health minister Laxmareddy
-
‘తెలంగాణ కంటి వెలుగు’లు
సాక్షి, హైదరాబాద్ : కంటి చూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించేందుకుగాను ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం చేపడుతోంది. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ పంపింది. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షలు చేసేందుకు పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ, పరీక్ష కేంద్రాల కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కార్యక్రమం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ మూడో వారంలోనే కార్యక్రమం ప్రారంభించాలనుకున్నా ‘రైతు బంధు’చెక్కుల పంపిణీ నేపథ్యంలో మే మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 3.5 కోట్ల మంది కోసం ఏర్పాట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల వయస్సు వారికి ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారు మినహా రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి పరీక్షల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గ్రామాల వారీ షె డ్యూల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ ఖరారు చేస్తోంది. రోగులకు ఇచ్చే మందులు, దృష్టి లోపాలున్న వారి కోసం 40 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ కళ్లద్దాల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. దేశంలో భారీ సంఖ్యలో కళ్లద్దాలు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లోనే ఉత్పత్తి ఎక్కువగా ఉంది. టెండర్లలో ఎంపికయ్యే కంపెనీలు తక్కువ సమయంలో కళ్లద్దాలు సరఫరా చేసేలా నిబంధనలు రూపొందించారు. బాధ్యతల పంపిణీ కంటి పరీక్షల నిర్వహణ పూర్తిగా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చూసుకుంటారు. అవసరమైన వారికి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. రోగుల వివరాల నమోదు సహా అవసరమైన ఏర్పాట్లు సమకూర్చుతారు. వివరాల నమోదులో మెడికల్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడికి ఏఎన్ఎం (ఎంపీహెచ్ఏ) సహాయం చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలకు నమూనాలు సేకరిస్తారు. ఫార్మసిస్టు పరీక్షల నివేదికల ఆధారంగా మందులు, కళ్లద్దాలను వైద్య నిపుణులు రోగులకు ఇస్తారు. కంటి పరీక్షల శిబిరానికి గ్రామ ప్రజలను తీసుకొచ్చేలా ఆశా కార్యకర్తలు పని చేస్తారు. స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో.. కంటి పరీక్షల నిర్వహణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆశా కార్యకర్తలతో బృందాలు ఏర్పాటు చేస్తోంది. నేత్ర వైద్య నిపుణులు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్కూళ్లు, కమ్యూనిటీ భవనాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు ఎక్కడ నిర్వహించాలో మండల స్థాయి అధికారులు నిర్ణయించనున్నారు. 43 శాతం శుక్లాల వల్లే.. మారుతున్న జీవన శైలి, పౌష్టికాహారలోపాలే దృష్టి లోపాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చితే కంటి చూపు సమస్యలున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల దృష్టి లోపం ఏర్పడుతున్నాయి. కంటి చూపు కోల్పోయిన వారిలో 43 శాతం మంది శుక్లాల వల్లే చూపు కోల్పోయారని నిర్ధారించారు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా మధుమేహం కారణంగా కంటిచూపు సమస్య (డయాబెటిక్ రెటీనోపతి)తో బాధపడుతున్నారు. వీటితోపాటు మరో 7 శాతం మంది నీటి కాసులు (గ్లకోమా)తో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు శుక్లాలు 43 శాతం నీటి కాసులు 7 శాతం డయాబెటిక్ రెటీనోపతి 7 శాతం బాల్యంలో అంధత్వం 4 శాతం నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం చూపు మందగించడం 3 శాతం -
గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవోపై వేటు
డీఎంఈకి సరెండర్ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ సరస్వతిపై వేటు పడింది. ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలోని ఆర్ఎంవోలకు అదనంగా మరికొన్ని అధికారాలు కల్పించారు. ఇకపై ఎవరి పరిధిలో చోటు చేసుకునే ఘటనలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్, డీఎంఈ రమణిలను ఆదేశించారు. పనితీరును మెరుగు పర్చుకుని, రోగులకు ఉత్తమ సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బుధవారం డీఎంఈతో కలసి ఆయన గాంధీ జనరల్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ వార్డుల్లో అందుతున్న సేవలను.. ఫార్మసీలో మందులను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయా విభాగాల అధిపతులతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చేయండి.. ప్రజలకు ఇప్పుడిప్పుడే ప్రజావైద్యంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ‘‘ఇలాంటి సమయంలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజావైద్యానికి మంచి పేరు తీసుకురావాల్సిన వైద్యులు.. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటి? ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించినా, పేషెంట్లను విస్మరించినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా చర్యలు తప్పవు. ఇకపై వైద్యులు సహా వైద్య సిబ్బంది అంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి’’ అని ప్రభుత్వ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆ మేరకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి.. ఆస్పత్రుల్లో రోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి దేశంలోనే మంచి పేరుందని, ఆ పేరును చెడగొట్టవద్దని వైద్య సిబ్బందికి సూచించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని ఆస్పత్రుల్లో 20 శాతం ఓపీ పెరిగిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉందన్నారు. చిన్నచిన్న నిర్లక్ష్యాలు, పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారుతున్నాయని, ఆర్ఎంవోలంతా ఎవరి డ్యూటీ వారు చేయాలని సూచించారు. ఇటీవలి వరుస సంఘటనలను ఉదహరిస్తూ అలాంటివి పునరావృతమైతే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రోగుల సహాయకుల కోసం అదనంగా కొన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ఒక రోగికి ఒక సహాయకుడినే అనుమతించాలని సూచించారు. కొత్తగా 65 పడకలతో ఐసీయూ.. గాంధీలో కొత్తగా 65 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. నెల రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య పరీక్షల కోసం మరో కొత్త ల్యాబ్ సహా అత్యాధునిక వైద్య పరి కరాలు అందుబాటులోకి తీసుకురా ను న్నట్లు తెలిపారు. ఇకపై ఆస్పత్రికి వచ్చిన రోగుల పూర్తి వివరాలతో పాటు వారికి అందించిన చికిత్స వివరాలను కూడా కంప్యూటర్లో పొందుపర్చనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లోనూ 20 వేల పడకలు ఉండగా, ఇప్పటికే లక్ష బెడ్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
విద్యా విధానం ప్రక్షాళన
నాగర్‌కర్నూల్ : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకుగాను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ మంగళవారం ముగిసింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చేసిన ప్రయోగాలు జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపునిచ్చేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మణెమ్మ, ఎంపీపీ శాంతమ్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మీబాయి, డిప్యూటీ ఈఓలు సుబ్రమణ్యేశ్వరశర్మ, రవీందర్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాలలు వేశారు. అలాగే యూరీలో భారత సైనికుల మతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. -
'సీఎం ఆదేశించినా పనుల్లో జాప్యం'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశించినా హెల్త్‌కార్డుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, జాప్యం జరుగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులతో శనివారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. హెల్త్‌కార్డులు, నగదు రహిత వైద్యంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత ఓపీ సౌకర్యాన్నికల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి లక్ష్మారెడ్డికి విన్నవించారు.