hca League
-
ఒకే రోజులో ట్రిపుల్ సెంచరీ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్‌లో పాలమూరు జట్టు రికార్డ్ స్కోర్‌ను నమోదు చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో పాలమూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. హైదరాబాద్‌లోని ఫిర్జాదిగూడ బాబురావుసాగర్ గ్రౌండ్–2లో సోమవారం జరిగిన హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో భాగంగా రాజీవ్ క్రికెట్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 5 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ స్కోర్ చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో జిల్లా జట్టు రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మెన్ గణేష్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అత్యధిక వ్యక్తిగత రికార్డు స్కోర్ చేశాడు. హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో తెలంగాణ జిల్లాల్లోని ఏ క్రీడాకారుడు సాధించని ఘనతను సాధించాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గణేష్ ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. రాజీవ్ సీసీ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 200 బంతుల్లో 42 ఫోర్లు, 7 సిక్స్‌లతో 318 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహేష్‌బాబు సెంచరీ చేసి రాణించాడు. 78 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. సునీల్‌రెడ్డి (30 నాటౌట్) చేశాడు. రాజీవ్ క్రికెట్ క్లబ్ బౌలర్లు మన్‌కేషా 2, ధీరజ్, పవన్‌కల్యాణ్, ట్రైలోక్ చెరో వికెట్లు తీశారు. గణేష్‌ను అభినందించిన ఎండీసీఏ ప్రతినిధులు... హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన గణేష్‌ను మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా అభినందించారు. జిల్లా క్రీడాకారుడు గణేష్ ట్రిపుల్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలని వారు ఆకాంక్షించారు. -
టైటిల్ పోరుకు ఆంధ్రా బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో సమష్టిగా రాణించిన ఆంధ్రా బ్యాంక్ జట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–డివిజన్ వన్డే లీగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఈసీఐఎల్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఆంధ్రా బ్యాంక్ 126 పరుగుల తేడాతో జై హనుమాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా బ్యాంక్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 365 పరుగుల భారీస్కోరు చేసింది. ఆశిష్ రెడ్డి (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), టి. రవితేజ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఓపెనర్లు నవీన్ రెడ్డి (41), రోనాల్డ్ రాస్ రోడ్రిగ్స్ (48) తొలి వికెట్‌కు 78 పరుగుల్ని జోడించి శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పీఎస్ చైతన్య రెడ్డి (40 బంతుల్లో 46; 3 ఫోర్లు, 1 సిక్స్), అభినవ్ కుమార్ (14 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎంఏ ఖాదిర్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో రంగనాథ్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం జైహనుమాన్ 36.3 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కష్టసాధ్యమైన లక్ష్యఛేదనలో జై హనుమాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శశిధర్ రెడ్డి (49; 7 ఫోర్లు), అనిరుధ్ రెడ్డి (57; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 111 పరుగులు జతచేసి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అయితే కె. సుమంత్ (3), విఠల్ అనురాగ్ (5), ప్రతీక్ రెడ్డి (5), సాకేత్ సాయిరామ్ (6), కార్తికేయ (2) క్రీజులో నిలవలేకపోయారు. మరో ఎండ్‌లో రోహిత్ రాయుడు (62 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టు ఆ మాత్రమైన స్కోరు సాధించగలిగింది. సూర్యతేజ (31) పరవాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో హితేశ్ యాదవ్ మూడు, రవితేజ, అమోల్ షిండే చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
సందీప్, చరణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వన్డే నాకౌట్ చాంపియన్‌షిప్‌లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు ముందంజ వేసింది. బ్యాట్స్‌మెన్ ఎంఎస్ఆర్ చరణ్ (103 బంతుల్లో 138; 17 ఫోర్లు, 6 సిక్సర్లు), బి. సందీప్ (67 బంతుల్లో 112 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో దుమ్మురేపడంతో సలీమ్‌నగర్ జట్టుపై బుధవారం 183 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 398 పరుగుల భారీస్కోరు సాధించింది. చరణ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా, సందీప్ అజేయ మెరుపు శతకంతో విజృంభిం చాడు. వీరిద్దరికి తోడు అక్షత్ రెడ్డి (53) అర్ధసెంచరీతో జట్టు భారీ స్కోరును అందుకుంది. అనంతరం సలీంనగర్ సీసీ 45 ఓవర్లలో 9 వికెట్లకు 215 పరుగులే చేసి పరాజయం పాలైంది. మీర్జా బేగ్ (40), ధనుశ్ (40), ఖాలిద్ ఖురేషి (51) పోరాడారు. ఆకాశ్, రిషికేత్ అజేయ శతకాలు కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ ఆకాశ్ యాదవ్ (98 బంతుల్లో 114 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషికేత్ సిసోడియా (83 బంతుల్లో 102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో ఉస్మానియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ ఎలెవన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కేంబ్రిడ్జ్ ఎలెవన్ 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 224 పరుగులు చేసింది. అనంతరం ఉస్మానియా జట్టు 24.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. హృదయ్ (42) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో మోహిత్ 3, సాత్విక్ 4 వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు హైదరాబాద్ బ్లూస్ సీసీ: 88 (సౌరవ్ రాథోడ్ 3/24, యశ్వంత్ రెడ్డి 3/14, కమల్ 4/20), ఎవర్గ్రీన్ సీసీ: 92/1 (విక్రమ్ నాయక్ 34 నాటౌట్, రాహుల్ బుద్ధి 44 నాటౌట్). విజయ్ హనుమాన్ సీసీ: 68 (శుభమ్ 3/11, రంగనాథ్ 4/20), జై హనుమాన్: 72/4 (సూర్యతేజ 31 నాటౌట్). ఎన్స్‌కాన్స్: 385/4 (సాయివ్రత్ 121, జునైద్ అలీ 56, మెహదీ హసన్ 45, అజర్ 59; విష్ణు 3/42), అగర్వాల్ సీనియర్ సీసీ: 69 (మెహదీ హసన్ 5/23). డెక్కన్ క్రానికల్: 317/3 (యశ్ కపాడియా 143, నితీశ్ 66, సీవీ మిలింద్ 88 నాటౌట్), గ్రీన్ టర్ఫ్: 141/6 (అక్షయ్ 32, కార్తీక్ 33 నాటౌట్). జెమినీ ఫ్రెండ్స్: 248/7 (షేక్ యాసిన్ 109, సాయి ప్రణయ్ 65), మహబూబ్‌నగర్: 223 (హర్షవర్ధన్ 115; రతన్‌తేజ 3/41). సాయి సత్య సీసీ: 231/8 (నిఖిల్ యాదవ్ 69), నిజామాబాద్: 232/7 (శ్రీకర్ రెడ్డి 92, లలిత్ యాదవ్ 42). -
షేక్ వాజిద్ డబుల్ సెంచరీ
130 బంతుల్లో 204; 22 ఫోర్లు, 6 సిక్సర్లు ఎ–3 డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–3 డివిజన్ వన్డే లీగ్‌లో అంబర్పేట్ సీసీ జట్టు బ్యాట్స్‌మన్ షేక్ వాజిద్ (130 బంతుల్లో 204; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టే ప్రదర్శన చేశాడు. రిలయన్స్ సీసీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు డబుల్ సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు 419 పరుగుల తేడాతో రిలయన్స్ సీసీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అంబర్పేట్ సీసీ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 505 పరుగుల భారీస్కోరు చేసింది. వాజిద్‌తో పాటు చందు (100 బంతుల్లో 166 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. షేక్ నాజిర్ (66) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అభినవ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రిలయన్స్ జట్టును నాజిర్ (6/39) వణికించాడు. అతని ధాటికి 21.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరో మ్యాచ్ వివరాలు రాజు సీఏ: 63 (ప్రతీక్ సెహగల్ 6/23, మానిక్ 4/28), పికెట్ సీసీ: 64 (సాహి తి కుమార్ 30, జ్ఞాన సాయి 18). -
వయసు...8 వికెట్లు...6
హెచ్‌సీఏ లీగ్‌లో బుడతడి సంచలనం సాక్షి, హైదరాబాద్: ఆ పిల్లాడి వయసు 8 ఏళ్లు... గత మూడేళ్లుగా క్రికెట్ నేర్చుకుంటున్నాడు. తొలి సారి పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. మొదటి వన్డే మ్యాచ్‌లోనే తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును చిత్తు చేశాడు. 12.3 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 మెయిడిన్లు కూడా ఉన్నాయి. (లీగ్స్ నిబంధనల ప్రకారం వన్డే మొత్తం ఓవర్లలో ఒక బౌలర్ మూడో వంతు ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు). హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్స్‌లో పట్టపు రాఘవ అనే చిన్నారి సంచలన ప్రదర్శన ఇది. వివరాల్లోకెళితే...హెచ్‌సీఏ లీగ్స్‌లో భాగంగా ఆదివారం చమ్స్ ఎలెవన్, హైదరాబాద్ వాండరర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చమ్స్ ఎలెవన్ బౌలర్ రాఘవ (6/21) ధాటికి వాండరర్స్ 34.3 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. అనంతరం చమ్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు చేసి విజయాన్నందుకుంది. హెచ్‌సీఏ లీగ్ చరిత్రలో పిన్న వయస్కుడైన క్రికెటర్ (8 ఏళ్ల 3 నెలలు)గా రాఘవ రికార్డు సృష్టించాడు. మాజీ ఆటగాడు ఎస్ఆర్ సురేశ్ వద్ద అతను శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నారాయణగూడలోని శ్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న రాఘవకు కరాటేలోనూ మంచి నైపుణ్యం ఉంది. అండర్-9 కేటగిరీలో అతను అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం.