Havels India
-
హావెల్స్ అత్యాధునిక వాటర్ ప్యూరిఫయర్లు
విశాఖపట్నం: ఎలక్ట్రికల్ ఉపకరణాల రంగంలోని ప్రముఖ కంపెనీ హావెల్స్ తొలిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నీటి శుద్ధి పరికరాలను (వాటర్ ప్యూరిఫయర్) మార్కెట్లోకి విడుదల చేసింది. నీటిలోని పీహెచ్ సమతుల్యతను కాపాడుతూనే రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో) విధానంలో కోల్పోయిన ఖనిజాలను తిరిగి చేర్చే సామర్థ్యం ఈ పరికరాలకు ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఉత్పత్తులను విశాఖ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా హావెల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శశాంక్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ... క్రిమిసంహారకాలు, పారిశ్రామిక కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించే విధంగా వీటిని రూపొందించినట్టు చెప్పారు. నీటి నాణ్యతను వాటంతట అవే గుర్తించి సురక్షిత, ఆరోగ్యకరమైన నీటిని అందిస్తాయని చెప్పారు. వీటి ధరలు రూ.10,499 నుంచి రూ.23,999 మధ్య ఉంటాయని, రానున్న 3–4 ఏళ్లలో వాటర్ ప్యూరిఫయర్ మార్కెట్లో 10 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
తొలి ఏడాది రూ.100 కోట్ల లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హావెల్స్ ఇండియా వాటర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. మంగళవారమిక్కడ డిజిటచ్, డిజిప్లస్, యూటీఎస్, మ్యాక్స్, ప్రో, యూవీ ప్లస్ పేరిట ఆరు నూతన శ్రేణి వాటర్ ప్యూరిఫయర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా హవెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏటా హావెల్స్ విస్తరణ పెట్టుబడుల్లో భాగంగా వాటర్ ప్యూరిఫయర్ల తయారీ, మిషనరీ ఇతరత్రా వాటికి రూ.100 నుంచి 150 కోట్ల మధ్య ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. 95 శాతం ప్యూరిఫయర్ల తయారీ హరిద్వార్ ప్లాంట్‌లోనే జరుగుతుంది. ప్లాంట్ సామర్థ్యం ఏటా 5 లక్షల యూనిట్లు’’ అని వివరించారు. ప్రస్తుతం దేశంలో వాటర్ ప్యూరిఫయర్ల పరిశ్రమ రూ.5,800 కోట్లుగా ఉందని. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా రూ.3,500 కోట్లుగా ఉంటుందని తెలియజేశారు. ‘‘ఇప్పటివరకు ఉత్తరాదిలోని 7 రాష్ట్రాలు, 19 నగరాల్లో వెయ్యికి పైగా ప్యూరిఫయర్లను విక్రయించాం. తొలి ఏడాది రూ.100 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఐదేళ్లలో రూ.500 కోట్లకు పైనే సాధిస్తాం’’ అని తెలియజేశారు. ఆయా ఉత్పత్తుల ధరలు రూ.10,499–23,999 మధ్య ఉన్నాయి. -
స్టాక్స్ వ్యూ
గ్రీన్‌ఫ్లై ఇండస్ట్రీస్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 334 టార్గెట్ ధర: రూ.380 ఎందుకంటే: దేశీయ ఫ్లైవుడ్, వినీర్స్ మార్కెట్లో అతి పెద్ద కంపెనీ అయిన గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.750 కోట్ల పెట్టుబడితో ఎండీఎఫ్(మీడియమ్ డెన్సిటీ ఫైబర్‌బోర్డ్) ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌తో దక్షిణ భారత దేశ డిమాండ్‌ను తీర్చవచ్చని భావిస్తున్న ఈ కొత్త ప్లాంట్ కారణంగా ఎండీఎఫ్ విభాగం ఆదాయం మూడేళ్లలో 34 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఇక ప్లైవుడ్ విభాగం ఆదాయం రెండేళ్లలో 12–15 శాతం చొప్పున చక్రగతి వృద్ధి చెందనున్నాదని భావిస్తున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ–వే బిల్లు విధానం అమల్లోకి రానున్నది. ఫలితంగా మార్కెట్ వాటా అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగానికి తరలనున్నది. ఇది సంఘటిత రంగంలోని గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్ వంటి కంపెనీలకు ప్రయోజనకరం. మొత్తం మీద మూడేళ్లలో కంపెనీ ఆదాయం 20 శాతం, నికర లాభం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలవని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లోని ఎండీఎఫ్ ప్లాంట్ వచ్చే ఏడాది జూలై కల్లా అందుబాటులోకి రానునుండడం, జీఎస్టీ అమలు కారణంగా రెండేళ్లలో ప్లైఉడ్ విభాగం అమ్మకాలు 12–15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలు, ఉత్తర ప్రదేశ్‌లోని కొత్త ప్లైఉడ్ ప్లాంట్, గుజరాత్‌లోని డెకరేటివ్ వినీర్ యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరం క్యూ3 కల్లా అందుబాటులోకి రానుండడం, జీఎస్టీ రేట్లు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం....ఇవన్నీ సానుకూలాంశాలు. పోటీ తీవ్రంగా ఉండడం, భవిష్యత్తులో ధరలు తగ్గించే అవకాశాలుండడం వంటి కారణాల వల్ల ఎండీఎఫ్ విభాగం ఇబిటా మార్జిన్లు ఒకింత తగ్గవచ్చు. 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్ ధరకు 20 రెట్ల ధరను టార్గెట్ ధర, రూ.380గా నిర్ణయించాం. హావెల్స్ ఇండియా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 536 టార్గెట్ ధర: రూ.590 ఎందుకంటే: కొత్త కొత్త కేటగిరీల్లో ఉత్పత్తులను అందించడం ద్వారా వృద్ధి జోరును కొనసాగిస్తోంది. 2003లో లైటింగ్స్, 2005లో ప్రీమియమ్ ఫ్యాన్స్, 2010లో వాటర్ హీటర్స్, 2014లో ఎయిర్ కూలర్స్.. ఇలా కొత్త కొత్త కేటగిరీ ఉత్పత్తులను అందిస్తూ మంచి వృద్ధిని సాధిస్తోంది. ఇటీవల లాయిడ్ ఎలక్ట్రిక్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. దీంతో టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి వినియోగదారుల వస్తువుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తోంది. కొన్ని ఎలక్ట్రికల్ ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో కంపెనీ మార్కెట్ వాటా పెరిగే అవకాశాలున్నాయి. వినియోగ వస్తువులపై కూడా పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాల కారణంగా రానున్న సీజన్లో లాయిడ్స్ ఏసీ అమ్మకాలు పుంజుకోగలవని, జీఎస్టీ రేటు తగ్గింపు ప్రభావం సానుకూల ప్రభావం చూపగలదని భావిస్తున్నాం. ఎల్ఈడీ బల్బులు, ఫ్యాన్లను సబ్సిడీ ధరలకు అందించిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్(ఈఈఎస్ఎల్) ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ మీటర్లు, సోలార్ రూఫ్‌టాప్స్‌పై తన దృష్టిని కేంద్రీకరించడంతో ఎల్ఈడీ బల్బుల ధరలు స్థిరీకరణ చెందుతున్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా కుదేలైన ఇబిటా మార్జిన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేబుల్స్, వైర్లు, స్విచ్‌ల విభాగాల్లో మార్కెట్ వాటా మరింతగా పెరగగలదని భావిస్తున్నాం. మూడేళ్లలో కంపెనీ ఈపీఎస్ 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 22 శాతంగా ఉండగలదని భావిస్తున్నాం. వినియోగవస్తువుల మార్కెట్లో కొత్త కంపెనీల ప్రవేశం కారణంగా పోటీ తీవ్రత పెరిగే అవకాశం, ముడి పదార్థాల ధరలు పెరిగే అవకాశాలు.. ప్రతికూలాంశాలు. -
రూ.1,000 కోట్ల వ్యాపార లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హావెల్స్ బ్రాండ్లలో ఒకటైన స్టాండర్డ్ తాజాగా వాటర్ హీటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. జో అండ్ జో ప్రైమ్, అమియో, అమేజర్, లిఫ్ట్ పేరిట 5 నూతన శ్రేణి ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లతో పాటూ స్వీచ్‌లు, ఎంసీబీలనూ విపణిలోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హావెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అబ్ర బెనర్జీ మాట్లాడుతూ.. వీటిని రాజస్థాన్‌లోని నిమ్రానా ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని.. త్వరలోనే ఐంటర్నెట్ ఆధారిత (ఐఓటీ) వాటర్ హీటర్లనూ విడుదల చేస్తామని చెప్పారు. లీటరు నుంచి 25 లీటర్ల సామర్థ్యం గల వీటి ధరలు రూ.3,500 నుంచి రూ.14 వేల వరకూ ఉన్నాయి. ‘‘ప్రస్తుతం స్టాండర్డ్ బ్రాండ్ కింద ఫ్యాన్లు, ఎంసీబీ, ఆర్సీసీబీలు, డిస్ట్రిబ్యూషన్ బోర్డులు, ఏసీబీలు, ఎంసీసీబీలు, స్విచ్‌లు, కేబుల్స్ ఉత్పత్తులున్నాయి. వచ్చే ఏడాది కాలంలో మరో 3–4 కొత్త విభాగాల్లోకి కూడా రానున్నాం’’ అని చెప్పారాయన. జో పేరిట కంపెనీ నూతన శ్రేణి స్విచ్‌లను కూడా విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.38. దేశంలో స్విచ్ గేర్ల విపణి రూ.3 వేల కోట్లు. హావెల్స్ క్యాప్ట్రీ, స్టాండర్డ్ అనే మూడు బ్రాండ్ల కింద స్విచ్ గేర్లను విక్రయిస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్విచ్ గేర్ల వ్యాపారంలో రూ.500 కోట్ల వ్యాపారాన్ని చేరుకుంది. ఆస్పిడా పేరిట నూతన శ్రేణి ఎంసీబీలనూ విడుదల చేసింది. వీటి ధరలు రూ.145 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో రూ.35 కోట్ల వ్యాపారం.. ‘‘హావెల్స్ బ్రాండ్లలో స్టాండర్డ్ ప్రధానమైంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్టాండర్డ్ రూ.400 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. వచ్చే 3 ఏళ్లలో రూ.1,000 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా రూ.35 కోట్లుగా ఉంటుంది. దేశంలో స్టాండర్డ్‌కు 2,500 మంది డీలర్లు, 35 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 125 డీలర్షిప్స్, 6 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం చివరికల్లా ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల సంఖ్యను 100కి పెంచుతాం’’ అని అబ్ర బెనర్జీ వివరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ పంకజ్ కే వాస్సాల్ పాల్గొన్నారు. -
లాయిడ్ కొనుగోలు కలిసొచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియాకు కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ లాయిడ్‌ను కొనుగోలు చేయటం బాగానే కలిసి వచ్చింది. ఎందుకంటే దాదాపు నాలుగు నెలల సమయంలో ఈ బ్రాండ్ ద్వారా రూ.267 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మున్ముందు ఈ బ్రాండ్ మరింత వృద్ధిని నమోదు చేస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. హావెల్స్, క్యాబ్ట్రీ, స్టాండర్డ్, సిల్వేనియా బ్రాండ్లతో గృహ, వాణిజ్య ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీలో ఉన్న హావెల్స్.. ఇటీవలే యూరోపియన్ బ్రాండ్ సిల్వేనియాను రూ.241.94 కోట్లకు చైనాకు చెందిన ఫైలో అకౌస్టిక్స్‌కు విక్రయించేసింది. కొత్త ఉత్పత్తులు, కొత్త ప్లాంటు వంటి రకరకాల వ్యూహాలతో ముందుకెళ్లు తున్న నేపథ్యంలో హావెల్స్ సీఎండీ అనిల్ రాయ్ గుప్తాను ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... లాయిడ్‌ను హావెల్స్‌లో కలిపేస్తారా.. లేక ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగిస్తారా? అలాంటిదేమీ లేదు. లాయిడ్‌ను ఈ ఏడాది మే 8న రూ.1,600 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకూ రూ.267 కోట్ల ఆదాయాన్ని దానిద్వారా ఆర్జించాం. ఆ బ్రాండ్, తయారీ ప్లాంట్, నెట్వర్క్, బృందం వంటివన్నిటినీ ఇప్పటికీ ప్రత్యేకంగానే కొనసాగిస్తున్నాం. విలీనం చేసే యోచన కూడా లేదు. ఏపీ, తెలంగాణల్లో మీ బ్రాండ్ల హవా ఎలా ఉంది? గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.380 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 20 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 600 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 38 హావెల్స్ గెలాక్సీ షోరూమ్‌లున్నాయి. త్వరలోనే మరో 10 షోరూమ్‌లు ప్రారంభిస్తాం. ఈ గెలాక్సీ షోరూమ్‌లో స్విచ్ గేర్ల నుంచి వాటర్ హీటర్ల దాకా హావెల్స్ ఉత్పత్తులన్నీ లభ్యమవుతాయి. ఈ మధ్య మీ మార్కెట్ వాటా ఏమైనా తగ్గుతోందా? కొత్త ఉత్పత్తులేమైనా తెస్తున్నారా? మార్కెట్ వాటా తగ్గటమనే ప్రసక్తే లేదు. ఏటా 20 శాతం వరకూ వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా వ్యాపార వృద్ధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చాలా కీలకం. సౌర విద్యుత్, స్మార్ట్ ఎలక్ట్రిక్ ఉపకరణాలకు ఈ రెండు రాష్ట్రాల్లో పుష్కలంగా డిమాండుంది. అందుకే ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులైన (ఐఓటీ) వాటర్ హీటర్లు, ఫ్యాన్లు ఇక్కడే లాంచ్ చేశాం. నవంబర్ తరవాత కేరళ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తాం. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా లాయిడ్ బ్రాండ్ కింద ఏసీ, టీవీ వంటి వాటిని విడుదల చేస్తూనే ఉంటాం. బెంగళూరు ప్లాంటు ఎంతవరకూ వచ్చింది? ఎప్పుడు సిద్ధమవుతుంది? ప్రస్తుతం మాకు దేశంలో 12 ప్లాంట్లున్నాయి. హరిద్వార్‌లో ఫ్యాన్లు, హిమాచల్‌లోని బడ్డిలో డొమెస్టిక్ స్విచ్గేర్లు, నోయిడాలో కెపాసిటర్లు, ఫరీదాబాద్, సాహిబాబాద్‌లో డిస్ట్రిబ్యూషన్ బోర్డులు, ఇండస్ట్రియల్ స్విచ్గేర్లు, అల్వార్‌లో కేబుల్స్, వైర్లు, గువాహటిలో స్విచ్గేర్లు, నిమ్రానాలో లైటింగ్స్, ఫిక్చర్స్, మోటార్స్, సీఎఫ్ఎల్, ఎల్ఈడీ, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు తయారవుతున్నాయి. హావెల్స్ ఉత్పత్తుల్లో 95 శాతం మేడిన్ ఇండియావే. దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్‌ను బలోపేతం చేసుకోవటానికే బెంగళూరులో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే తుముకూరులో 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. స్థలం, ప్లాంట్, మిషనరీ కోసం రూ.1,059 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ కేబుల్స్, వైర్లు, సోలార్ లైట్లు తయారవుతాయి. మున్ముందు మీ వ్యాపారాభివృద్ధి ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? గత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాం. 2017–18 తొలి త్రైమాసికంలో 9 శాతం వృద్ధితో రూ.1,593 కోట్ల స్టాండెలోన్ వ్యాపారాన్ని సాధించాం. గత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ.1,467 కోట్లు. 2020 నాటికి రూ.20 వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. మీకు అత్యధిక వ్యాపారం ఏ విభాగం నుంచి వస్తోంది? కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా ఎంత? హావెల్స్ ఆదాయంలో అత్యధికం కేబుల్స్దే. ఇది 39 శాతం. ఇక స్విచ్గేర్స్ 23 శాతం, లైటింగ్ – ఫిక్చర్స్ 16 శాతం వాటా అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా 22 శాతం. -
హావెల్స్ ఇండియా లాభం 74% డౌన్
► అంతర్జాతీయ వ్యాపారానికి గుడ్‌బై ► ఒక్కోషేర్‌కు రూ.3.5 డివిడెండ్ న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఉపకరణాల సంస్థ హావెల్స్ ఇండియా స్టాండ్ అలోన్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.95 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో సాధించిన నికర లాభం రూ.366 కోట్లతో పోలిస్తే 74 శాతం క్షీణించినట్లు లెక్క. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,598 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,873 కోట్లకు పెరిగింది. స్థూల లాభం రూ.219 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.234 కోట్లకు పెరిగినట్లు హావెల్స్ ఇండియా సీఎండీ అనిల్ రాయ్ గుప్తా చెప్పారు. అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి వైదొలగినందుకు గాను రూ.77 కోట్లు కేటాయింపులు జరిపామని వెల్లడించారు. మొత్తం వ్యయాలు రూ.1,379 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.1,640 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.3.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. తగ్గిన మార్జిన్లు: అన్ని సెగ్మెంట్లలో వృద్ది బాట పడుతున్నామని గుప్తా చెప్పారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దును తట్టుకోవడానికి డీలర్లకు ఇచ్చిన ప్రోత్సాహాకాలు, ముడి పదార్ధాల ధరలు పెరిగినప్పటికీ, ధరలు పెంచకపోవడంతో మార్జిన్లు తగ్గాయని తెలియజేశారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2015–16లో రూ.1,300 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం తగ్గి రూ.494 కోట్లకు పరిమితమయింది. మొత్తం ఆదాయం రూ.8,101 కోట్ల నుంచి 17 శాతం క్షీణించి రూ.6,751 కోట్లకు తగ్గింది. యూరోప్ లైటింగ్ బిజినెస్ సిల్వేనియాలో మిగిలిన 20 శాతం వాటాను చైనాకు చెందిన ఫీలో అకౌస్టిక్స్‌కు రూ.242 కోట్లకు విక్రయించనున్నామని, దీంతో అంతర్జాతీయ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగినట్లవుతుందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. చివరకు 2.5 శాతం లాభంతో రూ.514 వద్ద ముగిసింది. -
టర్నోవర్‌లో 3% ఆర్‌అండ్‌డీకి
అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తయారీ * హావెల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హావెల్స్ ఇండియా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీకై ఏటా టర్నోవర్‌లో 3 శాతం ఆర్అండ్డీపై వెచ్చిస్తోంది. నాణ్యతతోపాటు విద్యుత్‌ను తక్కువగా వినియోగించే ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్టు హావెల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిల్ శర్మ మంగళవారమిక్కడ తెలిపారు. నూతన శ్రేణి స్విచ్గేర్లను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నోయిడాలో కేంద్ర ఆర్అండ్డీ ఉంది. అలాగే చైనా, యూరప్‌లో మరో నాలుగు ప్రధాన ఆర్‌అండ్‌డీలు ఉన్నాయి. నోయిడా కేంద్రంలో 200 మంది నిపుణులు పనిచేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ప్రపంచస్థాయి ఉత్పత్తులను కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగా కంపెనీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది’ అని చెప్పారు. 2014-15లో హావెల్స్ రూ.8,500 కోట్ల టర్నోవర్ సాధించింది. నిర్మాణ రంగంలో కదలికతో.. దేశీయంగా కొన్నేళ్లుగా నిర్మాణ రంగం స్తబ్ధుగా ఉంది. వడ్డీ రేట్లు తగ్గుదల వల్ల ఈ రంగంలో కదలిక వస్తే బిల్డింగ్ ఎలక్ట్రికల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని హావెల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎ.వి.జగదీశ్ తెలిపారు. భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. హావెల్స్ గెలాక్సీ స్టోర్లు దేశవ్యాప్తంగా 330 ఉన్నాయి. డిసెంబర్‌కల్లా వీటి సంఖ్యను 400లకు చేరుస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏపీ, తెలంగాణలో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతమున్న 20 నుంచి 28కి పెరుగుతుందని వివరించారు. గెలాక్సీ స్టోర్ల ద్వారా సంస్థకు 2014-15లో రూ.750 కోట్లు సమకూరింది. ఇక ఏపీ, తెలంగాణ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ నమోదైందని హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ ఎ.వి.రావు తెలిపారు. -
హైదరాబాద్‌లో హావెల్స్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ల మీట్
హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హావెల్స్ ఇండియా ఇటీవల ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. హోటల్ తాజ్ వివంతాలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 50 మంది ప్రముఖ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు హాజరయ్యారని హావెల్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో హావెల్స్ తెలంగాణ బ్రాంచ్ హెడ్ ఎస్. మధుసూదన్ హావెల్స్ బ్రాండ్ విశిష్టతను వివరించారని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని హావెల్స్ ప్రాజెక్ట్ టీమ్‌కు చెందిన సుధాకర్ అంబటి నిర్వహించారు.