పడగవిప్పిన కోట్ల'పాము'
► పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సీఈ ఆస్తులపై ఏసీబీ దాడులు
► రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు
► ఇంకా కొనసాగుతున్న సోదాలు
విలాసవంతమైన ఆ భవంతిలో ప్రతి గదీ అక్రమాస్తులకు అడ్డానే..ఒక గదిలో బంగారం, మరో గదిలో వెండి, ఇంకో గదిలో కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, ఎక్కడంటే అక్కడే పడేసి ఉన్న ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, చివరకు పాత ఐదు వందల నోట్లు.. ఇలా ఆ ఇల్లే ఓ ఆస్తుల గనిగా కనిపించింది.. అవినీతి కోరలు చాచి కూడబెట్టిన ఈ ఆస్తుల గనికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సీఈ పాము పాండురంగారావు ఆద్యుడు. శుక్రవారం ఈ కోట్ల పాముపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడులతో రాజధాని ప్రాంతంలో కలకలం రేగింది.
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): పట్టణ పరిధిలోని నవోదయ కాలనీలో ఓ అపార్టుమెంట్. ఉదయం ఆరు గంటలకు రయ్‌మంటూ వాహనాలు దూసుకురావడం, టప్‌టప్ మంటూ బూట్ల శబ్దాలతో అధికారులు వేగంగా వాహనాలు దిగడం అపార్ట్మెంట్లోకి వెళ్లడం క్షణాల్లో జరిగిపోయింది. వచ్చినవారు ఎవరో కనీసం అపార్ట్మెంట్ వాచ్‌మన్ సైతం తెలుసుకొనేలోగా ఓ ప్లాట్‌లోకి దూసుకెళ్లారు. ఇంట్లో వాళ్లకు అర్థమయ్యేలోగా ఒక్కొక్కరు ఒక్కో గది లోకి వెళ్లి సోదాలు ప్రారంభించారు. ఆరా తీస్తే తాము ఏసీబీ నుంచి వచ్చామని బాంబు పేల్చారు.
ఇదీ శుక్ర వారం ఉదయం పట్టణంలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సీఈ పాము పాండురంగారావు ఇంటిపై ఏబీసీ దాడి చేసిన తీరు. కొద్దిసేపటికే ఈ వార్త రాజధాని ప్రాంతంలో దావానంలో వ్యాపించింది. కోట్ల రూపాలయ ఆస్తులు గుర్తిస్తున్నారని ఉప్పందింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఏబీసీ దాడులు చేస్తున్నంత సేపు ఏ ఇద్దరు అధికారులు కలిసినా ఇదే చర్చ జరిగింది.
ఇల్లే కార్యాలయం
ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో స్థానికంగా నివసించే పలువురిని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పాండురంగారావును ఎవరైనా కలవడానికి వస్తే ఇంట్లోనే కూర్చోబెట్టి మాట్లాడే వారని తెలిసింది.. ఆయన ఇంట్లో నుంచి బయటకు రావడం చాలా అరుదని, ఒక వేళ ఒకేసారి ఇద్దరు ముగ్గురు వస్తే ఒకరి తర్వాత ఒకరిని పిలిచి మాట్లాడేవారని స్థానికులు తెలిపారు. ఉదయం ఆరు నుంచి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జనం వస్తూనే ఉంటారని చెప్పారు.