Hariyana hyamars
-
హ్యామర్స్ జోరు
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 లో హరియాణా హ్యామర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 5–2తో యూపీ దంగల్ జట్టును చిత్తుగా ఓడించింది. హరియాణా తరఫున మజోమెడ్ కుర్బనలివ్ (70 కేజీలు), రజనీశ్ (65 కేజీలు), గడిసోవ్ (97 కేజీలు), సందీప్ తోమర్ (57 కేజీలు), సోఫియా మాట్సన్ (53 కేజీలు) గెలుపొందారు. యూపీ దంగల్ తరఫున ఎలిట్సా యన్కోవా (48 కేజీలు), మారియా మమషుక్ (75 కేజీలు) తమ ప్రత్యర్థులను ఓడించారు. గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథితో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ తలపడుతుంది. -
జైపూర్ జయహో
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో జైపూర్ నింజాస్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జైపూర్ నింజాస్ 5–2తో పంజాబ్ రాయల్స్ జట్టును ఓడించింది. జైపూర్ తరఫున జాకబ్ మకరష్విలి (74 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), జెన్నీ ఫ్రాన్సన్ (75 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు), ఎలిజ్బార్ ఒలికద్జే (97 కేజీలు) తమ బౌట్లలో గెలుపొందారు. పంజాబ్ జట్టుకు ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్ వ్లాదిమిర్ ఖిన్చెగష్విలి (57 కేజీలు), ఒడునాయో అడెకురోయె (53 కేజీలు) విజయాలను అందించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూపీ దంగల్‌తో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది. -
చాంప్ ముంబై గరుడ
♦ ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌పై 7-2తో విజయం ♦ ముగిసిన ప్రొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ఆద్యంతం అజేయంగా నిలిచిన ముంబై గరుడ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై గరుడ 7-2 బౌట్ల తేడాతో హరియాణా హ్యామర్స్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై గరుడ... సెమీఫైనల్లో, ఫైనల్లో అదే జోరును కనబరిచింది. మహిళల విభాగంలో ఒడునాయో అడుకురోయె (ముంబై గరుడ), వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్)... పురుషుల విభాగంలో నర్సింగ్ పంచమ్ యాదవ్ (బెంగళూరు యోధాస్) ‘ఉత్తమ రెజ్లర్’ పురస్కారాలు గెలుచుకున్నారు. ఫైనల్‌కు వేదికగా నిలిచిన స్థానిక కె.డి. జాదవ్ స్టేడియం హౌస్‌ఫుల్ అయ్యింది. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. సెమీఫైనల్ వరకు ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహించగా... ఫైనల్‌ను ‘బెస్ట్ ఆఫ్ నైన్’గా నిర్వహించారు. పురుషుల 65 కేజీల బౌట్లో అమిత్ ధన్కర్ (ముంబై గరుడ) మూడు నిమిషాల ఆరు సెకన్ల వ్యవధిలో 12-0తో విశాల్ రాణా (హరియాణా)పై టెక్నికల్ సుపీరియారిటీ (10 పాయింట్ల తేడా ఉండటం) పద్ధతిలో నెగ్గి ముంబైకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల 58 కేజీల బౌట్లో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్హెల్ (హరియాణా) రెండు నిమిషాల రెండు సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో సాక్షి మాలిక్ (ముంబై)ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల 74 కేజీల బౌట్లో లివాన్ లోపెజ్ (హరియాణా) 11-6తో ప్రదీప్ (ముంబై)పై నెగ్గడంతో హరియాణా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ముంబై గరుడ రెజ్లర్లు అద్భుత పోరాటం కనబరిచి తర్వాతి ఐదు బౌట్లలో విజయం సాధించి విజేతగా నిలిచారు. మహిళల 69 కేజీల బౌట్లో అడెలైన్ గ్రే (ముంబై) 10-0తో గీతిక (హరియాణా)పై... పురుషుల 125 కేజీల బౌట్లో గియోర్గి (ముంబై) ఒక నిమిషం 43 సెకన్లలో 10-0తో హితేందర్ (హరియాణా)పై... మహిళల 53 కేజీల బౌట్లో ఒడునాయో (ముంబై) 9-0తో తాతియానా కిట్ (హరియాణా)పై.. పురుషుల 97 కేజీల బౌట్లో ఎలిజ్బార్ (ముంబై) 6-4తో వలెరీ (హరియాణా)పై... మహిళల 48 కేజీల బౌట్లో నిర్మలా దేవి (హరియాణా)పై రీతూ ఫోగట్ (ముంబై)... పురుషుల 57 కేజీల బౌట్లో రాహుల్ అవారె (ముంబై) 6-3తో నితిన్ (హరియాణా)పై గెలిచారు. -
ఫైనల్లో హరియాణా హ్యామర్స్
► సెమీస్‌లో పంజాబ్‌పై 4-3తో గెలుపు ► ప్రొ రెజ్లింగ్ తుదిపోరులో నేడు ముంబైతో ఢీ న్యూఢిల్లీ: నిర్ణయాత్మక బౌట్లో రెజ్లర్ లివాన్ లోపెజ్ అజుకి సంచలన ప్రదర్శనతో.... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో హరియాణా హ్యామర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హరియాణా 4-3తో పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. ఆరంభంలో ‘పట్టు’ చూపించడంలో వెనుకబడిన హరియాణా తర్వాతి బౌట్లలో మాత్రం చెలరేగింది. కీలకమైన ఆఖరి బౌట్లో లోపెజ్ (హరియాణా) 5-1తో ప్రవీణ్ రాణా (పంజాబ్)పై గెలిచి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బౌట్ ఆరంభంలోనే ప్రవీణ్ గాయపడటంతో అతని గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. అంతకుముందు తొలి రెండు బౌట్లలో రజనీష్ (65 కేజీ) 12-2తో విశాల్ రాణాపై; వాసిలిసా మర్జాలిక్ (69 కేజీ) 4-0తో గీతికా జక్కర్‌పై గెలవడంతో పంజాబ్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత హరియాణా రెజ్లర్లు అండ్రెట్సి వాలెరి (97 కేజీ) 5-4తో మౌసమ్ ఖత్రిపై; తతన్య కిట్ (53 కేజీ) ప్రియాంక ఫోగట్‌పై గెలిచి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక 125 కేజీల బౌట్లో చులున్బత్ (పంజాబ్) 5-1తో హితేందర్ (హరియాణా)పై గెలిస్తే... ఒక్సానా హర్హెల్ (హరియాణా) 4-0తో గీత ఫోగట్‌పై నెగ్గింది. దీంతో స్కోరు 3-3తో సమమైంది. గాయంతో హరియాణా స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో హరియాణా... పటిష్టమైన ముంబైతో తలపడుతుంది. -
ప్రపంచ చాంపియన్‌పై గీత గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో పంజాబ్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రెజ్లర్ గీత ఫోగట్ పెను సంచలనం సృష్టించింది. మహిళల 58 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్హెల్ (హరియాణా హ్యామర్స్)తో జరిగిన బౌట్లో గీత ఫోగట్ 8-6 పాయింట్ల తేడాతో గెలిచి ఆశ్చర్యపరిచింది. పీడబ్ల్యూఎల్‌లో అత్యధిక మొత్తం అందుకున్న రెజ్లర్‌గా గుర్తింపు పొందిన ఒక్సానా ఒకదశలో 6-5తో ముందంజలో ఉంది. అయితే చివరి సెకన్లలో గీత పట్టుదలతో పోరాడి మూడు పాయింట్లు సాధించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పంజాబ్ రాయల్స్ 5-2తో హరియాణా హ్యామర్స్ను ఓడించి ఈ లీగ్‌లో మూడో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. పంజాబ్ రాయల్స్ తరఫున వ్లాదిమిర్ (57 కేజీలు), మౌజమ్ ఖత్రీ (97 కేజీలు), చులున్బట్ (125 కేజీలు), వాసిలిసా (69 కేజీలు) గెలుపొందగా... హరియాణా తరఫున యోగేశ్వర్ దత్ (65 కేజీలు), నిర్మలా దేవి (48 కేజీలు) విజయం సాధించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు యోధాస్‌తో ఢిల్లీ వీర్ తలపడుతుంది.