సీఎం ఇంటి వద్ద ఆశావహులు
శివాజీనగర: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతుండగా, ఆశావహులు గురువారం ఉదయం కూడా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలుసుకొని ఒత్తడి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. తమ కుమారుడికి సర్.సీ.వీ.రామన్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్.సీ.మహాదేవప్ప గురువారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలుసుకొని సుమారు రెండు గంటలకు పైగా చర్చించారు. సిద్దరామయ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఒత్తడి గురించి మహాదేవప్పకు తెలియజేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. టీ.నరసీపుర నియోజకవర్గం నుంచి ముందుగా సునీల్ బోస్‌ను బరిలోకి దింపి ఆ తరువాత సీ.వీ.రామన్ నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మహాదేవప్ప నిర్ధారించారు. అయితే ఆఖరి క్షణంలో నిర్ధారణను మార్చుకొని టీ.నరసీపుర నుంచి తానే బరిలోకి దూకి, సీ.వీ.రామన్‌నగర్‌కు కుమారుడికి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో సీ.వీ.రామన్ నగర్, పులికేశీనగర, మహాలక్ష్మీ లేఔట్, జయనగర హైవోల్టేజ్ నియోజకవర్గాలుగా మారాయి.
సర్.సీ.వీ.రామన్ నగర నియోజకవర్గంలో సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పీ.రమేశ్ ఆశావహుడు. మహదేవప్ప ప్రవేశంతో రమేశ్‌కు టికెట్ లభించటంలో త్రిశంకుస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా పులికేశీనగర నియోజకవర్గ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి టికెట్ ఇచ్చి గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన ప్రసన్నకుమార్‌కు సీ.వీ.రామన్నగర నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే ప్రయత్నాలు సైతం జరిగాయి. మేయర్ సంపత్‌రాజ్ ఈ రెండు నియోజకవర్గాల్లోను టికెట్ ఆశిస్తున్నారు. అందుచేత రాజకీయ ఒత్తడి పెరిగింది. అఖండ శ్రీనివాసమూర్తికి పులికేశీనగర నుంచి పోటీ చేయటానికి అవకాశం కల్పించాలని పట్టుబట్టిన ఆరు మంది జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పరమేశ్వర్, డీ.కే.శివకుమార్‌లతో నిత్యం చర్చలు జరుపుతున్నారు. గురువారం ఉదయం కూడా జమీర్ అహమ్మద్‌ఖాన్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలుసుకొని సుదీర్ఘ చర్చలు జరిపారు. అఖండ శ్రీనివాసమూర్తికి టికెట్ తప్పితే తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతుంది. ప్రసన్నకుమార్‌కు సర్.సీ.వీ.రామన్నగర నుంచి పోటీ చేయటానికి అవకాశం కల్పిస్తే ఆయనకు మద్దతుగా తాము ఉంటామని, అఖండ శ్రీనివాసమూర్తికి మాత్రం పులికేశీనగర నుంచే పోటీ చేయటానికి అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా అఖండ శ్రీనివాసమూర్తి కూడా సిద్దరామయ్యను కలుసుకొని తనకు టికెట్ ఇప్పించాలని విన్నవించారు.
డీకే.శివకుమార్ పట్టు: పావగడ విధానసభా నియోజకవర్గం నుంచి వెంకటరమణప్పకు టికెట్ ఇవ్వటానికి రాష్ట్ర కాంగ్రెస్ ఆమోదించి, ఒకే పేరును స్క్రీనింగ్ కమిటీకి పంపింది. అయితే ఇందుకు ప్రచార సమితి అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, తన అనుచరుడైన బలరామ పేరును కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని ఒత్తడి తీసుకొచ్చారు. బలరామ్ పావగడ సోలార్ పార్కు నిర్మాణ సమయంలో ప్రభుత్వం తరపున శ్రమించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాలూకాలో మంచి పేరుందని, గెలుపొందే అవకాశాలు ఉన్నాయని, ఆయనకే టికెట్ ఇవ్వాలని డీకే శివకుమార్ ఒత్తడి చేశారు. అలాగే మహాలక్ష్మీ లేఔట్ నియోజకవర్గ టికెట్ పంపిణీ సంబంధంపై కూడా రాజకీయ ఒత్తడి అధికంగా ఉంది. డీ.కే.శివకుమార్ తనకు అత్యంత సన్నిహితుడైన కేశవమూర్తి, మంజుల పురుషోత్తమ్ పేర్లను శిఫారస్సు చేశారు. అయితే కేపీసీసీ కార్యధ్యక్షుడు దినేశ్గుండురావుకు సన్నిహితుడుగా ఉన్నటువంటి గిరీశ్ కే.నాశికి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం ఉదయం డిల్లీకి వెళ్లే సమయంలోను మంత్రులైన ఎం.ఆర్.సీతారామ్, ఎం.బీ.పాటిల్, హెచ్.ఎం.రేవణ్ణ, రామలింగారెడ్డి, ఎమ్మెల్యే ఎన్.ఏ.హ్యారిస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్యను కలుసుకొని టికెట్ కోసం ఒత్తడి తీసుకొచ్చారు. మండ్య విధానసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి గణిగ రవికుమార్‌కు టికెట్ ఇవ్వాలని, గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అంబరీశ్ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేపట్టలేదని, ఆయనకు బదలుగా రవికుమార్‌కు ఇవ్వాలని సుమారు 100 మందికిపైగా కార్యకర్తల దండు సిద్దరామయ్యకు విన్నవించారు.