H.Arun kumar
-
అన్నదాత పై అ‘బీమా’నం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ నుంచే దీనిని అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించగా.. పంటల్ని బీమా చేయించుకునే కర్షకుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం కింద అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారి తరఫున బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) అమల్లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొన్ని పంటలకు ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పథకాన్ని అమలు చేస్తుండగా.. అన్ని జిల్లాలలో పీఎంఎఫ్‌బీవైని అమలు చేస్తున్నారు. రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులే రూపాయి చొప్పున మినహాయించుకుని బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రంలో రూపాయి చెల్లించి రైతు పేరు, సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, భూమి వివరాలను నమోదు చేయించుకుంటే సరిపోతుంది. రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.1,163 కోట్లను కేటాయించింది. ప్రతి రైతుకూ లబ్ధి పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రకారం రైతులు ప్రీమియం విలువలో 2 నుంచి 5 శాతం సొమ్ము చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించేవి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు రైతులపై భారం పడకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో పంట వేసే ప్రతి రైతూ లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో 65 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. రైతులతోపాటు కౌలు రైతుల తరఫున కూడా ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లిస్తుంది. బీమా ప్రీమియం చెల్లింపునకు తొలుత జూలై 31 వరకే గడువు విధించగా.. ఆగస్టు చివరి వరకు పొడిగించారు. ఇప్పటికే 14.42 లక్షల మందికి వర్తింపు రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల బీమా చేయించుకున్న రైతుల సంఖ్య 14.42 లక్షలకు చేరిందని, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ చెప్పారు. ఉచిత బీమా పథకంలో చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం శుభపరిణామమని పేర్కొన్నారు. రైతులు ఈ పథకాన్ని ఎంత వినియోగించుకుంటే అంత మంచిదన్నారు. కేవలం ఒక్క రూపాయితో బీమా పొందే సౌకర్యం దేశంలో బహుశా ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారి ప్రవేశపెట్టినట్టు వివరించారు. -
జేసీగా సర్ఫరాజ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రెండేళ్లకు పైగా జిల్లాలో పని చేసిన జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కొత్త జేసీగా జిల్లాకు రానున్నారు. సర్ఫరాజ్ ప్రస్తుతం వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా మంగళవారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సర్ఫరాజ్ బుధవారం విధుల్లో చేరనున్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య సెలవులో ఉండడంతో జేసీగా జిల్లాకు రానున్న సర్ఫరాజ్... వచ్చీరాగానే ఇన్చార్జి కలెక్టర్ బాధ్యతలు చేపడతారు. తన కెరీర్లో ఇటు జేసీగా, అటు ఇన్చార్జి కలెక్టర్‌గా జోడు విధులు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్ఫరాజ్ కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2008 సివిల్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో 26వ ర్యాంకు సాధించారు. 2009 బ్యాచ్‌లో ఐఏఎస్ శిక్షణ అనంతరం.. మొదట గుంటూరులో ట్రెయినీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2011 సెప్టెంబరు లో వరంగల్ జిల్లా ములుగు సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్నారు. 2012 ఆగస్టులో బదిలీపై అదే జిల్లాలో ఏటూరునాగా రం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో తన వివాహ నిమిత్తం సెలవుపై వెళ్లిన సర్ఫరాజ్ ఈ నెల 17న తిరిగి విధుల్లో చేరారు. వారం రోజులు తిరక్కముందే వెలువడ్డ బదిలీ ఉత్తర్వులతో... కరీంనగర్ జేసీగా రానున్నారు. వరంగల్ జిల్లా లో రెండేళ్లకు పైగా పని చేసిన సర్ఫరాజ్ ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేసిన గుర్తింపు అందుకున్నారు. ఇసుక రీచ్‌ల వేలం విషయంలో మొండిగా వ్యవహరించి తన మాట విననందుకు వరంగల్ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ సర్ఫరాజ్ బదిలీ కి పట్టుపట్టినట్లు ప్రచారం జరిగింది. అందుకే మేడారం జాతర సమీపిస్తున్నప్పటికీ బదిలీ జరిగిందనే చర్చ జరుగుతోంది. పాలనలో తనదైన ముద్ర ఇంతకాలం జాయింట్ కలెక్టర్‌గా, ఇన్చార్జి కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అరుణ్‌కుమార్‌ను ప్రభుత్వం గిరిజ న సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. అరుణ్‌కుమార్ 2011 ఆగస్టు 3న జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టారు. అటు ఉద్యోగులు... ఇటు ప్రజల్లో డైనమిక్ జేసీగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్ గతంలో కాకినాడ, నెల్లూరు ఆర్డీవో, రాజవుండ్రి నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో జేసీగా విధులు నిర్వర్తించారు. రెవెన్యూ, పౌర సరఫరాశాఖలపై ప్రత్యేక పట్టు సాధించారు. మరోవైపు ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రెవెన్యూ యంత్రాంగంలో విధుల అలసత్వంపై కఠినంగా వ్యవహరించారు. జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఎల్లంపల్లి, మిడ్‌మానేర్ నిర్వాసితులకు పునరావాసం అందించే చర్యలను వేగవంతం చేశారు. అసైన్డ్ భూవుులు, దేవాదాయు, ధర్మదాయు, సీలింగ్, ప్రభుత్వ భూవుులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి హెచ్చరించారు. ఒకదశలో ఉద్యోగ సంఘాలకు సైతం మింగుడు పడని అధికారిగా ప్రత్యేకత చాటుకున్నారు. జిల్లాలో పని చేయడం తనకు సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్లనున్న అరుణ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్లకు పైగా తనకు సహకరించిన అధికారులు, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
రైతులను ఆదుకుంటాం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించి రైతులను ఆదుకుంటామని ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 592 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే ప్రజా విజ్ఞప్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయజెండాను ఎగురవేసి ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రభాగాన నిలవడమే కాకుండా తెలంగాణకే కరీంనగర్ జిల్లా తలమానికంగా నిలుస్తోందన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటాల్లోనే.. రెండవ విడత రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 1,08,019 తెల్లరేషన్ కార్డులు, 44,017 పింఛన్లు, 31వేల గృహాలు మంజూరు చేశాం. ఈ నెల 11 నుంచి నిర్వహించే మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తాం. తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 62,958 కార్డుల మంజూరు కోసం ఆన్లైన్లో నమోదు చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని అందిస్తాం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు అందించడమే లక్ష్యంగా జిల్లాలో గ్రామ సందర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటివరకు 12 విడతలుగా 684 గ్రామాలు, 237 వార్డులలో గ్రామ సందర్శన జరిగింది. 1,06,486 వ్యక్తిగత సమస్యల దరఖాస్తులను రాగా, 70,778 దరఖాస్తులను పరిష్కరించాం. రెండు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, రెండు లక్షల కుటుంబాలకు వంద రోజలు పని, ఐదు లక్షల మంది వయోజనులను అక్షరాస్యులను తీర్చిదిద్ది జాతీ య అక్షరాస్యత పరీక్షకు హాజరుపర్చేందుకు కృషి చేస్తాం. పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి ఓటు బలమైన ఆయుధం. ప్రజాస్వామ్యంలో ఓటరే పరిపాలకుడు. 18 సంవత్సరాలు నిండినవారందరినీ జాబితాలో చేర్పించి నిజమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చే సాధారణ ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ జరిగేలా చైతన్యవంతం చేస్తున్నాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. 47 మోడల్ స్కూల్స్‌లో 40 పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం ప్రారంభించాం. 1-10 తరగతి వరకు 3,053 పాఠ శాలల్లోని 2,70,306 మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నాం. ఎస్ఆర్డీడబ్ల్యూపీ కింద జిల్లాలో ప్రభుత్వ భవనాలు కలిగిన 250 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యార్థం రూ.18.7 కోట్లు మంజూరు చేసి 200 పనులు పూర్తి చేశాం. 679 పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించేందుకు రూ.54.8 కోట్లు మంజూరు చేసి 639 పనులు పూర్తి చేశాం. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించి మెరుగైన వైద్య సేవలందిస్తూ ప్రసవాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన 12,625 మంది గర్భిణులకు జననీ సురక్ష యోజన పథకం కింద కాన్పు అయిన వెంటనే పారితోషికం కింద రూ.8.6 కోట్లు పంపిణీ చేశాం. సమగ్ర పారిశుధ్య పథకం కింద ఉపాధిహామీ పథకంలో 2014 మార్చి వరకు జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రూ.227.97 కోట్ల అంచనాలతో 2,50,503 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు 56,892 మరుగుదొడ్లు పూర్తి కాగా, రూ.55.95 కోట్ల చెల్లింపులు చేశాం. ఎలగందల్ ఖిల్లాపై సౌండ్, లైటింగ్ అభివృద్ధి పనులకు రూ.4.62 కోట్లను పర్యాటక శాఖ మంజూరు చేసిం ది. పనులు త్వరలోనే ప్రారంభించనున్నాం. రూ.11.88 కోట్లతో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో రెస్టారెంట్, గెస్ట్‌హౌస్ పనులు ప్రారంభించాం. క్రీడలను ప్రోత్సహించేందుకు మండలానికో మినీ స్టేడియం నిర్మాణానికి జిల్లాకు రూ.27.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఐఏపీ కింద నక్సల్ ప్రభావిత మారుమూల ప్రాంతాల అభివృద్ధికి గతేడాది రూ.31.12 కోట్లతో 228 పనులు మంజూరు చేసి 120 పనులు పూర్తి చేశాం. ప్రజావాణి సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ప్రజావాణిలో ఇంతవరకు 1,61,626 దరఖాస్తులు నమోదు కాగా 1,54,345 దరఖాస్తులు పరిష్కరించామని వివరించారు.