Haryana Hammers
-
ప్రొ రెజ్లింగ్ లీగ్ విజేత హరియాణా హ్యామర్స్
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడు సీజన్లలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హరియాణా హ్యామర్స్ జట్టు నాలుగో సీజన్లో మాత్రం మెరిసింది. తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) చాంపియన్‌గా అవతరించింది. గురువారం జరిగిన ఫైనల్లో హరియాణా హ్యామర్స్ 6–3తో గతేడాది విజేత పంజాబ్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తొమ్మిది బౌట్లలో వరుసగా ఐదు బౌట్లలో గెలిచి హరియాణా జట్టు ట్రోఫీని ఖాయం చేసుకుంది. విజేత ఖరారు కావడంతో పంజాబ్ రాయల్స్ చివరి నాలుగు బౌట్లలో మూడింటిలో గెలిచినా ఫలితం లేకపోయింది. హరియాణా హ్యామర్స్ తరఫున అలెగ్జాండర్ ఖొట్సియాన్వ్స్కీ (125 కేజీలు), అలీ షబనోవ్ (86 కేజీలు), కిరణ్ (మహిళల 76 కేజీలు), రవి కుమార్ (57 కేజీలు), అనస్తాసియా నిచిత (మహిళల 57 కేజీలు), తయానా ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) గెలుపొందారు. పంజాబ్ రాయల్స్ తరఫున బజరంగ్ పూనియా (65 కేజీలు), అమిత్ ధన్కర్ (74 కేజీలు), అంజు (53 కేజీలు) నెగ్గారు. -
ఎంపీ యోధపై హరియాణా గెలుపు
లుథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో యువ రెజ్లర్ రవికుమార్... సందీప్ కుమార్‌కు షాకిచ్చాడు. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా హ్యామర్స్ 4–3తో ఎంపీ యోధపై గెలుపొందింది. 86 కేజీల పురుషుల బౌట్లో అలీ షబనోవ్ 8–0తో దీపక్ (ఎంపీ యోధ)పై గెలుపొందగా, మహిళల 76 కేజీల విభాగంలో కిరణ్ 0–6తో అండ్రియా కరోలినా (ఎంపీ యోధ) చేతిలో కంగుతింది. పురుషుల 65 కేజీల కేటగిరీలో రజనీశ్ 0–5తో హాజి అలియెవ్ (ఎంపీ యోధ) చేతిలో కంగుతినడంతో హరియాణా 1–2తో వెనుకబడింది. ఈ దశలో హ్యామర్స్కు తయన ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) 6–0తో ఎలైస్ మనొలొవ (ఎంపీ యోధ)పై గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. పురుషుల 74 కేజీల్లో ప్రవీణ్ రాణా 0–7తో వసిల్ మిఖాయిలొవ్ (ఎంపీ యోధ) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల 57 కేజీల విభాగంలో నిచిత 8–0తో పూజ ధండ (ఎంపీ యోధ)పై నెగ్గింది. స్కోరు 3–3తో సమమైన దశలో నిర్ణాయక పురుషుల 57 కేజీల విభాగంలో రవి 10–0తో సందీప్ తోమర్ (ఎంపీ యోధ)ను కంగుతినిపించడంతో లీగ్‌లో హ్యామర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. -
హరియాణా హ్యామర్స్ శుభారంభం
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో హరియాణా హ్యామర్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే నెగ్గి శుభారంభం చేసింది. శనివారం ఢిల్లీ వీర్స్తో జరిగిన పోరులో 5-2తో నెగ్గింది. గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరంగా ఉన్న స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 65 కేజీ విభాగంలో నవ్రుజోవ్ ఇక్తియార్పై 3-2తో నెగ్గాడు. రెండో రౌండ్లో ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బంది పడినా తుదకు విజేతగా నిలిచాడు. అంతకుముందు తొలి బౌట్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత లివాన్ లోపెజ్ (హరియాణా) 74 కేజీ విభాగంలో 7-0తో దినేశ్‌ను చిత్తు చేశాడు. ఢిల్లీ వీర్ తరఫున గుర్పాల్ సింగ్ (97 కేజీలు) 11-0తో యూరీ మెయిర్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేశాడు. మహిళల 58 కేజీల్లో ప్రపంచ నంబర్‌వన్ ఒక్సానా హెర్హెల్ 6-1తో ఎలిఫ్ జాలేను ఓడించి హరియాణా కు ఆధిక్యం అందించింది. పురుషుల 125 కేజీల్లో హితేందర్ (హరియాణా) 7-4తో క్రిషన్ కుమార్‌పై గెలుపొందగా... మహిళల 69 కేజీల్లో గీతికా (హరియాణా) వరుసగా రెండు పాయింట్లు సాధించి 2-2తో నిక్కీని ఓడించింది. 48 కేజీల్లో వినేశ్ 10-0తో నిర్మలా దేవి (హరియాణా)పై గెలిచింది.