. ‘మమ’ అనిపించుకుని కాకి లెక్కలతో నివేదికలు రూపొందించి మభ్య పెట్టే బదులు చేతనైనంతలోనే నిఖార్సుగా.. నిబద్ధతతో మొక్కలు నాటుదాం. నాటిని ప్రతి మొక్కను కాపాడుకునేందుకు కంకణబద్ధులవుదాం. దేశంలో మూడో పెద్ద కార్యక్రమంగా చరిత్రకెక్కిన హరితహారం పథకానికి అధికారులే నిబద్ధతతో మెలిగి పథకాన్ని విజయవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి... పొలంగట్ల మీద: టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సుబాబుల్, పండ్ల మొక్కలు ఇంటి పరిసరాల్లో: కరివేపాకు, మునగ, బొప్పాయి, జామ, ఉసిరి, దానిమ్మ, కానుగ, వేప, బాదం పాఠశాలలు, కార్యాలయాలు: కానుగ, వేప, బాదం, రావి, జువ్వి, మర్రి, నేరేడు, ఉసిరి రహదారుల పక్కన: ఎర్రతురాయి, పచ్చతురాయి, బాహీనియా, కానుగ, నేరేడు, దిరిశిన, సిస్సు చెరువుగట్లు: ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరి, తెల్లమద్ది, నల్లతుమ్మ బోడిగుట్టలు: ఉసిరి, సీతాఫలం, మర్రి, రావి, వేప తదితర మొక్కలు నాటుకోవచ్చు. -
‘హరితహారం’లో భాగస్వాములు కండి
- కలెక్టర్ రఘునందన్‌రావు మొయినాబాద్ రూరల్: హరితహారం పథకాన్ని మొయినాబాద్ మండలాన్ని మొదటిస్థానంలో నిలపాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు సూచించారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అధికారులందరు ప్రణాళిక ప్రకారం మండలాన్ని మూడు భాగాలుగా విభజించుకొని ఆ గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు, చర్చిల వంటి ప్రదేశాల్లో మొక్కలను నాటాలన్నారు. 2014 అక్టోబర్ 2 నుంచి 30 జూన్ 2015 వరకు పెళ్లిళ్లు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పూర్తి వివరాలను సేకరించి వారికి కళ్యాణలక్ష్మి పథకం వర్తించేలా చూడాలన్నారు. ఈనెల 14న చేవెళ్లలో తెలంగాణ ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. ఈ ఫెస్టివల్లో ఒక్కో గ్రామం నుంచి ముగ్గురు యువకులను గతం లో ఎలాంటి బహుమతులు పొందని వారిని ఎంపిక చేసి ఈ పోటీలకు పంపించాలని సూ చించారు. మండలంలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు యువకులను పంపించేందుకు కృషిచేయాలన్నారు. జేసీ ఆమ్రపాలి మాట్లాడుతూ మండలంలో రేషన్‌కార్డులకు ఆధార్‌కార్డుల అనుసంధానం ఇంకా కావాల్సి ఉందన్నారు. ఓటర్ ఐడీ కార్డులకు ఆధార్‌కార్డు అనుసంధా నం జూన్ 2వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని పౌష్టికాహరం పంపిణీ తీరు ఎలా ఉందని సూపర్వైజర్ సరోజినిబాయిని అడిగారు. కార్యక్రమంలో సమీక్ష సమావేశ ప్రత్యేకాధికారి బలరాం, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ సుభాషిణి, ఏఈలు బల్వంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఈఓపీఆర్డీ సునంద, ఆర్ఐ విజయ్‌కుమార్, వీఆర్ఓలు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. భాగస్వాములు కండి.. మణికొండ: ‘హరితహారం’ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాలపై స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ఎంపిక చేయాల్సిన స్థలాలు, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం, వాటర్‌గ్రిడ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు, మహిళా భద్రత, ఆరోగ్యలక్ష్మి, మిషన్‌కాకతీయ, స్వచ్ఛభారత్, విద్య, వ్యవసాయం తదితర పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో మండల పరిషత్ అధ్యక్షుడు తలారి మల్లేశ్, మండల ప్రత్యేకాధికారి చంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ, పాపిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ బాబు శ్రీనివాస్, ఈఓపీఆర్డీ చంద్రకుమార్, ఏఈలు హన్మంత్‌రెడ్డి, లిఖిత, గీత, ఆర్ఐలు ప్రసాద్, ఆనంద్‌సింగ్, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.