head constable dead
-
HYD: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రామయ్య గురువారం మింట్ కాంపౌండ్‌లో విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో తన తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో, బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది కూడా చదవండి: కర్రతో కొట్టి చోరీయత్నం.. ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం -
తుపాకీ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
తిరుపతి క్రైమ్: తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో తిరుపతి ప్రత్యేక జైలులో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. వెస్ట్ సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఏఆర్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణరెడ్డి (47) ఏడాది నుంచి సబ్ జైలు వద్ద గార్డుగా పనిచేస్తున్నాడు. లక్ష్మీనారాయణరెడ్డి ఎప్పటిలానే శనివారం సాయంత్రం 6.00 గంటలకు డ్యూటీ ముగించుకున్నాడు. ఇంటికి వెళ్లేందుకని బట్టలు మార్చుకునే సమయంలో తుపాకీ (303 రైఫిల్) పక్కన పెడుతుండగా మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ గుండెలోకి దూసుకు వెళ్లడంతో లక్ష్మీనారాయణరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. -
కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి
సాక్షి, రాజమండ్రి: స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలన సృష్టించింది. సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు గురువారం మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఆనంద్ నగర్ ఆటో స్టాండ్ వద్దకు వచ్చేసరికి వెనుక వైపు నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గరు యువకులు అతడి మైటారు సైకిల్‌ను ఢీ కొట్టారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ ఆ యువకుల మోటార్ సైకిల్ నంబర్‌ను సెల్ఫోన్లో ఫోటోలు తీస్తుండగా వారు అతనితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా యువకులు కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. కత్తులతో వీరంగా సృష్టించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం తనపై దాడి జరిగినట్టుగా కానిస్టేబుల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరకుని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారందరినీ అరెస్ట్ చేస్తామని ఎస్ఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ కానిస్టేబుల్‌కు చికిత్స అందిస్తున్నారు. -
విషాదాన్ని నింపిన తాడిపూడి రిజర్వాయర్ ఘటన
విజయనగరం : సాగునీటికి ప్రాణాదారమైన తాటిపూడి జలాశయం వద్ద నేటి ఉదయం చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. జలాశయంలో గల్లంతైన మహిళ కోసం వెతుకుతూ వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సింహాచలంగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు గల్లంతైన మహిళ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. విజయనగరం జిల్లాలోని మూడు మండలాలకు సాగునీటితో పాటు, విశాఖపట్నానికి తాగునీరు అందించడానికి ప్రధాన ఆధారంగా ఈ తాడిపూడి జలాశయం ఉంది. ఈ జలాశయానికి మొత్తం నాలుగు ప్రధాన గేట్లుండగా.. వాటిలో మొదటి గేటు శనివారం ఉదయం విరిగిపోయింది. ఒక్కసారిగా పైనున్న నీళ్లన్నీ ఉధృతమైన ప్రవాహంతో కిందకు రావడంతో, కిందివైపు దుస్తులు ఉతుక్కుంటున్న ఇద్దరు మహిళలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయారు. వారిలో ఒకరు ఆచూకీ కొన్ని గంటల తర్వాత లభ్యమవడంతో, గల్లంతైన మహిళ కోసం వెతకడం ప్రారంభించారు. జామి గోస్థని నదిలో గాలిస్తూ వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్ ఏరులో పడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జలాశయ గేట్ల నిర్వహణ సరిగా లేదని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారు. వెంటనే అడ్డుకట్ట వేయకపోతే మొత్తం గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయని చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి
సైదాపురం: నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. కండలేరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హజరతయ్య గూడురు నుంచి డ్యూటీ నిమిత్తం బైక్‌పై వెళుతుండగా టిప్పర్ ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తలుపూరు-మణిచేడు మార్గం మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.