అందరికీ ఆరోగ్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. కుషు్ట, టీబీ, పాలియేటివ్ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 30 వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడతారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్వాడీ సభ్యుల సహకారం తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో స్క్రీనింగ్ చేసి సంబంధిత నివేదికను రోజూ జిల్లా కార్యాలయానికి పంపించాలి. అదే నివేదికను విలేజ్ హెల్త్ సరీ్వస్ యాప్‌లో నమోదు చేయాలని యోగితా రాణా కోరారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలను స్క్రీనింగ్ చేస్తారు. రోజూ 20 ఇళ్ల చొప్పున స్క్రీనింగ్ చేయాలి. ఇద్దరు చొప్పున ఒక టీమ్‌గా ఏర్పడి పని చేయాల్సి ఉంటుంది. దాదాపు కోటి కుటుంబాలను ఈ సందర్భంగా కలిసే అవకాశముంది. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అని పేర్కొంటున్నా.. ఈ కార్యక్రమంలో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతున్నట్లు కనిపించట్లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ మార్గదర్శకాలు..
హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఇది మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డు తయారు చేయడానికి వీలవుతుంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే పరీక్షలకు ఓ మెడికల్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తారు. సబ్ సెంటర్‌కు ఏఎన్ఎం పర్యవేక్షణగా ఉంటారు.
ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా లేకుంటే సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాధులు, అనుమానిత రోగాలను గుర్తించి నమోదు చేయాలి. వాటిని అదే రోజు జిల్లా వైద్యాధికారికి పంపాలి.
టీబీ కేసులు ఏవైనా ఉంటే నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలి.
ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాలి.
ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ప్రొటోకాల్ ప్రకారం వైద్యం చేయాలి. వైద్యం చేయించే తేదీ కూడా నమోదు చేయాలి.
రోజువారీ స్క్రీనింగ్ వివరాలను గ్రామ ఆరోగ్య రికార్డులో ఏఎన్ఎంలు నమోదు చేయాలి.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఈ నెల 17న ఉంటుంది. జిల్లాల్లో 20 నుంచి 22 వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఈ నెల 24, 25 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రకటిస్తారు.