రహదారులు రక్తదారులవుతున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లినవారు మళ్లీ క్షేమంగా చేరతారో లేదోనని భయంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి. జాతీయ రహదారి అని ప్రకటించి దానికి దరిదాపుల్లో కూడా లేని నాణ్యతతో నిర్మిస్తున్న రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మూల మలుపులు, అండర్‌బైపాస్‌లు, రహదారి నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పాడైపోయిన జిల్లాలోని ఇతర రహదారులు కూడా ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి.
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : రహదారి ప్రమాదాలు భయపెడుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో 6,497 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 2,448 మంది ప్రాణాల కోల్పోగా 8,595 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఏడాదికి రెండు వేలకు పైగా ప్రమాదాలు సగటున రోజుకు ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోతుండగా ఆరుగురు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
రక్తదారిగా రాజీవ్హ్రదారి
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రాజీవ్ రహదారిపైనే జరుగుతున్నాయి. సరాసరి రోజుకు 3 ప్రమాదాలు ఈ రహదారిపైనే. జిల్లాలోని శనిగరం నుంచి రామగుండం వరకు 151 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న ఈ దారి... జిల్లాకు సంబంధించి అతి ముఖ్య రహదారి. ప్రజా, ఇతర రవాణా ఈ రహదారిపైనే ఎక్కువ. దీంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఒక్క రాజీవ్ రహదారిపైనే 1489 ప్రమాదాలు జరగగా 602 మంది దుర్మరణం చెందారు. 2084 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదాల్లో అయినవాళ్లను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. క్షతగాత్రులుగా మారినవారెందరో.
ముంచుతున్న విస్తరణ
రాజీవ్ రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడంలో నిబంధనలు విస్మరిస్తుండడంతో ప్రమాదాలు పెరిగాయి. జాతీయ రహదారి ప్రమాణాలతో ఫోర్‌లేన్ నిర్మించాల్సి ఉండగా... ఇప్పటివరకు ఉన్న రహదారినే ఫోర్‌లేన్‌గా చూపుతున్నారు. రెండేళ్లుగా ఫోర్‌లేన్ పనులు జరుగుతున్నాయి. కానీ, పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం.. ఇష్టారాజ్యంగా వన్‌వే చేస్తుండడం.. అక్కడక్కడ నిర్మిస్తూ.. మధ్యలో వదిలేస్తుండడం, అండర్ బైపాస్ నిర్మాణాలు విస్మరించడం తదితర కారణాలతో ఈ రహదారిపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇష్టం వచ్చినచోట పనులు చేస్తూ అకస్మాత్తుగా వన్‌వే చేస్తుండడంతో రాత్రి సమయంలో గుర్తించక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనీసం సూచికలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
డివైడర్లపై సంబంధిత గ్రామాలకు అవగాహన కల్పించకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న డివైడర్ల వల్ల కూడా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రహదారి ప్రణాళిక సమయంలో ఆయా గ్రామాల రహదారులు పరిగణనలోకి తీసుకుకోకుండా నిర్మాణాలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింద ని ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామగుండం ప్రాంతంలో అండర్‌బైపాస్‌లు నిర్మించాల్సి ఉన్నా నిర్మించకుండా డివైడర్లు ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
రాజీవ్ రహదారి వంకరటింకరగా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు రాగా, శాసనసభ ఉపసంఘం వేసి అధ్యయనం చేశారు. డిజైన్‌ను పలుచోట్ల మార్చాలని, సూచికలు ఏర్పాటు చేయాలని ఆ సంఘం సూచించినా... కాంట్రాక్టర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సూచికలు లేకపోవడం, మలుపులపై అవగాహన లేకపోవడం, మద్యం మత్తులో డ్రైవింగ్‌తోనే ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
నామమాత్రంగా వారోత్సవాలు
ఇటీవల నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాలు నామమాత్రమే అయ్యాయి. ముఖ్యంగా రాజీవ్ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో రోడ్డకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, ఆచరణలో మాత్రం కనిపించలేదు. తూతూమంత్రంగా రాజీవ్హ్రదారి నోడల్ అధికారితో వారోత్సవ కార్యక్రమాలు చేపట్టి మమ అనిపించారు.
జాతీయ రహదారిపై...
గుండి హన్మండ్ల జగిత్యాల, ధర్మపురి నుంచి రాయపట్నం వరకు 78 కిలోమీటర్ల ఉన్న రహదారిపై నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 211 మంది మరణించారు. 2009లో 126 ప్రమాదాలు జరగగా 52 మంది మృతి చెందారు. 210 మంది గాయపడ్డారు. 2010లో 154 ప్రమాదాలు జరగగా 65 మంది చనిపోగా 182 మంది గాయాలపాలయ్యారు. 2011లో 146 రోడ్డు ప్రమాదాలు జరగగా 59 మంది మరణించారు. 196 మంది గాయపడ్డారు. 2012లో 115 ప్రమాదాలు జరిగి 54 మంది మృతిచెందగా, 101 మంది గాయపడ్డారు. 2013లో 84 ప్రమాదాలు జరిగి 34 మంది చనిపోగా 98 మంది క్షతగాత్రులుగా మారారు.
రక్తదారులు
Published Fri, Feb 7 2014 4:36 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement