తరుణ్ మృతదేహం
- హవేళిఘణాపూర్‌లో ఘటన
- యువకుడికి నాలుగు నెలల క్రితమే పెళ్లి
- గిరిజన తండాలో విషాదం
మెదక్: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన మెదక్ మండలం హవేళిఘణాపూర్ గిరిజన తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు...మెదక్ రూరల్‌పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రామాయంపేట మండలం బచ్చురాజ్‌పల్లి గిరిజన తండాకు చెందిన లంబాడి తరుణ్(మోను) (22)కు నాలుగు నెలల క్రితం హవేళిఘణాపూర్ గిరిజన తండాకు చెందిన లంబాడి కవితతో పెళ్లి జరిగింది. భార్య తన తల్లిగారింటికి వచ్చింది. దీంతో తరుణ్ తన భార్య దగ్గరికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో.. ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీకొంది.
తరుణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బైక్‌పై ఉన్న తారాసింగ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పందిళ్లు ఇంకా తీయనేలేదు.. అంతలోనే..
మృతి చెందిన లంబాడి తరుణ్(22)కు 4నెలల క్రితమే పెళ్లి జరిగింది. అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. పెళ్లికూతురు ఇంటిముందు వేసిన తోరణాలు, పందిళ్లు కూడా తీయకుండానే ఈ ఘోరం జరగడంతో భార్య కవిత కన్నీటి పర్యంతమైంది.