సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు.
విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా..
► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది.
► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు.
► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు.
కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్‌ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్‌దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు.
15 గంటల్లోనే ఈ బైక్ తయారీ
తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్‌డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు.
ఏ ఆలోచన వచ్చినా ..
ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి.
– జి.గౌతమ్, పార్వతీపురం
చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే!
Comments
Please login to add a commentAdd a comment