hazards
-
భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రత్యేక దృష్టి సారించాయి. విద్యుత్ భద్రతపై ఇప్పటికే అనేక సూచనలను ప్రజలకు ఇచ్చినప్పటికీ ఇంకా అక్కడక్కడా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా కొంతమంది విద్యుత్ సిబ్బందితోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగిన తరువాత సమీక్షించుకోవడం కాకుండా వాటిని అరికట్టేందుకు పటిష్ట చర్యల్ని అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి. వినియోగదారులకు ప్రత్యేకంగా భద్రతా సూచనల్ని రూపొందించాయి. భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల యజమానులు, రైతు కూలీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనలను రూపొందించాయి. వీటిని అందరికీ తెలియజేసేందుకు ‘భద్రతా అవగాహనా రథం’ పేరుతో ప్రత్యేక ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్నాయి. విద్యుత్ సిబ్బందికీ జాగ్రత్తలు లైన్ క్లియర్ (ఎల్సీ) సరిగ్గా లేకుండా ఏ లైన్ మీద పని చేయరాదు. సమీపంలో వేరే లైన్ ఉంటే దానికి కూడా ఎల్సీ తీసుకోవాలి. విద్యుత్ లైన్ల నిర్వహణ, బ్రేక్ డౌన్ ఆపరేషన్స్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ చేసే సమయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్, రబ్బర్ గ్లవ్స్, గమ్ బూట్స్, సేఫ్టీ బెల్ట్స్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలి. అలాగే ఒక్కరే ఎప్పుడూ వెళ్లకూడదు. వేరొకరిని తోడు తీసుకువెళ్లాలి. పంట పొలాలకు అనధికార విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. అటువంటివి లేకుండా సిబ్బంది తరచూ తనిఖీలు చేపట్టాలి. సబ్ స్టేషన్ ఆవరణలో గొడుగు వేసుకుని వెళ్లకూడదు. కడ్డీలు, తీగలు వంటివి తగిన జాగ్రత్తలు లేకుండా తీసుకుపోకూడదు. కొత్త సర్విస్ ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు విద్యుత్ లైన్ కింద ప్రమాదకరంగా ఉంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 48, క్లాజ్ 63 ఆఫ్ రెగ్యులేషన్స్ 2010 ప్రకారం సర్వీసును తిరస్కరించి లైన్ షిఫ్ట్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు ఇవీ సూచనలు విద్యుత్ లైన్లు కింద ఎటువంటి నిర్మాణాలు చేయరాదు. విద్యుత్ స్తంభానికి సమీపంలో లేదా స్తంభానికి ఆనుకుని ఇల్లు, ఎలివేషన్, డూములు, మెట్లు నిర్మాణం చేయకూడదు. ఇనుప చువ్వలు, లోహ పరికరాలు విద్యుత్ లైన్లు కింద తప్పనిసరి పరిస్థితులలో ఎత్తినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జేసీబీలు, క్రేన్లు ఉపయోగించేటప్పుడు, బోర్లు డ్రిల్ చేస్తున్నప్పుడు వాటి లోహపు తొట్టెలు, పైపులు విద్యుత్ లైన్లకు తగిలి ప్రాణాపాయం సంభవించవచ్చు. ధాన్యం, ప్రత్తి, గడ్డి, ఊక, కొబ్బరి చిప్పలు, కలప వంటి వాహనాలు అధిక లోడుతో విద్యుత్ లైన్లు కింద వెళ్లడం ప్రమాదకరం. సామాన్య ప్రజలకూ హెచ్చరికలు విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే లైన్ల కింద చెట్టు కొమ్మలు తొలగించాలి. తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను తాకకూడదు. ఇల్లు, షాపు మీటర్‌కి పోల్ నుంచి తీసుకొనే సర్విస్ వైరుకి ఎటువంటి అతుకులు లేకుండా చూసుకోవాలి. సర్వీస్ వైరుకి సపోర్ట్ వైరుగా రబ్బరు తొడుగు గల జీఐ తీగలను వాడాలి. ఇంటి ఆవరణలో ఎర్తింగ్ తప్పనిసరి. డాబాల మీద విద్యుత్ లైన్లకి దగ్గరగా బట్టలు ఆరవేయరాదు. తడి బట్టలతో, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు. వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాన్ని,సపోర్ట్ వైర్లను ముట్టుకోకూడదు. అనధికారంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు వేయడం చట్టవిరుద్ధమే కాదు ప్రాణాలకు ప్రమాదం. అధిక సామర్థ్యం గల ఫ్యూజు వైర్లను వాడరాదు. వాటివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి గృహోపకరణాలు కాలిపోతాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పక్కన, విద్యుత్ లైన్లు క్రింద తోపుడు బండ్లు, బడ్డీలు పెట్టడం ప్రమాదకరం. ప్రచార రథాన్ని అందుబాటులోకి తెచ్చాం ఏపీ ఈపీడీసీఎల్ ముందుగా ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. భద్రత సూచనలకు సంబంధించిన ఆడియోలను తయారుచేసి సంస్థ పరిధిలోని అన్ని సెక్షన్ కార్యాలయాలకు ఇప్పటికే పంపించాం. ఇకనుంచి ప్రతినెలా 2వ తేదీన క్రమం తప్పకుండా విద్యుత్ భద్రతా అవగాహన కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోని సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశించాం. వినియోగదారులు అవసరమైతే టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్ -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'
సాక్షి,వెలగపూడి : కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని 3వ బ్లాక్‌లో కర్మాగారాల శాఖ సంచాలకులు బాలకిషోర్ ఆధ్వర్యంలో 13 జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై మంత్రి సమీక్షించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగార యజమానులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అనధికార కర్మాగారాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులనుద్దేశించి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో విధులను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కర్మాగారాల యజమానులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. -
ఢిల్లీని ముంచెత్తిన గాలి దుమారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ గాలి దుమారం వణికించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఆ తీవ్రతకు ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు, గురుగ్రామ్, నోయిడాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నేడు అన్ని సాయంత్రపు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని హెచ్చరించింది. మరోవైపు ఉత్తర భారతదేశంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకూ తుపానులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రాజస్తాన్‌లో ఇసుక తుపానులు, ఆరు రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం గంటకు 50–70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. -
'విపత్తు తట్టుకునేలా నిర్మించాలి'
విశాఖపట్నం: ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించుకోవాలని, ప్రభావిత ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రెండో ప్రపంచ విపత్తుల నివారణ సదస్సు సూచించింది. నాలుగు రోజుల పాటు విశాఖలో నిర్వహించిన ఈ సదస్సు ఆదివారం ముగిసింది. ప్రపంచంలోని 46 దేశాల నుంచి సుమారు 100 మంది నిపుణులు, వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు సభలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రసంగించారు. ఆఖరి రోజున విశాఖపట్నం డిక్లరేషన్ పేరిట సదస్సులో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను నిపుణుల కమిటీ చైర్మన్, బిహార్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఏకే సిన్హా వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంతోపాటు, వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతో వచ్చే విపత్తుల నివారణపై మరింత దృష్టి సారించాలి. ఇంకా ఏం చెప్పారంటే.. విపత్తుల నిర్వహణకు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలకు నిధులు సమకూర్చే సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. విపత్తులకు ఎక్కువగా బాధితులయ్యే మహిళలు, పిల్లలు, యువత, వికలాంగులు, వృద్ధులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. కింది స్థాయిలో నాలెడ్జ్ మేనేజిమెంట్, అన్వేషణలను ప్రోత్సహించేందుకు ఒక వేదికను రూపొందించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం, ఇతర సంస్థలు విజయవంతంగా అమలు చేసిన చర్యలను, వాటి ఫలితాలను ఆయా దేశాలు పరస్పరం తెలియజేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలపై చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో పాఠశాల పిల్లలనూ భాగస్వాములను చేయాలి. వాతావరణ మార్పులు, వాటి పర్యవసనాలపై అవగాహన కల్పించాలి. గత వైపరీత్యాల తీవ్రత, నష్టాలు ప్రజలకు తెలిసేలా డిజాస్టర్ మ్యూజియం’లను ఏర్పాటు చేయాలి. సాయం అందించడంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలి. విపత్తుల నివారణకు అంతరిక్షం, టెలికాం, భూ విజ్ఞానశాస్త్రం, సైబర్, జియో మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఇకపై రెండేళ్లకోసారి ప్రపంచ స్థాయి డిజాస్టర్ మేనేజిమెంట్ సదస్సులు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకృతి విపత్తులను తట్టుకునేలా నిర్మించాలి. స్కూళ్లు, ఆస్పత్రులు, కాన్ఫరెన్స్ హాళ్లు వంటి భవనాల నిర్మాణాల్లో నాణ్యతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. -
రక్తదారులు
రహదారులు రక్తదారులవుతున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లినవారు మళ్లీ క్షేమంగా చేరతారో లేదోనని భయంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి. జాతీయ రహదారి అని ప్రకటించి దానికి దరిదాపుల్లో కూడా లేని నాణ్యతతో నిర్మిస్తున్న రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మూల మలుపులు, అండర్‌బైపాస్‌లు, రహదారి నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పాడైపోయిన జిల్లాలోని ఇతర రహదారులు కూడా ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి. కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : రహదారి ప్రమాదాలు భయపెడుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో 6,497 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 2,448 మంది ప్రాణాల కోల్పోగా 8,595 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఏడాదికి రెండు వేలకు పైగా ప్రమాదాలు సగటున రోజుకు ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోతుండగా ఆరుగురు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రక్తదారిగా రాజీవ్హ్రదారి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రాజీవ్ రహదారిపైనే జరుగుతున్నాయి. సరాసరి రోజుకు 3 ప్రమాదాలు ఈ రహదారిపైనే. జిల్లాలోని శనిగరం నుంచి రామగుండం వరకు 151 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న ఈ దారి... జిల్లాకు సంబంధించి అతి ముఖ్య రహదారి. ప్రజా, ఇతర రవాణా ఈ రహదారిపైనే ఎక్కువ. దీంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఒక్క రాజీవ్ రహదారిపైనే 1489 ప్రమాదాలు జరగగా 602 మంది దుర్మరణం చెందారు. 2084 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాల్లో అయినవాళ్లను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. క్షతగాత్రులుగా మారినవారెందరో. ముంచుతున్న విస్తరణ రాజీవ్ రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడంలో నిబంధనలు విస్మరిస్తుండడంతో ప్రమాదాలు పెరిగాయి. జాతీయ రహదారి ప్రమాణాలతో ఫోర్‌లేన్ నిర్మించాల్సి ఉండగా... ఇప్పటివరకు ఉన్న రహదారినే ఫోర్‌లేన్‌గా చూపుతున్నారు. రెండేళ్లుగా ఫోర్‌లేన్ పనులు జరుగుతున్నాయి. కానీ, పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం.. ఇష్టారాజ్యంగా వన్‌వే చేస్తుండడం.. అక్కడక్కడ నిర్మిస్తూ.. మధ్యలో వదిలేస్తుండడం, అండర్ బైపాస్ నిర్మాణాలు విస్మరించడం తదితర కారణాలతో ఈ రహదారిపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇష్టం వచ్చినచోట పనులు చేస్తూ అకస్మాత్తుగా వన్‌వే చేస్తుండడంతో రాత్రి సమయంలో గుర్తించక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనీసం సూచికలు కూడా ఏర్పాటు చేయడం లేదు. డివైడర్లపై సంబంధిత గ్రామాలకు అవగాహన కల్పించకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న డివైడర్ల వల్ల కూడా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రహదారి ప్రణాళిక సమయంలో ఆయా గ్రామాల రహదారులు పరిగణనలోకి తీసుకుకోకుండా నిర్మాణాలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింద ని ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామగుండం ప్రాంతంలో అండర్‌బైపాస్‌లు నిర్మించాల్సి ఉన్నా నిర్మించకుండా డివైడర్లు ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజీవ్ రహదారి వంకరటింకరగా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు రాగా, శాసనసభ ఉపసంఘం వేసి అధ్యయనం చేశారు. డిజైన్‌ను పలుచోట్ల మార్చాలని, సూచికలు ఏర్పాటు చేయాలని ఆ సంఘం సూచించినా... కాంట్రాక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సూచికలు లేకపోవడం, మలుపులపై అవగాహన లేకపోవడం, మద్యం మత్తులో డ్రైవింగ్‌తోనే ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. నామమాత్రంగా వారోత్సవాలు ఇటీవల నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాలు నామమాత్రమే అయ్యాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో రోడ్డకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఆచరణలో మాత్రం కనిపించలేదు. తూతూమంత్రంగా రాజీవ్హ్రదారి నోడల్ అధికారితో వారోత్సవ కార్యక్రమాలు చేపట్టి మమ అనిపించారు. జాతీయ రహదారిపై... గుండి హన్మండ్ల జగిత్యాల, ధర్మపురి నుంచి రాయపట్నం వరకు 78 కిలోమీటర్ల ఉన్న రహదారిపై నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 211 మంది మరణించారు. 2009లో 126 ప్రమాదాలు జరగగా 52 మంది మృతి చెందారు. 210 మంది గాయపడ్డారు. 2010లో 154 ప్రమాదాలు జరగగా 65 మంది చనిపోగా 182 మంది గాయాలపాలయ్యారు. 2011లో 146 రోడ్డు ప్రమాదాలు జరగగా 59 మంది మరణించారు. 196 మంది గాయపడ్డారు. 2012లో 115 ప్రమాదాలు జరిగి 54 మంది మృతిచెందగా, 101 మంది గాయపడ్డారు. 2013లో 84 ప్రమాదాలు జరిగి 34 మంది చనిపోగా 98 మంది క్షతగాత్రులుగా మారారు.