సిరియా పయనమెటు?
ఒకే ఒక్క వారం. కేవలం ఏడు రోజుల వ్యవధిలో సిరియాలో సర్వం మారిపోయింది. పాలకుడు బషర్ అల్ అసద్ కాడి పడేసి పారిపోయాడు. దేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిపోయింది. అసద్‌ల 50 ఏళ్ల నియంతృత్వ పాలనకు ఎట్టకేలకు తెర పడిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమైనా, రెబెల్స్ పాలనలో సిరియా మరో అఫ్గాన్‌గా మారొచ్చన్న అంచనాలు అంతర్జాతీయ సమాజంలో గుబులు రేపుతున్నాయి. కుట్రలు, అంతర్యుద్ధం తదితరాల పరిణామంగా 1970లో గద్దెనెక్కిన హఫీజ్ అల్ అసద్ నియంతృత్వ పోకడలకు మారుపేరుగా పాలించారు. 1982లో ఇస్లామిక్ ఫ్రంట్ సారథ్యంలో దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణిచేసే క్రమంలో ఏకంగా 40 వేల పై చిలుకు పౌరులను పొట్టన పెట్టుకున్నారు. 2000లో గద్దెనెక్కిన బషర్ నియంతృత్వ పోకడల్లోనూ, క్రూరత్వంలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. 2011 అరబ్ విప్లవాన్ని అణిచివేసేందుకు ఏకంగా 4 లక్షల పై చిలుకు మందిని బలి తీసుకున్నారు. ఆయన పాతికేళ్ల పాలనలో కనీసం 5 లక్షల మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డట్టు అంచనా. అంతటి రక్తసిక్త చరిత్రను వారసత్వంగా మిగిల్చి అవమానకర పరిస్థితుల్లో దేశం వీడి రష్యాలో తలదాచుకున్నారు. సాయుధ మిలిటెంట్ గ్రూప్ హయాత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) సారథి అబూ మొహ్మద్ అల్ జొలానీ అలియాస్ అహ్మద్ అల్ షరాకు సిరియా ప్రధాని మొహమ్మద్ గాజీ జలాలీ తాజాగా లాంఛనంగా అధికారాన్ని అప్పగించారు. దాంతో అసద్‌ల 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర పడ్డా సిరియా భవితవ్యం మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. హెచ్‌టీఎస్ సారథ్యంలో ఏర్పడబోయే సర్కారుకు ముళ్లబాటే స్వాగతం పలుకుతోంది. ఇప్పటికైతే మధ్యేమార్గమే! అసద్ ఇంత త్వరగా పారిపోతారని, దేశం తమ సొంతమవుతుందని నిజానికి హెచ్‌టీఎస్ కూడా ఊహించలేదు. దాంతో మిగతా మిలిటెంట్ గ్రూపులు, రాజకీయ పారీ్టలు తదితరాలతో చర్చలు జరపడం, వాటితో అధికార పంపిణీ క్రతువును సజావుగా పూర్తి చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దానికి సవాలుగా మారింది. దాంతోపాటు జొలానీ సారథ్యంలో కొలువుదీరబోయే హెచ్‌టీఎస్ సర్కారుకు అంతర్జాతీయ గుర్తింపు ఏ మేరకు దక్కుతుందనేది కూడా కీలకమే. ఈ విషయంలో కీలక పొరుగు దేశమైన తుర్కియేతో పాటు యూరోపియన్ యూనియన్, అమెరికాలది కీలక పాత్ర కానుంది. హెచ్‌టీఎస్ మూలాలు అల్‌ఖైదాతో ముడిపడి ఉండటం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేలా కని్పస్తోంది. పూర్తి ప్రజాస్వామిక పాలనపై ఎవరికీ ఆశలు లేకపోయినా, అతివాద పోకడలకు హెచ్‌టీఎస్ తాత్కాలికంగానైనా దూరంగా ఉండాల్సి రావచ్చు. అంతేగాక కుర్ది‹Ùల స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సమాజం విధించే పలు షరతులకు కట్టుబడాల్సిన పరిస్థితి తలెత్తేలా కని్పస్తోంది. ఈ దిశగా జొలానీ ఇప్పటికే పలు సంకేతాలైతే ఇచ్చారు. విపక్షాల పట్ల సహయంతో వ్యవహరిస్తామని సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మతపరమైన మైనారిటీల హక్కులకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మాదిరిగా మహిళల వస్త్రధారణపై ఆంక్షల వంటి వాటి జోలికి పోబోమని సోమవారం ఆయన కుండబద్దలు కొట్టారు కూడా. అయితే శరణార్థులుగా దేశాలు పట్టుకుని పోయిన సిరియన్ల తిరిగి రాక మరో పెద్ద అంశం కానుంది. అంతర్గత కల్లోలం నేపథ్యంలో కొన్నేళ్లుగా భారీగా దేశం వీడిన సిరియన్లంతా తిరిగొస్తున్నారు. వారందరికీ ఆశ్రయంతో పాటు ఉపాధి కల్పన సవాలు కానుంది. వీటికి తోడు పలు ప్రాంతాలను ఆక్రమించుకుని గుప్పెట్లో పెట్టుకున్న చిన్నాచితకా మిలిటెంట్ గ్రూపులతో కొత్త ప్రభుత్వం నెట్టుకొస్తుందనేది ఆసక్తికరం.స్థిరత్వం నెలకొనాలి: భారత్న్యూఢిల్లీ/మాస్కో/జెరూసలేం: సిరియాలో వీలైనంత త్వరగా స్థిరత్వం నెలకొంటుందని భారత్ ఆశాభావం వెలిబుచి్చంది. సిరియాలోని భారతీయుల క్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. సిరియాలో అధికార మార్పును ఈయూతో పాటు అమెరికా తదితర దేశాలు స్వాగతించాయి.అసద్‌కు ఆశ్రయమిచ్చాం: రష్యాఅసద్కు రాజకీయ ఆశ్రయం కలి్పంచినట్టు రష్యా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాలో ఆయన ఎక్కడ తలదాచుకున్నదీ వెల్లడించలేదు.ఇజ్రాయెల్ వైమానిక దాడులుసిరియాలో పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సోమ వారం భారీ వైమానిక దాడులకు దిగింది. దీర్ఘశ్రేణి రాకెట్లు, రసాయనిక ఆయుధాలు రెబెల్స్ చేతిలో పడకుండా వాటిని ధ్వంసం చేసేందుకే దాడులు చేసినట్టు ప్రకటించింది. అమెరికా కూడా సిరియా లో 75 ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్