విద్యా విధానం ప్రక్షాళన
Published Wed, Sep 28 2016 12:49 AM | Last Updated on Sat, Sep 15 2018 7:30 PM
నాగర్‌కర్నూల్ : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకుగాను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ మంగళవారం ముగిసింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చేసిన ప్రయోగాలు జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపునిచ్చేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
అనంతరం సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మణెమ్మ, ఎంపీపీ శాంతమ్మ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మీబాయి, డిప్యూటీ ఈఓలు సుబ్రమణ్యేశ్వరశర్మ, రవీందర్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాలలు వేశారు. అలాగే యూరీలో భారత సైనికుల మతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
Advertisement