కోత కష్టాలకిక తెర
తూర్పు ఢిల్లీవాసులకు శుభవార్త. ఇప్పటిదాకా ఎదుర్కొన్న విద్యుత్ కోత సమస్య కొంతమేర పరిష్కారం కానుంది. ఇందుకు కారణం ట్రాన్స్ యమునాప్రాంతంలో ఏర్పాటుచేసిన సబ్‌స్టేషన్ పనులు పూర్తవడమే. ఈ నెల 19వ తేదీన దీనిని ప్రారంభించనున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ:స్థానిక ట్రాన్స్ యమునాప్రాంతంలో విద్యుత్ సరఫరా త్వరలో మెరుగుపడనుంది. ఇందుకు కారణం 400 కేవీ హర్ష్విహార్ గ్రిడ్ సబ్‌స్టేషన్ త్వరలో ప్రారంభం కానుండడమే. డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌లో సమస్యలు విద్యుత్ సరఫరాకు ఆటంకాలు సృష్టిస్తున్నాయి. విద్యుత్ కొరత సమస్యను పరిష్కరించడం కోసం డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను మెరుగుపర చాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం... సబ్స్టేషన్లను ఏర్పాటుచేసే పనిలో పడింది. ప్రస్తుతం నగరంలో దాదాపు డజను సబ్స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో హర్ష్విహార్, పీరాఘడ్ సబ్స్టేషన్లు ఈ సంవత్సరం ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిలో హర్షవిహార్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 19వ తేదీన దీనిని ప్రారంభించనున్నట్టు తొలుత ప్రకటించారు. అయితే అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం కాస్తా వాయిదాపడింది. ఈ సబ్‌స్టేషన్ ప్రారంభ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
400 కేవీ హర్ష్విహార్ సబ్‌స్టేషన్ స్థానిక లోనీ రోడ్డు మార్గంలో ఉంది. దీనిని దాద్రీ పవర్ స్టేషన్‌తో జోడిస్తారు. దీనిని ప్రారంభించిన తరువాత తరచూ విద్యుత్ కోత సమస్యల నుంచి బాధపడే తూర్పు ఢిల్లీవాసులకు ఊరట లభించనుంది. పీరాఘడిలోని సబ్‌స్టేషన్ నిర్మాణం కూడా చాలావరకు పూర్తయింది. దీనిని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఇంకా ఇవికాకుండా ఓఖ్లా, పప్పన్కలాన్, తుగ్లకాబాద్, ఆర్పీఎన్,ఆనంద్‌విహార్, పంజాబీ బాగ్. చంద్రావల్, బుడేలా, జేఎన్‌యూతోపాటు పాత ఢిల్లీలో 220 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు త్వరలో పూర్తయ్యే అవకాశముంది.