చాంప్ ముంబై గరుడ | mumbai garuda victory in finals | Sakshi
Sakshi News home page

చాంప్ ముంబై గరుడ

Published Mon, Dec 28 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

చాంప్ ముంబై గరుడ

చాంప్ ముంబై గరుడ

ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌పై 7-2తో విజయం 
♦ ముగిసిన ప్రొ రెజ్లింగ్ లీగ్


 న్యూఢిల్లీ: ఆద్యంతం అజేయంగా నిలిచిన ముంబై గరుడ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై గరుడ 7-2 బౌట్‌ల తేడాతో హరియాణా హ్యామర్స్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై గరుడ... సెమీఫైనల్లో, ఫైనల్లో అదే జోరును కనబరిచింది.
 
  మహిళల విభాగంలో ఒడునాయో అడుకురోయె (ముంబై గరుడ), వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్)... పురుషుల విభాగంలో నర్సింగ్ పంచమ్ యాదవ్ (బెంగళూరు యోధాస్) ‘ఉత్తమ రెజ్లర్’ పురస్కారాలు గెలుచుకున్నారు. ఫైనల్‌కు వేదికగా నిలిచిన స్థానిక కె.డి. జాదవ్ స్టేడియం హౌస్‌ఫుల్ అయ్యింది. భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. సెమీఫైనల్ వరకు ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహించగా... ఫైనల్‌ను ‘బెస్ట్ ఆఫ్ నైన్’గా నిర్వహించారు.
 
 పురుషుల 65 కేజీల బౌట్‌లో అమిత్ ధన్‌కర్ (ముంబై గరుడ) మూడు నిమిషాల ఆరు సెకన్ల వ్యవధిలో 12-0తో విశాల్ రాణా (హరియాణా)పై టెక్నికల్ సుపీరియారిటీ (10 పాయింట్ల తేడా ఉండటం) పద్ధతిలో నెగ్గి ముంబైకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల 58 కేజీల బౌట్‌లో ప్రపంచ చాంపియన్ ఒక్సానా హెర్‌హెల్ (హరియాణా) రెండు నిమిషాల రెండు సెకన్లలో ‘బై ఫాల్’ పద్ధతిలో సాక్షి మాలిక్ (ముంబై)ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల 74 కేజీల బౌట్‌లో లివాన్ లోపెజ్ (హరియాణా) 11-6తో ప్రదీప్ (ముంబై)పై నెగ్గడంతో హరియాణా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
 
  అయితే ముంబై గరుడ రెజ్లర్లు అద్భుత పోరాటం కనబరిచి తర్వాతి ఐదు బౌట్‌లలో విజయం సాధించి విజేతగా నిలిచారు. మహిళల 69 కేజీల బౌట్‌లో అడెలైన్ గ్రే (ముంబై) 10-0తో గీతిక (హరియాణా)పై... పురుషుల 125 కేజీల బౌట్‌లో గియోర్గి (ముంబై) ఒక నిమిషం 43 సెకన్లలో 10-0తో హితేందర్ (హరియాణా)పై... మహిళల 53 కేజీల బౌట్‌లో ఒడునాయో (ముంబై) 9-0తో తాతియానా కిట్ (హరియాణా)పై.. పురుషుల 97 కేజీల బౌట్‌లో ఎలిజ్‌బార్ (ముంబై) 6-4తో వలెరీ (హరియాణా)పై... మహిళల 48 కేజీల బౌట్‌లో నిర్మలా దేవి (హరియాణా)పై రీతూ ఫోగట్ (ముంబై)... పురుషుల 57 కేజీల బౌట్‌లో రాహుల్ అవారె (ముంబై) 6-3తో నితిన్ (హరియాణా)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement