
లుథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో యువ రెజ్లర్ రవికుమార్... సందీప్ కుమార్‌కు షాకిచ్చాడు. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా హ్యామర్స్ 4–3తో ఎంపీ యోధపై గెలుపొందింది. 86 కేజీల పురుషుల బౌట్‌లో అలీ షబనోవ్ 8–0తో దీపక్ (ఎంపీ యోధ)పై గెలుపొందగా, మహిళల 76 కేజీల విభాగంలో కిరణ్ 0–6తో అండ్రియా కరోలినా (ఎంపీ యోధ) చేతిలో కంగుతింది. పురుషుల 65 కేజీల కేటగిరీలో రజనీశ్ 0–5తో హాజి అలియెవ్ (ఎంపీ యోధ) చేతిలో కంగుతినడంతో హరియాణా 1–2తో వెనుకబడింది.
ఈ దశలో హ్యామర్స్‌కు తయన ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) 6–0తో ఎలైస్ మనొలొవ (ఎంపీ యోధ)పై గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. పురుషుల 74 కేజీల్లో ప్రవీణ్ రాణా 0–7తో వసిల్ మిఖాయిలొవ్ (ఎంపీ యోధ) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల 57 కేజీల విభాగంలో నిచిత 8–0తో పూజ ధండ (ఎంపీ యోధ)పై నెగ్గింది. స్కోరు 3–3తో సమమైన దశలో నిర్ణాయక పురుషుల 57 కేజీల విభాగంలో రవి 10–0తో సందీప్ తోమర్ (ఎంపీ యోధ)ను కంగుతినిపించడంతో లీగ్‌లో హ్యామర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.