డైట్‌ కళాశాలలో సిబ్బంది కొరత | Diet college staff shortage | Sakshi
Sakshi News home page

డైట్‌ కళాశాలలో సిబ్బంది కొరత

Published Fri, Aug 19 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

డైట్‌ కళాశాలలో సిబ్బంది కొరత

డైట్‌ కళాశాలలో సిబ్బంది కొరత

  • 31మందికి గానూ ముగ్గురే బోధకులు
  • పట్టించుకోని ఉన్నతాధికారులు
  • గాడితప్పుతున్న విద్యావ్యవస్థ
  • మెదక్‌:జిల్లాలో ఏకైక ప్రభుత్వ విద్యా శిక్షణ కేంద్రం(డైట్‌)లో సిబ్బంది కొరత నెలకొంది. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులను తయారుచేసే డైట్‌ కళాశాలలో సిబ్బంది కొరత ఉండటంతో విద్యా వ్యవస్థే గాడితప్పుతోంది. యేళ్లతరబడి ఇదే తంతు కొనసాగుతున్నా.. పాలకులుగాని, ఉన్నతాధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మెదక్‌ మండలం హవేళి ఘణాపూర్‌ శివారులో సుమారు పాతికేళ్ల క్రితం డైట్‌ కళాశాలను ఏర్పాటుచేశారు. ఈ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులు రెండేళ్లపాటు శిక్షణ పొందుతారు.

    ఇందులో తెలుగు, ఉర్దూ మీడియాలు కొనసాగుతున్నాయి. 300 ఛాత్రోపాధ్యాయులు శిక్షణ పొందే ఈ కళాశాలలో ప్రిన్సిపల్‌తోపాటు 30మంది లెక్చరర్లు ఉండాలి. కాని చాలా కాలంగా  కేవలం ఇద్దరు లెక్చరర్లు,  ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌తోపాటు మొత్తం ముగ్గురే ఉన్నారు. మరో 28మంది లెక్చరర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్‌ స్పందించి ఐదుగురు లెక్చరర్లను డిప్యుటేషన్‌పై పంపించారు. ఇందులో తెలుగు మీడియానికి సంబంధించి మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి 20 సబ్జెక్ట్‌లుంటాయి.

    ఉర్దూ మీడియంలోనూ 20 సబ్జెక్ట్‌లుంటాయి. మొత్తం 40 సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈయేడు గోటిచుట్టపై రోకటి పోటుల  సిలబస్‌ సైతం మారిందని, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారిన సిలబస్‌ను సిబ్బంది ప్రతిరోజూ విద్యార్థుల మాదిరిగా  ప్రిపెరేషన్‌ అయి ఛాత్రోపాధ్యాయులకు బోధించాల్సి ఉంటుంది.

    జిల్లాలో ఉన్న ఒకైక డైట్‌ కళాశాలలో 28మంది సిబ్బంది కొరత ఉండటం వల్ల ఉన్న సిబ్బంది ఎవరికి ఏ సబ్జెక్ట్‌ బోధించాలో అర్థంకాక తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో ఛాత్రోపాధ్యాయులు తమకు బోధకులను కేటాయించాలని ఆందోళనలు చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థులే వారికి వారుగా స్వతహాగా ప్రిపరేషన్‌ అవుతున్నారు. కొంతమంది  చురుకైన  విద్యార్థులు లెక్చరర్లుగా అవతారమెత్తి తోటి విద్యార్థులకు బోధిస్తున్నారు. అంతేకాకుండా 300మంది ఛాత్రోపాధ్యాయులున్న ఈ డైట్‌ కళాశాలలో కనీసం టాయిలెట్లు లేకపోవడం దురదృష్టకరం.

    తోటి ఛాత్రోపాధ్యాయులకు బోధిస్తున్నా:
    తాను డైట్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నా. ప్రిన్సిపాల్‌ సూచన మేరకు తోటి ఛాత్రోపాధ్యాయులకు కొన్ని సబ్జెక్ట్‌లు బోధిస్తున్నా. మాకు సరిపడా బోధకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. అలాగే కళాశాలలో టాయిలెట్లు కూడా లేక చెట్లు, పుట్టల వెంట వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.
    -మమత, రెండో సంవత్సరం, డైట్‌ కళాశాల

    సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది:
    డైట్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 31మంది ఉండాలి.  కొంతకాలంగా కేవలం ముగ్గురం మాత్రమే ఉన్నాం. ఈ విషయాన్ని ఎంతోమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్‌ ఇటీవల ఐదుగురు లెక్చరర్లను డిప్యుటేషన్‌పై పంపించారు. మరో పది మందిని డిప్యుటేషన్‌పై పంపిస్తే ఎలాంటి ఆటంకంలేకుండా బోధన సాగుతుంది. సిలబస్‌ మారడంతో మరింత ఇబ్బందిగా మారింది.
    -రమేష్‌బాబు, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్, డైట్‌ కళాశాల

    ఫోటోరైటప్‌:
    19ఎండికె02: మెదక్‌డైట్‌ కళాశాల.
    19ఎండికె02ఏ: మమత.
    19ఎండికె02బి: రమేష్‌బాబు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement