haveli ghanapur
-
భర్తకు కరోనా: భయంతో ఉరేసుకున్న భార్య
మెదక్: మహమ్మారి కరోనా వైరస్ దేశంలో దారుణ పరిస్థితులకు దారి తీస్తోంది. వైరస్ ప్రజల వెన్నులో భయం పుట్టిస్తోంది. ఈ వైరస్ పేరు చెబితే ప్రజలందరూ భయపడుతున్నారు. ఈ భయంతోనే చాలా మంది ప్రజలు అనారోగ్యం చెందుతున్నారు. దీంతోపాటు అతిగా భయపడ్డవారు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ వివాహిత కరోనా భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తకు కరోనా సోకడంతో భయాందోళన చెందిన ఆమె తన ప్రాణాలను తీసుకుంది. హవేలి ఘనపూర్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (36) భర్తకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. భర్తకు కరోనా రావడంతో ఆమె కలత చెందింది. తనకు ఎక్కడ వ్యాపిస్తోందనే భయం ఆమెలో పట్టుకుంది. దాంతోపాటు తన భర్త, కుటుంబసభ్యులకు కూడా సోకుతుందనే ఆందోళనతో కంగారుపడింది. ఇదే కలతతో గురువారం లక్ష్మి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఒకవైపు ఆమె భర్త కరోనా సోకి చికిత్స పొందుతుండగా ఇటువైపు భార్య మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. చదవండి: శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు చదవండి: కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం -
ఏటేటా పెరుగుతున్న శివలింగం
హవేళిఘణాపూర్(మెదక్) : శివోహం.. శివాలయం.. ఏటేటా పెరుగుతున్న శివలింగం.. భక్తులకు కొంగుబంగారం శ్రీ సిద్ధేశ్వర దేవాలయం. మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం ముత్తాయికోట గ్రామ శివారులో పచ్చటి పంటపొలాల మధ్య కొలువుదీరాడు శ్రీ సిద్ధేశ్వర స్వామి. మెదక్ పట్టణంలో 16–17 శతాబ్ధంలో నాలుగు అడుగుల లోతులో వంద స్తంభాల ప్రాచీన దేవాలయం ఉండేది. అప్పట్లో సిద్ధులు సంచరించేవారని, అందులో ముగ్గురు సిద్ధులు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర. నిజాం కాలంలో హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న సమయంలో శివుడు జంగమ సిద్ధు రూపంలో ఓ అర్చకుడికి కలలోకి వచ్చి లింగాన్ని ధ్వంసం చేయబోతున్నారని, ఆ లింగాన్ని ఉత్తర దిక్కు తీసుకెళ్లు అని చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో ఓ ఎడ్లబండిలో శివలింగాన్ని తీసుకెళ్తున్న క్రమంలో ముత్తాయికోట గ్రామ శివారులోని ఎడ్లబండి ఇరుసు విరిగిపోయింది. దీంతో ఆ బ్రహ్మణుడు శివలింగాన్ని అక్కడే ఉన్న పొల్లాలో భద్ర పర్చాడు. కొన్నేళ్ల తరువాత ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఎల్లదాస్మహారాజ్కు కలలో శివుడు కనిపించి నా ప్రతిరూపం పొలాల్లో ఉంది, దాని వద్దకు వెళ్లు అనగానే ఎల్లదాస్ మహారాజ్ మెదక్‌కు చేరుకున్నాడు. ముత్తాయికోట గ్రామ శివారులో మహిమగల శివలింగాన్ని వెతికి, అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి శివలింగానికి పూజలు, అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు ఎల్లదాస్ నిత్యం చేసేవాడు. అనంతరం చందాలు పొగుచేసి ముత్తాయికోట శివారులో శ్రీ సిద్ధేశ్వర ఆలయాన్ని సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ఎల్లదాస్ కుటుంబీకులు అక్కడే ఓ కుటీరం ఏర్పాటు చేసుకొని ఎల్లదాస్ సిద్ధేశ్వర భజనమాల అనే గ్రంథం రచించారు. ఆలయంలో కొలువుదీరిన దేవతలు శ్రీ సిద్ధేశ్వర మహాదేవాలయంలో ఆశ్వంత వృక్షం వద్ద నాగదేవత ఉంది. అక్కడే పూజలు చేస్తే సంతానం, నాగదోషంతో పాటు సర్వ దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో పార్వతీదేవి అమ్మవారు, కాలభైరవ స్వామి, దత్తాత్రేయ స్వామి, నంది, నవగ్రహాలు, సంతోషీమాత, ఆంజనేయస్వామి దేవాలయం, కోనేరు(గుండం)తో పాటు ఎల్లదాస్ సమాధి సైతం ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఇతర జిల్లాల నుంచి భక్తుల తాకిడి మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం ముత్తాయికోట గ్రామ శివారులో వెలసిన శ్రీ సిద్ధేశ్వర దేవాలయానికి నిజామాబాద్, ఎల్లారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కాగా మహాశివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ప్రతి సోమవారం శివుడి(లింగం)కి రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, అన్నపూజలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేస్తాను మా కుటుంబ సభ్యులందరం ప్రతి సోమవారం ముత్తాయికోటలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి వస్తాం. ఉదయం ఆరు గంటలకే శ్రీ సిద్ధేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేయిస్తాం. ఆలయ అభివృద్ధికి మావంతు సహాయసహకారాలు అందజేస్తున్నాం. – ధర్మారం సుజాత, మెదక్ పట్టణం దాతలు ముందుకు రావాలి ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. దాతల సహాయ సహాకారాలతో నిత్యం పూజలు నిర్వహిస్తున్నాను. ఎంతోమంది భక్తులు స్వచ్ఛంధంగా స్వామి వారి సేవలో పాల్గొంటున్నారు. – గోవింద్ మహారాజ్, ఆలయ పూజారి -
సుల్తాన్పూర్ తండాలో ఘోర అగ్ని ప్రమాదం
హవేళిఘణాపూర్(మెదక్) : పశువుల కొట్టం దగ్ధమై రూ. 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు బాధితుడు, ఆర్ఐ శ్రీహరి కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని నాగాపూర్ పంచాయతీ పరిధి సుల్తాన్పూర్ తండాకు చెందిన గుగులోత్ లచ్చిరాం పశువుల కొట్టానికి సాయంత్రం మంటలంటుకున్నాయి. ఈ విషయం గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే మెదక్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే సరికి 28 మేకలు, 22 గొర్లు, 300 గడ్డిమోపులు, రెండు బోరుమోటార్లు, రెండు ఎడ్ల బండ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ తాహేర్ ఆలీ, రాములు, ఆర్ఐ శ్రీహరి, వీఆర్ఓ పద్మారావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్ఐ శ్రీహరి పంచనామా చేసి రూ. 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. -
బైక్‌లు ఢీ: యువకుడి దుర్మరణం
హవేళిఘణాపూర్‌లో ఘటన యువకుడికి నాలుగు నెలల క్రితమే పెళ్లి గిరిజన తండాలో విషాదం మెదక్: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన మెదక్ మండలం హవేళిఘణాపూర్ గిరిజన తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు...మెదక్ రూరల్‌పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేట మండలం బచ్చురాజ్‌పల్లి గిరిజన తండాకు చెందిన లంబాడి తరుణ్(మోను) (22)కు నాలుగు నెలల క్రితం హవేళిఘణాపూర్ గిరిజన తండాకు చెందిన లంబాడి కవితతో పెళ్లి జరిగింది. భార్య తన తల్లిగారింటికి వచ్చింది. దీంతో తరుణ్ తన భార్య దగ్గరికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో.. ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొంది. తరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బైక్‌పై ఉన్న తారాసింగ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పందిళ్లు ఇంకా తీయనేలేదు.. అంతలోనే.. మృతి చెందిన లంబాడి తరుణ్(22)కు 4నెలల క్రితమే పెళ్లి జరిగింది. అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. పెళ్లికూతురు ఇంటిముందు వేసిన తోరణాలు, పందిళ్లు కూడా తీయకుండానే ఈ ఘోరం జరగడంతో భార్య కవిత కన్నీటి పర్యంతమైంది. -
డైట్ కళాశాలలో సిబ్బంది కొరత
31మందికి గానూ ముగ్గురే బోధకులు పట్టించుకోని ఉన్నతాధికారులు గాడితప్పుతున్న విద్యావ్యవస్థ మెదక్:జిల్లాలో ఏకైక ప్రభుత్వ విద్యా శిక్షణ కేంద్రం(డైట్)లో సిబ్బంది కొరత నెలకొంది. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులను తయారుచేసే డైట్ కళాశాలలో సిబ్బంది కొరత ఉండటంతో విద్యా వ్యవస్థే గాడితప్పుతోంది. యేళ్లతరబడి ఇదే తంతు కొనసాగుతున్నా.. పాలకులుగాని, ఉన్నతాధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మెదక్ మండలం హవేళి ఘణాపూర్ శివారులో సుమారు పాతికేళ్ల క్రితం డైట్ కళాశాలను ఏర్పాటుచేశారు. ఈ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులు రెండేళ్లపాటు శిక్షణ పొందుతారు. ఇందులో తెలుగు, ఉర్దూ మీడియాలు కొనసాగుతున్నాయి. 300 ఛాత్రోపాధ్యాయులు శిక్షణ పొందే ఈ కళాశాలలో ప్రిన్సిపల్‌తోపాటు 30మంది లెక్చరర్లు ఉండాలి. కాని చాలా కాలంగా కేవలం ఇద్దరు లెక్చరర్లు, ఇన్చార్జ్ ప్రిన్సిపల్‌తోపాటు మొత్తం ముగ్గురే ఉన్నారు. మరో 28మంది లెక్చరర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ స్పందించి ఐదుగురు లెక్చరర్లను డిప్యుటేషన్‌పై పంపించారు. ఇందులో తెలుగు మీడియానికి సంబంధించి మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి 20 సబ్జెక్ట్‌లుంటాయి. ఉర్దూ మీడియంలోనూ 20 సబ్జెక్ట్‌లుంటాయి. మొత్తం 40 సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈయేడు గోటిచుట్టపై రోకటి పోటుల సిలబస్ సైతం మారిందని, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారిన సిలబస్‌ను సిబ్బంది ప్రతిరోజూ విద్యార్థుల మాదిరిగా ప్రిపెరేషన్ అయి ఛాత్రోపాధ్యాయులకు బోధించాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న ఒకైక డైట్ కళాశాలలో 28మంది సిబ్బంది కొరత ఉండటం వల్ల ఉన్న సిబ్బంది ఎవరికి ఏ సబ్జెక్ట్ బోధించాలో అర్థంకాక తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో ఛాత్రోపాధ్యాయులు తమకు బోధకులను కేటాయించాలని ఆందోళనలు చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థులే వారికి వారుగా స్వతహాగా ప్రిపరేషన్ అవుతున్నారు. కొంతమంది చురుకైన విద్యార్థులు లెక్చరర్లుగా అవతారమెత్తి తోటి విద్యార్థులకు బోధిస్తున్నారు. అంతేకాకుండా 300మంది ఛాత్రోపాధ్యాయులున్న ఈ డైట్ కళాశాలలో కనీసం టాయిలెట్లు లేకపోవడం దురదృష్టకరం. తోటి ఛాత్రోపాధ్యాయులకు బోధిస్తున్నా: తాను డైట్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నా. ప్రిన్సిపాల్ సూచన మేరకు తోటి ఛాత్రోపాధ్యాయులకు కొన్ని సబ్జెక్ట్‌లు బోధిస్తున్నా. మాకు సరిపడా బోధకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. అలాగే కళాశాలలో టాయిలెట్లు కూడా లేక చెట్లు, పుట్టల వెంట వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. -మమత, రెండో సంవత్సరం, డైట్ కళాశాల సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది: డైట్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 31మంది ఉండాలి. కొంతకాలంగా కేవలం ముగ్గురం మాత్రమే ఉన్నాం. ఈ విషయాన్ని ఎంతోమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఇటీవల ఐదుగురు లెక్చరర్లను డిప్యుటేషన్‌పై పంపించారు. మరో పది మందిని డిప్యుటేషన్‌పై పంపిస్తే ఎలాంటి ఆటంకంలేకుండా బోధన సాగుతుంది. సిలబస్ మారడంతో మరింత ఇబ్బందిగా మారింది. -రమేష్‌బాబు, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, డైట్ కళాశాల ఫోటోరైటప్: 19ఎండికె02: మెదక్డైట్ కళాశాల. 19ఎండికె02ఏ: మమత. 19ఎండికె02బి: రమేష్‌బాబు.