సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రెండేళ్లకు పైగా జిల్లాలో పని చేసిన జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ కొత్త జేసీగా జిల్లాకు రానున్నారు. సర్ఫరాజ్ ప్రస్తుతం వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా మంగళవారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
సర్ఫరాజ్ బుధవారం విధుల్లో చేరనున్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య సెలవులో ఉండడంతో జేసీగా జిల్లాకు రానున్న సర్ఫరాజ్... వచ్చీరాగానే ఇన్‌చార్జి కలెక్టర్ బాధ్యతలు చేపడతారు. తన కెరీర్‌లో ఇటు జేసీగా, అటు ఇన్‌చార్జి కలెక్టర్‌గా జోడు విధులు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సర్ఫరాజ్ కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2008 సివిల్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో 26వ ర్యాంకు సాధించారు. 2009 బ్యాచ్‌లో ఐఏఎస్ శిక్షణ అనంతరం.. మొదట గుంటూరులో ట్రెయినీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2011 సెప్టెంబరు లో వరంగల్ జిల్లా ములుగు సబ్ కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్నారు. 2012 ఆగస్టులో బదిలీపై అదే జిల్లాలో ఏటూరునాగా రం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో తన వివాహ నిమిత్తం సెలవుపై వెళ్లిన సర్ఫరాజ్ ఈ నెల 17న తిరిగి విధుల్లో చేరారు. వారం రోజులు తిరక్కముందే వెలువడ్డ బదిలీ ఉత్తర్వులతో... కరీంనగర్ జేసీగా రానున్నారు. వరంగల్ జిల్లా లో రెండేళ్లకు పైగా పని చేసిన సర్ఫరాజ్ ముక్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేసిన గుర్తింపు అందుకున్నారు. ఇసుక రీచ్‌ల వేలం విషయంలో మొండిగా వ్యవహరించి తన మాట విననందుకు వరంగల్ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ సర్ఫరాజ్ బదిలీ కి పట్టుపట్టినట్లు ప్రచారం జరిగింది. అందుకే మేడారం జాతర సమీపిస్తున్నప్పటికీ బదిలీ జరిగిందనే చర్చ జరుగుతోంది.
పాలనలో తనదైన ముద్ర
ఇంతకాలం జాయింట్ కలెక్టర్‌గా, ఇన్‌చార్జి కలెక్టర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అరుణ్‌కుమార్‌ను ప్రభుత్వం గిరిజ న సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ట్రైబర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. అరుణ్‌కుమార్ 2011 ఆగస్టు 3న జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టారు. అటు ఉద్యోగులు... ఇటు ప్రజల్లో డైనమిక్ జేసీగా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్ గతంలో కాకినాడ, నెల్లూరు ఆర్డీవో, రాజవుండ్రి నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేశారు. విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో జేసీగా విధులు నిర్వర్తించారు. రెవెన్యూ, పౌర సరఫరాశాఖలపై ప్రత్యేక పట్టు సాధించారు.
మరోవైపు ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రెవెన్యూ యంత్రాంగంలో విధుల అలసత్వంపై కఠినంగా వ్యవహరించారు. జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఎల్లంపల్లి, మిడ్‌మానేర్ నిర్వాసితులకు పునరావాసం అందించే చర్యలను వేగవంతం చేశారు. అసైన్డ్ భూవుులు, దేవాదాయు, ధర్మదాయు, సీలింగ్, ప్రభుత్వ భూవుులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి హెచ్చరించారు. ఒకదశలో ఉద్యోగ సంఘాలకు సైతం మింగుడు పడని అధికారిగా ప్రత్యేకత చాటుకున్నారు. జిల్లాలో పని చేయడం తనకు సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్లనున్న అరుణ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. రెండేళ్లకు పైగా తనకు సహకరించిన అధికారులు, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జేసీగా సర్ఫరాజ్
Published Wed, Dec 25 2013 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement